Share News

పెందుర్తిలో పవన్‌కు నీరాజనం

ABN , Publish Date - Apr 08 , 2025 | 01:29 AM

అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటన నిమిత్తం రోడ్డు మార్గంలో బయలుదేరిన ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు సోమవారం పెందుర్తిలో ఘన స్వాగతం పలికింది.

పెందుర్తిలో పవన్‌కు నీరాజనం

  • భారీగా తరలివచ్చిన అభిమానులు

  • కారులోంచే అభివాదం చేసిన ఉప ముఖ్యమంత్రి

పెందుర్తి/గోపాలపట్నం, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి):

అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటన నిమిత్తం రోడ్డు మార్గంలో బయలుదేరిన ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు సోమవారం పెందుర్తిలో ఘన స్వాగతం పలికింది. పవన్‌ను చూసేందుకు పరిసర ప్రాంత ప్రజలు, అభిమానులు, కూటమి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పవన్‌కు మంగళ హారతులు ఇచ్చేందుకు మహిళలు ఉదయం నుంచే వేచి ఉన్నారు. పవన్‌ రాక సందర్భంగా జనసేన నాయకులు పెందుర్తి కూడలిని ఫ్లెక్సీలు, జెండాలతో నింపేశారు. ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, కూటమి కార్యకర్తలు స్వాగత ఏర్పాట్లు చేశారు. ఉదయం 8.40 గంటలకు పవన్‌ కల్యాణ్‌ పెందుర్తి చేరుకున్నారు. కారులో నుంచే ప్రజలకు అభివాదం చేశారు. ఎమ్మెల్యే పంచకర్ల అందజేసిన పుష్పగుచ్ఛాన్ని స్వీకరించారు. ఓపెన్‌ టాప్‌ జీప్‌పై ప్రజలకు అభివాదం చేస్తారని పార్టీ శ్రేణులు భావించినప్పటికీ ట్రాఫిక్‌ సమస్యల నేపథ్యంలో ఆయన కారులోనుంచే అందరికీ నమస్కారం చేస్తూ సాగిపోయారు. మాజీ ఎమ్మెల్మే పీలా గోవింద సత్యనారాయణ, జడ్పీటీసీ మాజీ సభ్యుడు రెడ్డి నారాయణరావు, జోగ ముత్యాలు, సేనాపతి శంకరరావు, వేగి పరమేశ్వరరావు, జనసేన నేతలు వేగి దివాకర్‌, అయితి సింహాచలం, గొర్లె అప్పారావు, సేనాపతి సోమశేఖర్‌, పిన్నింటి పార్వతి, కంచిపాటి మధు, డీబీఎల్‌ నాయుడు, ఆర్‌ఎస్‌ నాయుడు పాల్గొన్నారు.

విమానాశ్రయంలో సాదర స్వాగతం

అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటన నిమిత్తం నగరానికి వచ్చిన ఉప ముఖ్యమంత్రి కె.పవన్‌ కల్యాణ్‌కు సోమవారం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 8.15 గంటలకు ఆయన విశాఖ చేరుకున్నారు. ఆయనకు కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌, ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్‌ చైర్మన్‌ తమ్మిరెడ్డి శివశంకర్‌, జనసేన నేతలు కోన తాతారావు, బొలిశెట్టి సత్యనారాయణ, పి.ఉషాకిరణ్‌, సుందరపు సతీశ్‌, బి.వసంతలక్ష్మి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో డుంబ్రిగుడ బయలుదేరి వెళ్లారు.

Updated Date - Apr 08 , 2025 | 01:29 AM