దేవదాయ శాఖకూ ఆర్టీఐ వర్తిస్తుంది
ABN , Publish Date - Mar 22 , 2025 | 01:11 AM
దేవదాయ శాఖ పరిపాలన విభాగాల్లో ఆర్టీఐ చట్టం అమలుకు తీసుకున్న చర్యల వివరాలను దరఖాస్తుదారులకు వెంటనే అందజేయాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర కమిషనర్ చావలి సునీల్ ఆ శాఖ అధికారులను హెచ్చరించారు.

దరఖాస్తుదారులకు సమాచారం ఇవ్వకపోతే చర్యలు తప్పవు
ఆర్టీఐ కమిషనర్ చావలి సునీల్
కొత్తూరు, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): దేవదాయ శాఖ పరిపాలన విభాగాల్లో ఆర్టీఐ చట్టం అమలుకు తీసుకున్న చర్యల వివరాలను దరఖాస్తుదారులకు వెంటనే అందజేయాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర కమిషనర్ చావలి సునీల్ ఆ శాఖ అధికారులను హెచ్చరించారు. దేవదాయ శాఖ పరిధిలోని కమిషనర్, ఆర్‌జేసీ, డీసీ, ఏసీ, జిల్లా అధికారి, డివిజన్ ఇన్‌స్పెక్టర్, తదితర పరిపాలన కార్యాలయాల్లో ఆర్టీఐ చట్టం అమలు విషయమై రాష్ట్ర సమాచార కమిషన్‌లో దాఖలైన అప్పీలును వర్చువల్ విధానంలో శుక్రవారం విచారించారు. ఈ సందర్భంగా దరఖాస్తుదారు కోరిన సమాచారం ఇవ్వకుండా, హైకోర్టు తీర్పు ప్రకారం దేవదాయ శాఖకు ఆర్టీఐ చట్టం వర్తించదని అధికారులు దాటవేత ధోరణితో పొంతన లేని సమాధానాలివ్వడం పట్ల కమిషనర్ సునీల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీఐ చట్టం ఉద్యమకర్త కాండ్రేగుల వెంకటరమణ మాట్లాడుతూ, ప్రజలపై ప్రభావం చూపించే సమాచారాన్ని ఎవరూ కోరకుండానే అధికార యంత్రాంగం ఆర్టీఐ చట్టం సెక్షన్ 4(1) (సి) ప్రకారం స్వచ్ఛందంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. దేవదాయ శాఖ పరిపాలనా విభాగాలు హైకోర్టు తీర్పును ఊటంకిస్తూ సమాచారం ఇవ్వకపోవడం తగదని అన్నారు.