కానరాని పర్యాటకుల సందడి
ABN , Publish Date - Mar 23 , 2025 | 10:40 PM
మన్యంలోని సందర్శనీయ ప్రదేశాలకు పర్యాటకులు తగ్గుముఖం పడుతున్నారు. దీంతో ఆదివారం ఏజెన్సీలో సందర్శకులు అంతగా కానరాలేదు.

సీజన్ ముగియడం, టెన్త్ విద్యార్థుల పరీక్షల ప్రభావం
పాడేరు, మార్చి 23(ఆంధ్రజ్యోతి): మన్యంలోని సందర్శనీయ ప్రదేశాలకు పర్యాటకులు తగ్గుముఖం పడుతున్నారు. దీంతో ఆదివారం ఏజెన్సీలో సందర్శకులు అంతగా కానరాలేదు. ప్రస్తుతం టెన్త్ విద్యార్థులకు సంవత్సరాంతపు పరీక్షలు జరుగుతుండడంతో పాటు పర్యాటక సీజన్ సైతం ముగియడంతో జనం మన్యానికి రావడం లేదు. అనంతగిరి మండలం బొర్రా గుహలు, అరకులోయ మండలంలో మాడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి జలవిహారి, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, వంజంగి హిల్స్, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి, చెరువువేనం, లంబసింగి ప్రాంతాలను ఆదివారం పర్యాటకులు పరిమితంగానే సందర్శించారు.
బొర్రాకు తగ్గిన తాకిడి
అనంతగిరి: మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహలకు పర్యాటకుల తాకిడి తగ్గింది. ఆదివారం 1,900 మంది గుహలను సందర్శించగా, రూ. 1.69 లక్షల ఆదాయం వచ్చిందని మేనేజర్ గౌరీ శంకర్ తెలిపారు. తాటిగుడ, కటికి, సరియా జలపాతాలు, డముకు వ్యూపాయింట్, కాఫీ ప్లాంటేషన్ సందర్శిత ప్రాంతాలన్నీ వెలవెలబోయాయి.