Share News

అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం

ABN , Publish Date - Apr 01 , 2025 | 11:15 PM

అభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వ సమాన ప్రాధాన్యం ఇస్తున్నదని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు.

అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం
అరట్లకోటలో సీసీ రోడ్డును ప్రారంభించిన మంత్రి అనిత. చిత్రంలో కూటమి నేతలు గెడ్డం బుజ్జి, పెదిరెడ్డి చిట్టిబాబు, తదితరులు

బల్క్‌డ్రగ్‌ పార్కు, స్టీల్‌ ప్లాంట్‌లతో 50 వేల మందికి ఉద్యోగాలు

హోం మంత్రి వంగలపూడి అనిత

పాయకరావుపేట/ పాయకరావుపేట రూరల్‌, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వ సమాన ప్రాధాన్యం ఇస్తున్నదని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. మండలంలోని అరట్లకోటలో రూ.31 లక్షల ఉపాధి నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను, పాయకరావుపేట పెదపీర్ల పంజా వీధిలో రూ.10 లక్షలు, దేవీనగర్‌లో రూ.30 లక్షలు, చెక్కానగర్‌లో రూ.20 లక్షలు, షీలా నగర్‌లో రూ.20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వైసీపీ పాలనలో ఒక్క గ్రామంలో కూడా సీసీ రోడ్డు వేయలేదని, తాము సర్పంచులుగా ఎందుకు ఎన్నికయ్యామా అని వైసీపీకి చెందిన వారే బాధపడ్డారని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత నిధుల కొరత వున్నప్పటికీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని మంత్రి చెప్పారు. కోట్లాది రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు నిర్మించామని, పంచాయతీలకు నిధులు మంజూరు చేశామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్‌ కృషి వల్ల నక్కపల్లి వద్ద బల్క్‌డ్రగ్‌ పార్కు, ప్రైవేటు రంగంలో భారీ స్టీల్‌ ప్లాంట్‌ వస్తున్నాయన్నారు. ఇవి ఏర్పాటైతే సుమారు 50 వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. అరట్లకోటలో రెండు నెలల్లో కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఇటీవల బ్రెయిన్‌ స్ట్రోక్‌తో మృతిచెందిన బార్కుల నాగేంద్ర కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. కె.ఎల్‌. యూనివర్సిటీలో చదువుతూ చనిపోయిన తూము వెంకట దుర్గా ప్రసాద్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ డబ్బులు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో నియోజకవర్గం జనసేన ఇన్‌చార్జి గెడ్డం బుజ్జి, టీడీపీ మండల అధ్యక్షుడు పెదిరెడ్డి చిట్టిబాబు, అరట్లకోట సర్పంచ్‌ పులగపూరి అప్పలనర్స, కూటమి నాయకులు తోట నగేశ్‌, గొర్లె రాజుబాబు, పెదిరెడ్డి శ్రీను, కంకిపాటి వెంకటేశ్వరరావు, యాళ్ల వరహాలు, మజ్జూరి నారాయణరావు, తదితరులు, పీఆర్‌ డీఈఈ వై.హరి, ఎంపీడీవో ఎ.జయప్రకాశరావు, ఈవోపీఆర్‌డీ చంద్రశేఖరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 01 , 2025 | 11:15 PM