Share News

వేడెక్కిన గ్రేటర్‌ రాజకీయం

ABN , Publish Date - Mar 23 , 2025 | 01:21 AM

మహా విశాఖ నగర పాలక సంస్థ రాజకీయం వేడెక్కింది. జీవీఎంసీ ఎన్నికల్లో అత్యధిక వార్డులను గెలుచుకుని మేయర్‌, రెండు డిప్యూటీ మేయర్‌ పదవులను దక్కించుకున్న వైసీపీ బలం 2024 సాధారణ ఎన్నికల తర్వాత తగ్గుతూ వచ్చింది.

వేడెక్కిన గ్రేటర్‌ రాజకీయం

  • మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి కూటమి నోటీస్‌

  • 70 మంది కార్పొరేటర్ల సంతకాలతో కలెక్టర్‌కు అందజేత

  • వచ్చే నెల మొదటి వారంలో కౌన్సిల్‌ సమావేశం జరిగే అవకాశం

  • మేయర్‌ మార్పు ఇక లాంఛనమే?

  • కొత్త మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పోస్టులపై జోరుగా చర్చ

  • జీవీఎంసీలో మారుతున్న సమీకరణాలపై సర్వత్రా ఆసక్తి

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

మహా విశాఖ నగర పాలక సంస్థ రాజకీయం వేడెక్కింది. జీవీఎంసీ ఎన్నికల్లో అత్యధిక వార్డులను గెలుచుకుని మేయర్‌, రెండు డిప్యూటీ మేయర్‌ పదవులను దక్కించుకున్న వైసీపీ బలం 2024 సాధారణ ఎన్నికల తర్వాత తగ్గుతూ వచ్చింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బలం పెరిగింది. ఈ నేపథ్యంలో మేయర్‌ గొలగాని హరివెంకటకుమారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు జిల్లా కలెక్టర్‌, జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్‌ ఎంఎన్‌ హరేంధిరప్రసాద్‌కు శనివారం కూటమి ఎమ్మెల్యేలు, నాయకులు, కార్పొరేటర్లు నోటీస్‌ అందజేశారు. దీంతో జీవీఎంసీ కౌన్సిల్‌లో ఏం జరుగుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి పెరిగింది.

జీవీఎంసీకి 2020 మార్చిలో జరిగిన ఎన్నికల్లో మొత్తం 98 వార్డులకుగాను వైసీపీ 59 వార్డులను గెలుచుకుంది. ఇండిపెండెంట్‌లుగా గెలిచిన నలుగురు వైసీపీకి మద్దతు ప్రకటించడంతో కౌన్సిల్‌లో వైసీపీకి తిరుగులేకుండా పోయింది. ఈ క్రమంలోనే మూడుసార్లు జరిగిన స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో పదికి పది స్థానాలను వైసీపీ గెలుచుకుంది. 2024 సాధారణ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రంలో అధికారం దక్కించుకోవడంతో జీవీఎంసీ కౌన్సిల్‌లో సమీకరణాలు మారిపోయాయి. వైసీపీకి మద్దతు ప్రకటించిన నలుగురు కార్పొరేటర్లలో ఇద్దరు టీడీపీ, మరో ఇద్దరు జనసేనలో చేరారు. వైసీపీ నుంచి 21వ వార్డు కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలిచిన వంశీకృష్ణశ్రీనివాస్‌ ఎమ్మెల్సీ (ప్రస్తుతం ఆయన జనసేన ఎమ్మెల్యేగా ఉన్నారు)గా ఎంపికవ్వడంతో కార్పొరేటర్‌ పదవికి రాజీనామా చేయగా, ఆ స్థానానికి ఇంతవరకూ ఎన్నిక జరగలేదు. మిగిలిన 58 మంది కార్పొరేటర్లలో దాదాపు 31 మంది టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరిపోయారు. దీంతో వైసీపీ బలం 27కి తగ్గిపోగా, కూటమి బలం 70కి పెరిగింది. వీరు కాకుండా ఎక్స్‌అఫిషియో సభ్యులుగా కౌన్సిల్‌లో ఓటు హక్కు కలిగిన ఎమ్మెల్యేలు ఎనిమిది మంది, ఎంపీలు ఇద్దరు, ఎమ్మెల్సీ ఒకరు కూటమికి ఉన్నారు. ప్రస్తుతం కూటమి సభ్యుల సంఖ్య 81కి పెరిగింది.

