Share News

కలిసికట్టుగా అభివృద్ధికి బాట

ABN , Publish Date - Mar 23 , 2025 | 10:45 PM

మండలంలోని పలు గ్రామాలకు రహదారి సౌకర్యం లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. గర్భిణులను, అనారోగ్యానికి గురైన వారిని ఆస్పత్రికి తరలించాలంటే డోలీమోతలే దిక్కు.

కలిసికట్టుగా అభివృద్ధికి బాట
బొర్రాపూలుగుడ నుంచి బల్లమామిడి మీదుగా బొరింగవలస వరకు ఎక్స్‌కవేటర్‌తో ఇటీవల రోడ్డు పనులు చేయిస్తున్న గిరిజనులు

చందాలు వేసుకుని తాత్కాలిక రహదారి నిర్మించుకున్న మూడు గ్రామాల గిరిజనులు

రెండు కిలో మీటర్ల మేర పనులు పూర్తి

డబ్బులు చాలక నిలిచిపోయిన మరో కిలో మీటరు రహదారి నిర్మాణం

అధికారులు స్పందిస్తే పూర్తయ్యే అవకాశం

అనంతగిరి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామాలకు రహదారి సౌకర్యం లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. గర్భిణులను, అనారోగ్యానికి గురైన వారిని ఆస్పత్రికి తరలించాలంటే డోలీమోతలే దిక్కు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంత మంది అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం శూన్యం. ఈ సమస్యను తామే పరిష్కరించుకోవాలని మూడు గ్రామాల గిరిజనులు నిర్ణయించుకున్నారు. చందాలు వేసుకుని సుమారు రెండు కిలో మీటర్ల మేర తాత్కాలిక రహదారిని నిర్మించుకున్నారు. మరో కిలో మీటరు మేర రహదారి వేయాల్సి ఉన్నా డబ్బులు లేక పనులకు బ్రేక్‌ పడింది.

మండలంలోని కొండిబ పంచాయతీ బల్లమామిడి, బొరింగవలస, జామిగుడ గ్రామాలకు ఇప్పటికీ రహదారి సౌకర్యం లేదు. ఆ మూడు గ్రామాల్లో 40 కుటుంబాలకు చెందిన 200 మంది గిరిజనులు నివాసముంటున్నారు. తమ గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నారు. ఫలితం లేకపోవడంతో చేసేది లేక వదిలేశారు. ఇబ్బందుల నడుమ జీవనం సాగిస్తున్నారు. అయితే మూడు గ్రామాల పెద్దలు పండన్న, భీమన్న, చిన్నయ్య ముందుకు వచ్చి ఆయా గ్రామాల ప్రజలతో సమావేశమయ్యారు. చందాలు వేసుకుని రహదారి ఏర్పాటు చేసుకుందామని పిలుపునిచ్చారు. ఎవరికి తోచిన సాయం వారు అందించడంతో సుమారు రూ.70 వేలు వచ్చింది. దీంతో ఈ నెల 17వ తేదీన ఎక్స్‌కవేటర్‌తో బొర్రా పంచాయతీ పూలుగుడ నుంచి బల్లిమామిడి, బొరింగవలస సమీపం వరకు పనులు చేపట్టారు. ఈ నెల 20న రెండు కిలో మీటర్ల వరకు తాత్కాలిక రహదారి నిర్మించారు. మరో కిలో మీటరు మేర రహదారి నిర్మిస్తే టోకూరు పంచాయతీ కేంద్రానికి సులువుగా చేరుకోవచ్చు. అయితే మిగతా రహదారి నిర్మాణానికి డబ్బులు లేకపోవడంతో బొరింగవలస గ్రామం మీదుగా జామిగుడకు మట్టిరోడ్డు పనులు నిలిచిపోయాయి.

తప్పని డోలీమోతలు

అత్యవసర సమయాల్లో డోలీమోతలు తప్పడం లేదని ఆయా గ్రామాల గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. సుమారు మూడు గ్రామాల నుంచి మూడు కిలో మీటర్లు డోలీమోతపై కొండిబ పంచాయతీ సిసాముండ వరకు తీసుకువచ్చి అక్కడ నుంచి ఆస్పత్రికి తరలించాల్సిన దుస్థితి నెలకొందని వారు వాపోతున్నారు. అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరుచేయాలని వేడుకుంటున్నారు.

Updated Date - Mar 23 , 2025 | 10:45 PM