Share News

వైసీపీలో లుకలుకలు

ABN , Publish Date - Mar 19 , 2025 | 12:50 AM

వైసీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి వర్గీయుల మధ్య కొంత కాలంగా నెలకొన్న అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. మండలంలో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలిపోయారని ప్రచారం జరుగుతున్నది.

వైసీపీలో లుకలుకలు

- బయటపడ్డ వర్గ విభేదాలు

- ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి వర్గీయుల మధ్య పెరుగుతున్న దూరం

- మోరి రవిని మండలాధ్యక్ష పదవి నుంచి తప్పించే ప్రయత్నం?

చింతపల్లి, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): వైసీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి వర్గీయుల మధ్య కొంత కాలంగా నెలకొన్న అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. మండలంలో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలిపోయారని ప్రచారం జరుగుతున్నది. కార్యకర్తలను జిల్లా నాయకులు పట్టించుకోవడంలేదని, కేవలం కొంత మందికి మాత్రమే పార్టీ కార్యక్రమాల్లో ప్రాధాన్యమిస్తున్నారని, ఈ కారణంగానే యువజన పోరు విజయవంతం కాలేదని ఆ పార్టీ చింతపల్లి మండలాధ్యక్షుడు మోరి రవి తాజాగా విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. పదవి పోతుందనే భయంతోనే ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజును మండలాధ్యక్షుడు మోరి రవి విమర్శిస్తున్నాడని స్థానిక జడ్పీటీసీ సభ్యుడు పోతురాజు బాలయ్య ధ్వజమెత్తారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో పార్టీ మండలాధ్యక్షుడు, జడ్పీటీసీ సభ్యుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పోస్టులు పెట్టుకుంటున్నారు. కాగా 2024 ఎన్నికల్లో భాగ్యలక్ష్మి, మత్స్యరాస విశ్వేశ్వరరాజు కలిసి పనిచేసినప్పటికి రెండు నెలల నుంచి ఇద్దరి మధ్య దూరం పెరుగుతూ వచ్చిందని కార్యకర్తలు చెబుతున్నారు. భాగ్యలక్ష్మి ఎమ్మెల్యేగా, జిల్లా అధ్యక్షురాలిగా ఉన్నప్పుడు అత్యధిక సమయం చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు ప్రాంతాల్లోనే పర్యటిస్తూ కార్యకర్తల మధ్య ఉండేవారు. దీంతో మెజారిటీ కార్యకర్తలు భాగ్యలక్ష్మి వర్గీయులుగానే ఉన్నారు. కొంత మంది పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుతో ఉన్నప్పటికి భాగ్యలక్ష్మి సూచన మేరకు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. జిల్లా అధ్యక్ష పదవి ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుకి అప్పగించడంతో ప్రస్తుతం భాగ్యలక్ష్మి క్రియాశీలక రాజకీయాల్లో దూకుడు తగ్గించారు. పార్టీ కార్యక్రమాలు ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. అయితే చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాలకు చెందిన వైసీపీ నాయకులకు ఎమ్మెల్యే పర్యటన, పార్టీ కార్యక్రమాల సమాచారం ముందుగా తెలియడం లేదని, ఒకరు, ఇద్దరికి మాత్రమే తెలియజేస్తున్నారని పార్టీ మండలాధ్యక్షుడు మోరి రవి చెబుతున్నారు. గతంలో భాగ్యలక్ష్మితో సన్నిహితంగా ఉన్న ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులను ఎమ్మెల్యే దూరం పెడుతున్నారని ప్రచారం జరుగుతున్నది. మండలాధ్యక్షుడు రవి, మరికొంత మంది ప్రజాప్రతినిధులు భాగ్యలక్ష్మితో సన్నిహితంగా ఉండడాన్ని ఎమ్మెల్యే వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారనే చర్చ జరుగుతున్నది. తాజా పరిణామాల నేపఽథ్యంలో పార్టీ జిల్లా నేతలను ప్రశ్నించిన మోరి రవిని మండలాధ్యక్ష పదవి నుంచి తప్పించాలనే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తున్నది. నూతనంగా మండలాధ్యక్ష పదవి ఎవరికీ కేటాయించకపోయినప్పటికి సోషల్‌ మీడియాలో మండలానికి చెందిన ఓ వైసీపీ నాయకుడు.. మాజీ మండలాధ్యక్షుడు మోరి రవి ప్రకటనలు పట్టించుకోవద్దంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ మేరకు రవిని మండలాధ్యక్ష పదవి నుంచి తప్పించారా?, తప్పించే ప్రయత్నం చేస్తున్నారా? అని పార్టీ కార్యకర్తలు సోషల్‌ మీడియాలో చర్చించుకుంటున్నారు.

Updated Date - Mar 19 , 2025 | 12:50 AM