కౌన్సిల్‌లో తగినంత మెజారిటీ ఉండడంతో వైసీపీకి చెందిన మేయర్‌ గొలగాని హరివెంకటకుమారిపై అవిశ్వాస తీర్మానం పెట్టాని నిర్ణయానికి వచ్చారు. అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడానికి సగం కంటే ఎక్కువ మంది సభ్యుల బలం సరిపోయినా, తీర్మానం నెగ్గాలంటే మాత్రం కౌన్సిల్‌లో ఓటుహక్కు కలిగిన సభ్యుల్లో 2/3 వంతు మెజారిటీ తప్పనిసరి. కౌన్సిల్‌లో మొత్తం ఓటు హక్కు కలిగిన సభ్యులు 97 మంది కార్పొరేటర్లు, 14 మంది ఎక్స్‌అఫిషియో సభ్యులు మొత్తం 111 మంది ఉండగా, వారిలో 2/3 వంతు అంటే 74 మంది సభ్యులు అవసరం అవుతారు. కూటమికి ఇప్పటికే సుమారు 81 మంది సభ్యుల బలం ఉండడంతో మేయర్‌పై అవిశ్వాస తీర్మానం కోరుతూ శనివారం జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌కు నోటీస్‌ అందజేశారు. నోటీసుపై ఉన్న సంతకాలు సభ్యులవేనా?, కాదా? అని నిర్ధారించుకున్న తర్వాత, అవిశ్వాస తీర్మానంపై చర్చకు కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు తేదీని నిర్ణయించి సభ్యులకు నోటీసులు జారీచేస్తారు. ఇప్పటికి ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే మేయర్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందని, పదవి నుంచి గొలగాని హరివెంకటకుమారి వైదొలగడం లాంఛనమేనని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇదిలావుండగా మేయర్‌ పదవికి కూటమి నుంచి ఎవరు పోటీలో ఉంటారనే దానితోపాటు డిప్యూటీ మేయర్లుగా ఎవరికి అవకాశం దక్కుతుందనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీడీపీ ఫ్లోర్‌లీడర్‌గా వ్యవహరిస్తున్న పీలా శ్రీనివాస్‌ను 2021లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల సమయంలోనే మేయర్‌ అభ్యర్థిగా ప్రకటించారు. టీడీపీకి తక్కువ సీట్లు రావడంతో ఆయనకు ఫ్లోర్‌లీడర్‌ పదవిని అప్పగించారు. ఇప్పుడు కూటమికి మేయర్‌ పీఠం దక్కితే పీలా శ్రీనివాస్‌కే అవకాశం ఇస్తారని అంటున్నారు. అయితే బీసీ మహిళను మేయర్‌ పీఠం నుంచి దింపితే తిరిగి బీసీ మహిళకే పదవి కట్టబెట్టడం ద్వారా విమర్శలకు అవకాశం లేకుండా చేయవచ్చునని కొందరు కూటమి ప్రజా ప్రతినిధులు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. మరోవైపు డిప్యూటీ మేయర్‌ పదవులు రెండు ఉండడంతో ఒకటి జనసేనకు, రెండోది టీడీపీకి కేటాయించే అవకాశం ఉంది. అయితే బీజేపీ కూడా డిప్యూటీ మేయర్‌ కోసం పోటీ పడితే పరిస్థితి రసవత్తరంగా మారే అవకాశం ఉంటుంది. జీవీఎంసీలో రాజకీయం వేడెక్కడంతో కౌన్సిల్‌లో ఏం జరుగుందనే దానిపై సర్వత్రా ఆసక్తి పెరిగిందని చెప్పుకోవాలి.

Updated Date - Mar 23 , 2025 | 01:21 AM