Share News

ఆయిల్ మాఫియా

ABN , Publish Date - Mar 28 , 2025 | 12:22 AM

జిల్లాలోని ఆనందపురం కేంద్రంగా పెద్ద డీజిల్‌ మాఫియా నడుస్తోంది.

ఆయిల్ మాఫియా

  • యానాం వెళ్లాల్సిన డీజిల్‌ విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో విక్రయం

  • అక్కడ బంకుల పేరుతోనే బుకింగ్‌

  • కానీ తాళ్లపాలెం సమీపాన గల బంక్‌లో అన్‌లోడింగ్‌

  • రాంబిల్లి నేవల్‌ బేస్‌ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు బల్క్‌గా సరఫరా

  • రింగ్‌మాస్టర్‌ ఆనందపురం ప్రాంతానికి చెందిన ఒక బంక్‌ నిర్వాహకుడు

  • నౌకల నుంచీ ఆయిల్‌ కొని కాకినాడకు తరలింపు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలోని ఆనందపురం కేంద్రంగా పెద్ద డీజిల్‌ మాఫియా నడుస్తోంది. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం వెళ్లాల్సిన డీజిల్‌ను స్థానికంగానే అమ్ముకుంటూ కొందరు భారీ లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ దొంగ వ్యాపారం వల్ల రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున పన్నుల రూపేణా రావలసిన ఆదాయం కోల్పోతుంది.

ఉత్తరాంధ్రాలో గత కొంతకాలంగా భారీ ప్రాజెక్టులు నడుస్తున్నాయి. అందులో ప్రధానమైనవి అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని నేవీ ప్రత్యామ్నాయ స్థావరం కాగా మరొకటి భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం. అక్కడ పనిచేసే యంత్రాలకు పెద్ద మొత్తంలో డీజిల్‌ అవసరం. ఆయా సంస్థలు టెండర్లు పిలిస్తే...‘ఆనందపురం రింగ్‌ మాస్టర్‌’ తక్కువ ధర కోట్‌ చేసి కాంట్రాక్టు దక్కించుకుంటున్నారు. ఆయిల్‌ కంపెనీలు ఏ డీలర్‌కు అయినా లీటరుపై రూ.2.40 మాత్రమే కమీషన్‌ ఇస్తాయి. అలాంటప్పుడు రాంబిల్లిలో నేవల్‌ బేస్‌కు ఆ చుట్టుపక్కల ఉండే డీజిల్‌ బంక్‌ యజమానులే తక్కువ ధరకు సరఫరా చేయగలుగుతారు. కానీ 70 కి.మీ. దూరంలో ఉన్న ఆనందపురం డీలర్‌ తక్కువ ధరతో ఆ డీల్‌ దక్కించుకుంటున్నారు. ట్యాంకర్లను ఆనందపురం నుంచి పంపడానికే ఆయనకు వచ్చిన కమీషన్‌ సరిపోతుంది. అయినా భారీఎత్తున డీజిల్‌ ఎలా సరఫరా చేస్తున్నారని ఆరా తీస్తే అనేక విషయాలు తెలిశాయి.

యానాం పేరుతో బుకింగ్‌...

కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో బంకులకు కూడా విశాఖపట్నంలో గల ఆయిల్‌ కపెనీల నుంచే డీజిల్‌ సరఫరా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌ కంటే అక్కడ డీజిల్‌ ధర తక్కువ. అది కేంద్ర పాలిత ప్రాంతం కావడంతో కొన్ని పన్నులు ఉండవు. ఏపీలో వ్యాట్‌ 27 శాతం కాగా అక్కడ అది ఏడు శాతమే. ఏపీలో లీటరుకు 4 రూపాయల సెస్‌, రోడ్‌ సెస్‌ మరో రూపాయి కలిపి ఇక్కడ డీజిల్‌ ధర లీటరు రూ.97 పడుతుండగా, యానాం బంకులకు అదే డీజిల్‌ రూ.85కు వస్తుంది. అంటే లీటరుకు రూ.12 తక్కువకు లభిస్తోంది. దీనిని ఆనందపురం రింగ్‌ మాస్టర్‌ తనకు అనుకూలంగా మార్చుకొని తప్పుడు వ్యాపారం చేస్తున్నారు. దీనికి ఓ ఆయిల్‌ కంపెనీ ఉద్యోగులు సహకరిస్తున్నారు. యానాంలో ఆ కంపెనీ పరిధిలో సుమారు ఐదు బంకులు ఉన్నాయి. వారు రోజుకు సగటున నాలుగు డీజిల్‌ ట్యాంకర్లు బుక్‌ చేసుకుంటారు. ఒక్కొక్కటి 20 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకర్లు ఇక్కడ డీజిల్‌ నింపుకుంటాయి. కానీ యానాం వెళ్లవు. వాటికి అమర్చిన జీపీఎస్‌ పరికరాలు కూడా పనిచేయవు. ఆనందపురం రింగ్‌ మాస్టర్‌ కశింకోట మండలం తాళ్లపాలెం సమీపాన పాత బయో డీజిల్‌ బంక్‌ను లీజుకు తీసుకొని అక్కడ ఈ డీజిల్‌ అన్‌లోడింగ్‌ చేసుకుంటారు. అక్కడి నుంచి రాంబిల్లిలోని నేవీ కాంట్రాక్టర్లకు సరఫరా చేస్తున్నారు. అక్కడ పెద్ద కాంట్రాక్టర్లకు బంకులు ఉన్నా, సబ్‌ కాంట్రాక్టర్లంతా వీరి దగ్గరే కొంటున్నారు. అనకాపల్లి మండలంలోనే కొని, అక్కడే సరఫరా చేయడం వల్ల ఖర్చులు పోను లీటరుకు పది రూపాయలు మిగులుతోంది. రోజుకు ఎలా లేదన్నా 80 వేల లీటర్లు విక్రయిస్తున్నారు. అంటే రూ.8 లక్షల ఆదాయం. ఇందులో ఎవరి వాటాలు వారికి వెళ్లిపోతాయి. ఈ బాగోతం బయట పడకుండా ఉండేందుకు యానాంలోని ఐఓసీ బంకుల్లో ఆటోమేషన్‌ సిస్టమ్‌ పనిచేయకుండా చేశారంటున్నారు. ఏదైనా బంకు డీజిల్‌ ట్యాంకర్‌ బుక్‌ చేసుకుంటే...కంప్యూటర్‌లో అప్పటివరకు ఆ బంకుకు పంపిన డీజిల్‌, ప్రస్తుతం వారి స్టోరేజీ ట్యాంకులో ఉన్న నిల్వ వివరాలు వస్తాయి. ఆ వివరాలు ఏమీ లేకపోయినా ఆయిల్‌ కంపెనీ అధికారులు యానాం బంకులకు డీజిల్‌ ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అదేవిధంగా భోగాపురం విమానాశ్రయంలో పనిచేస్తున్న కాంట్రాక్టర్లకు అవసరమైన డీజిల్‌ ఆనందపురంలో రింగ్‌ మాస్టర్‌ లీజుకు తీసుకున్న బంకు నుంచే పంపుతున్నారు.

షిప్‌ల నుంచి కొని కాకినాడకు...

విశాఖపట్నంలో పోర్టులకు వచ్చే నౌకల నుంచి దొంగిలించిన ఆయిల్‌ను మత్స్యకారుల ద్వారా కొనిపించి బార్జీల ద్వారా కాకినాడకు పంపుతున్నారు. అక్కడ జగన్నాథపురం బ్రిడ్జి వద్ద పెద్ద ఆయిల్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ ఉంది. అక్కడి మాఫియా ఈ ఆయిల్‌ తీసుకొని ఆనందపురం రింగ్‌ మాస్టర్‌కు కమీషన్లు ఇస్తుంది.

సుమారుగా 20కి పైగా లీజు బంకులు

ఒకప్పుడు బంకులో పెట్రోల్‌ కొట్టే పనికి చేరిన ఆయన ఇప్పుడు చాలా ఎదిగిపోయారు. అటు ఇచ్ఛాపురం నుంచి ఇటు విజయవాడ వరకు ఎక్కడ ఏ బంకు మూత పడినా దానిని లీజుకు తీసుకుంటారు. అక్కడి నుంచే దొంగ వ్యాపారం చేస్తారు. అదొక్కటే కాకుండా రాష్ట్రంలో ఎక్కడా కనిపించని హెవీ ట్రాన్స్‌పోర్టు లారీలు (60 టన్నుల కెపాసిటీ) కూడా ఈయనే తిప్పుతున్నారు. ఇలాంటి పెద్ద లారీలు సరకుతో ఏపీలోకి వస్తే అన్‌లోడింగ్‌ చేసేసి వెళ్లిపోవాలి. కానీ అవి ఇక్కడే తిరుగుతుంటాయి. వాటిని రవాణా శాఖ అధికారులు కూడా పట్టించుకోరు. అవి ఒక్కోసారి ప్రమాదాలకు గురైనా వెంటనే వాటిని విడిచిపెట్టేస్తుంటారు.

కేసులు పెట్టినా బలాదూర్‌

ఈ వ్యాపారి దందా భరించలేక చాలామంది బంకు యజమానులు వ్యాపారాలు మూసేసుకుంటున్నారు. అంతా కలిసి నేరుగా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఒక కేసులో ఆయన గారి వాహనం పట్టుకొని తూనికలు కొలతల శాఖాధికారులు కేసు పెడితే లక్షల రూపాయాల జరిమానా కట్టారు. ఈ వ్యాపారి దందాపై విజిలెన్స్‌ అధికారులు దృష్టి పెట్టాల్సి ఉంది.

Updated Date - Mar 28 , 2025 | 12:22 AM