Share News

Visakhapatnam: దీపికపై దాడి కేసులో ప్రేమోన్మాది అరెస్ట్

ABN , Publish Date - Apr 02 , 2025 | 07:31 PM

Visakhapatnam:మధురవాడలోని స్వయంకృషి నగర్‌లో నివసిస్తున్న దీపికతోపాటు ఆమె తల్లిపై దాడి చేసిన ప్రేమోన్మాది నవీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం విశాఖ నగర పోలీస్ కమిషనర్ బాగ్చీ మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు.

Visakhapatnam: దీపికపై దాడి కేసులో ప్రేమోన్మాది అరెస్ట్
Naveen

విశాఖపట్నం, ఏప్రిల్ 02: మధురవాడలో దీపికాపై దాడి చేసిన ప్రేమోన్మాది నవీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు నవీన్‌ను శ్రీకాకుళం జిల్లాలోని బుర్జు వద్ద అదుపులోకి తీసుకున్నామని విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ వెల్లడించారు. బుధవారం విశాఖపట్నంలో నగర సీపీ బాగ్చీ విలేకర్లతో మాట్లాడుతూ.. దీపికా , నవీన్‌ల మధ్య గత కొన్ని ఏళ్లుగా ప్రేమ వ్యవహారం ఉందని తెలిపారు. వీరీ వివాహానికి ప్రస్తుతం ఆమె ఇంట్లోని పెద్దలు నిరాకరించారని.. ఈ నేపథ్యంలో ఈ హత్య జరిగిందని తెలిసిందన్నారు.

అయితే ఈ హత్య చేసిన కత్తి.. క్రైమ్ సీన్‌లోనే ఉందన్నారు. దీపికతోపాటు ఆమె తల్లిపై దాడిన అనంతరం నవీన్ బై‌క్‌పై శ్రీకాకుళం వెళ్లిపోయాడని వివరించారు. ఇక మధ్యలో ఎవరికి దొరక్కుండా.. ఉండేందుకు దుస్తులు, బైకు మార్చేశాడని నగర సీపీ బాగ్చీ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు.


ఇంతకీ ఏం జరిగిందంటే..

విశాఖపట్నంలోని మధురవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో స్వయంకృషి నగర్‌లో తన తల్లితో కలిసి దీపిక ఉంటుంది. అయితే బుధవారం మధ్యాహ్నం 12.00 గంటలకు దీపికతోపాటు ఆమె తల్లిపై నవీన్ అకస్మాత్తుగా దాడి చేశాడు. అనంతరం అతడు అక్కడి నుంచి పరారైయ్యాడు. ఈ ఘటనలో తల్లి లక్ష్మీ అక్కడికక్కడే మృతి చెందింది. దీపికకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు.


పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని.. దీపికను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇక తల్లి లక్ష్మీ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీపిక, నవీన్ మధ్య స్నేహం ఉందని.. అది ప్రేమగా మారిందని సమాచారం. వీరి పెళ్లికి దీపిక తల్లీ ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఆ క్రమంలోనే అతడు ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు విచారణలో బహిర్గతమైంది.


మరోవైపు దీపిక ఆరోగ్య పరిస్థితి 48 గంటలు గడిస్తేనే కానీ చెప్పలేమని వైద్యులు తెలిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఫిర్యాదు అందగానే.. నగర సీపీ బాగ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అలాగే జిల్లా పోలీసులతోపాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లా పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో ఈ దారుణానికి పాల్పడిన ప్రేమోన్మాదిని గంటల వ్యవధిలోనే పోలీసులు అరెస్ట్ చేశారు.


ఇంకోవైపు.. మధురవాడ ప్రేమోన్మాది దాడి ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత్ స్పందించారు. ఈ అంశంపై నగర సీపీకి ఫోన్ చేసి ఆరా తీశారు. బాధితురాలు దీపిక ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆమెకు మెరుగైన వైద్య అందించాలని జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశించారు. ప్రేమోన్మాది నవీన్‌ను కఠినంగా శిక్షించాలన్నారు.

Updated Date - Apr 02 , 2025 | 07:34 PM