Share News

ఢిల్లీ డబుల్‌ ధమాకా

ABN , Publish Date - Mar 31 , 2025 | 01:01 AM

ఆతిథ్య జట్టుకు అనుకూలించే ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.

ఢిల్లీ డబుల్‌ ధమాకా

  • వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గెలుపు

  • సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై సునాయాస విజయం

  • ఐదు వికెట్లను పడగొట్టిన మిచెల్‌ స్టార్స్‌

  • హాఫ్‌ సెంచరీతో మెరిసిన డుప్లిసెస్‌

  • ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాట్స్‌మన్‌ అనికేత్‌ వర్మ ఒంటరి పోరు వృథా

విశాఖపట్నం స్పోర్ట్సు, మార్చి 30 (ఆంధ్రజ్యోతి):

ఆతిథ్య జట్టుకు అనుకూలించే ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. తొలి రెండు మ్యాచ్‌లకు ఏసీఏ వీడీసీఏ స్టేడియాన్ని హోం గ్రౌండ్‌గా చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆదివారం మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో పటిష్ఠమైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుపై ఏడు వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది.

ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్రధాన బౌలర్‌ మిచెల్‌ స్టార్స్‌ నిప్పులు చెరిగే బంతులతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ఈ క్రమంలో ఐదు వికెట్ల ఘనతను సాధించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్లు డుప్లెసిస్‌ వేగవంతమైన హాఫ్‌ సెంచరీ (50; 3 సిక్సర్లు, 3 బౌండరీలు), మెక్‌గుర్క్‌ (38; 4 ఫోర్లు, 2 సిక్సర్ల)తోపాటు అభిషేక్‌ పోరల్‌ (34 నాటౌట్‌; (2 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టుకు సునాయాస విజయాన్నందించారు. అయితే భారీ సిక్సర్లు, బౌండరీలతో స్టేడియం హోరెత్తుతుందని ఆశించిన ప్రేక్షకులకు ఆదివారం అసలైన ఐపీఎల్‌ మజా అందలేదు. అడపాదడపా కనువిందు చేసే షాట్స్‌ మినహా రెండు జట్ల ఇన్నింగ్స్‌లో భారీ సిక్సర్లు, బౌండరీల జోరు కనిపించలేదు. ప్రేక్షకుల కరతాళ ధ్వనులు, కేరంతల మధ్య బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌లో అనికేత్‌ వర్మ(74) క్రీజులో ఉన్నంత సేపు ఐపీఎల్‌ మజాను ఆస్వాదించారు. అతడు అవుటైన తర్వాత స్టేడియం అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. మూడు ఓవర్లలో 29 పరుగులకు మూడు వికెట్లు, పది ఓవర్లలో 105 పరుగులకు నాలుగు వికెట్లు, 16 ఓవర్లలో 149 పరుగులకు ఎనిమిది వికెట్లు, 18.4 ఓవర్లకు 163 పరుగులకు ఆలౌట్‌. .. ఇదీ టైటిల్‌ ఫేవరెట్‌లో ఒకటైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ కొనసాగిన తీరు. సీజన్‌ ప్రారంభ మ్యాచ్‌లో జోరు చూపించిన ఈ జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ పేలవమైన బ్యాటింగ్‌తో తక్కువ స్కోరుకే ఆలౌటైంది.

సాధారణ లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్‌ 16 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి వరుసగా రెండో విజయం సాధించింది. అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ తొలి ఓవర్‌లోనే రనౌట్‌ అయ్యాడు. భారీ అంచనాలతో బ్యాటింగ్‌కు దిగిన ఇషాన్‌ కిషన్‌(2) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేదు. అతడి స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన లోకల్‌బాయ్‌ నితీష్‌కుమార్‌ రెడ్డి కేవలం రెండు బంతులను ఎదుర్కొని చెత్త షాట్‌తో పరుగులేమీ చేయకుండానే పెవిలియన్‌ చేరాడు. వ్యక్తిగత ఎనిమిది పరుగుల వద్ద అక్షర పటేల్‌ బౌలింగ్‌లో అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న అనికేత్‌ వర్మ ఆ తరువాత చెలరేగి స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. కేవలం 34 బంతుల్లో నాలుగు బౌండరీలు, మూడు సిక్సర్లతో అర్ధ సెంచరీ(50) పూర్తిచేసిన అనికేత్‌వర్మకు క్లాసిన్‌ (32) తోడవడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ శిబిరం ఊపిరిపీల్చుకుంది. జోరుమీదున్న అనికేత్‌ వర్మ(74) కులదీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో మెక్‌గుర్క్‌ పట్టిన అద్భుత క్యాచ్‌తో అవుటయ్యాడు. తర్వాత స్థానాలో దిగిన బ్యాట్స్‌మన్లను మిచెల్‌ స్టార్స్‌ వరుసగా పెవిలియన్‌ దారి పట్టించాడు.

సాధారణ లక్ష్యాన్ని ఛేదించడంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఏమాత్రం తడబడలేదు. ఓపెనర్‌ మెక్‌ గుర్క్‌ (38) సమయస్ఫూర్తితో ఆడగా, మరో ఓపెనర్‌ డుప్లెసిస్‌ సిక్సర్లు, బౌండరీలతో స్టేడియాన్ని హోరెత్తించాడు. అర్ధ సెంచరీ చేసిన డుప్లెసిస్‌ అన్సారీ బౌలింగ్‌లో తొలి వికెట్‌గా అవుటవ్వగా తర్వాత స్థానంలో దిగిన అభిషేక్‌ పోరెల్‌ (34 నాటౌట్‌) ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లను చెండాడి స్కోరు బోర్డును పరిగెత్తించాడు. ఈ మ్యాచ్‌లో జట్టులో చేరిన కేఎల్‌ రాహుల్‌ (15) అన్సారీ బౌలింగ్‌లో మూడో వికెట్‌గా పెవిలియన్‌కు చేరగా, రాహుల్‌ స్థానంలో వచ్చిన స్టబ్స్‌ (21 నాటౌట్‌; 3 ఫోర్లతో) మ్యాచ్‌ను ముగించాడు.

Updated Date - Mar 31 , 2025 | 01:01 AM