Share News

చెరువులకు మహర్దశ

ABN , Publish Date - Mar 19 , 2025 | 12:45 AM

గ్రామీణ ప్రాంతంలో చెరువుల అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో చెరువుల అభివృద్ధికి అటవీ శాఖ ప్రణాళికలు రూపొందిస్తున్నది.

చెరువులకు మహర్దశ
ఆక్రమణల కారణంగా నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయిన లక్ష్మీపురం చెరువు

కేంద్ర సహకారంతో అభివృద్ధికి అటవీ శాఖ ప్రణాళిక

గ్రామాల్లో చెరువుల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం

రెవెన్యూ శాఖ సహకారంతో త్వరలో సర్వే

వాస్తవ విస్తీర్ణం, కబ్జాకు గురైంది ఎంత అన్న వివరాలు సేకరణ

ఆక్రమణలను తొలగించి, పూడిక తీత

నీటి నిల్వ సామర్థ్యం పెంపు

గట్లపై మొక్కలు నాటి పచ్చదనం అభివృద్ధి

చేపల పెంపకంతో పంచాయతీలకు అదనపు ఆదాయం

పక్షుల ఆవాసాలుగా తీర్చిదిద్దాలని ప్రణాళిక

చోడవరం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతంలో చెరువుల అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో చెరువుల అభివృద్ధికి అటవీ శాఖ ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఇందులో భాగంగా అటవీ శాఖ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. ఏ మండలంలో ఎన్ని చెరువులు వున్నాయి, ఒక్కో చెరువు విస్తీర్ణం ఎంత, ఇందులో ఆక్రమణకు గురైంది ఎంత అన్న వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ నిధులతో దశలవారీగా చెరువులను అభివృద్ధి చేస్తారు. ఇందులో భాగంగా తొలుత రికార్డుల ప్రకారం సర్వే చేసి చెరువుల విస్తీర్ణాన్ని నిర్ధారిస్తారు. ఆక్రమణలు వుంటే వాటిని తొలగించి నీటి నిల్వ సామర్థ్యం పెంచేలా పనులు చేపడతారు. అనంతరం చెరువుల్లో చేపల పెంపకంతో, గట్లకు ఇరువైపులా మొక్కలు నాటి చెట్లు పెంచారు. చెరువుల ద్వారా పొలాలకు నీరు అందించడమే కాకుండా పంచాయతీలకు అదనపు ఆదాయం వచ్చేలా చేస్తారు. పర్యావరణ పరిరక్షణ, భూగర్భ జలాల పెంపు, పక్షులకు ఆవాసాలుగా చెరువులను అభివృద్ధి చేస్తారు.

చోడవరం అటవీ శాఖ రేంజి పరిధిలోని చోడవరం, మాడుగుల నియోజకవర్గాల పరిధిలో మొత్తం 321 చెరువులను అధికారులు గుర్తించి ఉన్నతాధికారులకు నివేదించారు. తరువాత దశలో రెవెన్యూ శాఖ సహకారంతో చెరువుల వాస్తవ విస్తీర్ణం, వాటి ఆయకట్టు తదితర వివరాలను సేకరిస్తారు. తొలుత ఎక్కువ విస్తీర్ణం వున్న చెరువులను అభివృద్ధి చేసే అవకాశం వుందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.

చెరువులకు పూర్వ స్థితి

చెరువుల అభివృద్ధి పథకం అమలైతే గ్రామాల్లోని చెరువులకు పూర్వ స్థితి వస్తుందని రైతులు భావిస్తున్నారు. జిల్లాలో దాదాపు అన్ని చెరువులు ఎంతో కొంత ఆక్రమణకు గురయ్యాయి. ముఖ్యంగా చెరువు గర్భాలను రాజకీయ పలుకుబడి వున్న వ్యక్తులు ఆక్రమించుకుని పంట భూములుగా మార్చేశారు. దీనివల్ల చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయి, ఆయకట్టు భూములకు పూర్తిస్థాయిలో నీరు అందని పరిస్థితి నెలకొంది. పరిశ్రమలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం అధికంగా వున్న ప్రాంతాల్లోని చెరువులు, గ్రామాలకు ఆనుకుని వున్న చెరువులు అధికంగా ఆక్రమణకు గురయ్యాయి. ఇటువంటి చోట్ల చెరువుల్లో వర్షం నీరు నిలవకుండా తూములను ధ్వంసం చేసేస్తున్నారు. కొన్నిచెట్ల చెరువు గట్లపై ఇళ్లు, దుకాణాలు సైతం నిర్మించుకున్నారు. ఒకప్పుడు వేసవిలో సైతం చెరువుల్లో నీరు వుండేది. ఆక్రమణల కారణంగా ఇప్పుడు జనవరి నెలలోనే చెరువులు ఎండిపోతున్నాయి. కబ్జాలతో చెరువుల వాస్తవ విస్తీర్ణం ఎంత వుందో స్థానికులు కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే చెరువులకు పూర్వ వైభవం వచ్చే అవకాశం వుంది.

Updated Date - Mar 19 , 2025 | 12:45 AM