వ్యవసాయానుబంధ రంగాల్లో 15 శాతం వృద్ధి సాధించాలి
ABN , Publish Date - Apr 01 , 2025 | 11:21 PM
వ్యవసాయానుబంధ రంగాల్లో 15 శాతం వృద్ధి రేటు సాధించా లని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు.

అధికారులకు కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశం
పాడేరు, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): వ్యవసాయానుబంధ రంగాల్లో 15 శాతం వృద్ధి రేటు సాధించా లని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. జిల్లాలోని ఐటీడీఏ పీవోలు, వ్యవసాయ, మత్స్యశాఖ, ఉద్యానవన శాఖ, మైక్రో ఇరిగేషన్, పుడ్ సేఫ్టీ, పశు సంవర్థక శాఖ, సెరీకల్చర్, గ్రామీణ నీటి సరఫరా విభాగం, పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖల అధికారులు, ఎంపీడీవోలతో కలెక్టరేట్ నుంచి మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. అన్ని రంగాల్లో జిల్లాలో ఉద్పాదకత పెరగాలని, రైతులకు సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో 104 చెక్‌డ్యామ్‌లకు మరమ్మతులు జరిగాయని, వాటి ద్వారా 5,500 ఎకరాలకు సాగు నీరందుతుందన్నారు. రానున్న మూడేళ్లలో సేంద్రీయ వ్యవసాయ విస్తరణకు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రిజర్వాయర్లలో మత్స్య సంపద పెంచడానికి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ప్రజాప్రతినిధుల సమక్షంలో మత్స్యకారులకు చేప పిల్లలను పంపిణీ చేయాలని, మత్స్యకారుల సొసైటీలను ఆడిట్ చేయాలని ఎంపీడీవోలను ఆదేశించారు. అలాగే 5 వేల ఎకరాల్లో సామలు, రాగులు పెంపకం చేపట్టబోతున్నామన్నారు. ఈ ఏడాది 33 వేల ఎకరాల్లో కాఫీ తోటల పెంపకానికి నీడ తోటలు వేయాలని, 17,170 ఎకరాల్లో ఉద్యానవన తోటలు, పండ్ల తోటలు, కూరగాయలు సాగు చేయడానికి తగిన చర్యలు చేపట్టాలన్నారు. రంపచోడవరం డివిజన్‌లో జీడిమామిడి, ఆయిల్ ఫామ్ తోటలు వేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.
15న వివిధ శాఖల అధికారులకు వర్క్‌షాప్
జిల్లాలో 15 శాతం వృద్ధి సాధించే అంశాలపై అందరికీ అవగాహన కల్పించేందుకు గానూ ఈ నెల 15న వివిధ శాఖల అధికారులకు వర్కుషాప్ నిర్వహించాలని కలెక్టర్ దినేశ్‌కుమార్ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 2 వేల ఎకరాల్లో డ్రిప్ ఇరిగేషన్ చేయాలని, అన్ని మండలాల్లోనూ రైతులకు లబ్ధి చేకూరాలన్నారు. ఆర్గానిక్ సేధ్యం చేస్తున్న రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు ప్రభుత్వ ప్రోత్సహకాలు, రాయితీలు అందించాలన్నారు. జిల్లాలో మల్బరీ సాగు విస్తరించాలని, రైతులకు కాఫీ, మిరియాల కంటే మల్బరీ సాగులో అధిక ఆదాయం వస్తుందన్నారు. ఈ ఏడాది పాడేరు, రంపచోడవరం డివిజన్లలో రెండు వందల ఎకరాల్లో మల్బరీ సాగు విస్తరించాలన్నారు. జిల్లాలో కూనవరంలో 240 ఎకరాల్లో, చింతూరులో 160 ఎకరాల్లో టస్సార్ పట్టు సాగు చేస్తున్నారని, మరో 400 ఎకరాల్లో సాగును విస్తరించాలన్నారు. ఐటీడీఏల పరిధిలో పశు సంపద యూనిట్లు అందించేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. పాడేరు ఐటీడీఏ పరిధిలో రూ.20 కోట్లతో చెక్‌డ్యామ్‌లకు మరమ్మతులు చేపట్టినట్టు ఆయన తెలిపారు. జిల్లాలో వేసవి కార్యాచరణ ప్రణాళిక సమర్థవంతంగా అమలు చేయాలని, తాగునీటి సమస్యలు ఏర్పడకుండా తగిన చర్యలు చేపట్టాలని, తాగునీటి వనరులు, చేతి పంపులు మరమ్మతులు చేపట్టాలన్నారు. తాగునీటి సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేస్తే సచివాలయ సిబ్బందిని సస్పెండ్ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. తాగునీరందించేందుకు ఎంపీడీవోలు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పీవోలు డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ, కట్టా సింహాచలం, అపూర్వ భరత్, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్ నంద్, జిల్లా ఉద్యాన వన అధికారి ఎ.రమేశ్‌కుమార్‌రావు, జిల్లా పశు సంవర్థకశాఖాధికారి డాక్టర్ సీహెచ్. నరసింహులు, జిల్లా సెరీకల్చర్ అధికారి అప్పారావు, మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు, ఎస్‌ఎంఐ డీఈఈ నాగేశ్వరరావు, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈఈ జవహర్‌కుమార్, సీపీవో పట్నాయక్, ఎంపీడీలు పాల్గొన్నారు.