Share News

వ్యాధుల పంజా

ABN , Publish Date - Apr 08 , 2025 | 01:30 AM

జిల్లాలో కేన్సర్‌, హైపర్‌ టెన్షన్‌, షుగర్‌ వంటి వాటితో బాధపడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది.

వ్యాధుల పంజా

  • జిల్లాలో భారీగా క్యాన్సర్‌, హైపర్‌ టెన్షన్‌, షుగర్‌ బాధితులు

  • లివర్‌, కిడ్నీ, న్యూరలాజికల్‌ సమస్యలూ ఎక్కువే

  • మద్యం వల్ల డిప్రెషన్‌, యాంగ్జైటీ

  • ప్రభుత్వ సర్వేలో వెల్లడి

  • ఉప్పు, పంచదార, ఆయిల్‌ వినియోగాన్ని తగ్గించాలని సూచన

  • శారీరక వ్యాయామానికి 30 నిమిషాలు కేటాయించాలి

  • పొగాకు, ఆల్కహాల్‌, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి

విశాఖపట్నం, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో కేన్సర్‌, హైపర్‌ టెన్షన్‌, షుగర్‌ వంటి వాటితో బాధపడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. కొన్నింటిలో మిగిలిన జిల్లాలతో పోలిస్తే విశాఖ మెరుగ్గా ఉండగా, మరికొన్నింటిని ఆందోళనకర పరిస్థితి నెలకొని ఉంది. రాష్ట్రంలోని ప్రజల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రభుత్వం సర్వే చేపట్టింది. ఈ సర్వేతోపాటు ఇతర మార్గాల ద్వారా సేకరించిన డేటాను క్రోడీకరించి తాజాగా జిల్లాల వారీగా ప్రజలు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలకు సంబంధించి డేటాను విడుదల చేసింది. ఆయా అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నియంత్రణ పద్ధతులకు సంబంధించిన కీలక సూచనలలు చేసింది. ఈ సర్వే ప్రకారం జిల్లాలో హైపర్‌ టెన్షన్‌, షుగర్‌, క్యాన్సర్‌, లివర్‌, కార్డియో వాస్కులర్‌, షుగర్‌ అండ్‌ హైపర్‌ టెన్షన్‌, సీవోపీడీ, నరాల సంబంధిత సమస్యలు, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది.

క్యాన్సర్‌ కేసులు అధికం

జిల్లాలో ఐదు నుంచి ఏడు శాతం వరకూ క్యాన్సర్‌ కేసులు నమోదవుతున్నట్టు సర్వేలో తేలింది. సర్వైకల్‌, రొమ్ము, నోటి క్యాన్సర్లు అంచనాకు మించి నమోదవుతున్నాయి. జిల్లాలో 5,526 మంది క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు నిర్ధారించారు. క్యాన్సర్‌ కేసుల పరంగా చూస్తే రాష్ట్రంలో జిల్లా ఐదో స్థానంలో ఉంది. అలాగే, డిప్రెషన్‌, యాంగ్జైటీ వంటి కేసులు నాలుగు నుంచి ఐదు శాతం నమోదవుతున్నట్టు ఈ సర్వే ద్వారా నిర్ధారించారు. దీనికి ప్రధాన కారణంగా ఆల్కహాల్‌గా గుర్తించారు.

కేసులు సంఖ్య భారీగా...

ఇక వ్యాధుల వారీగా జిల్లాలో హైపర్‌ టెన్షన్‌తో బాధపడుతున్న వారి సంఖ్య 80,827. ఇందుకు సంబంధించి రాష్ట్రంలో జిల్లా 12వ స్థానంలో నిలిచింది. అలాగే, జిల్లాలో 45,723 మంది షుగర్‌ బాధితులు ఉన్నారు. ఈ జాబితాలో జిల్లా 14వ స్థానంలో నిలిచింది. అదేవిధంగా షుగర్‌, బీపీ...రెండింటితో బాధపడుతున్న వారి సంఖ్య 62,434. వీటిలో జిల్లా 17వ స్థానంలో నిలిచింది. అలాగే, కార్డియో వాస్కులర్‌ డిసీజ్‌ (గుండె జబ్బులు)తో బాధపడుతున్నవారు జిల్లాలో 8,320 మంది ఉన్నట్టు గుర్తించారు. ఈ జాబితాలో జిల్లా 19వ స్థానంలో ఉంది. లివర్‌ సమస్యలతో బాధపడుతున్నవారు 1,518 (రాష్ట్రంలో ఆరో స్థానం), సీవోపీడీతో బాధపడుతున్నవారు 3,036 మంది ఉన్నట్టుగా నిర్ధారించారు. అలాగే, నరాల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు జిల్లాలో 4,900 మంది ఉన్నారు. ఈ జాబితాలో విశాఖ జిల్లా ఎనిమిదో స్థానంలో నిలిచింది. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు 5,813 మంది (17వ స్థానం) ఉన్నారు.

ప్రభుత్వం సూచనలివి...

జిల్లాల వారీగా ప్రజల అనారోగ్య సమస్యలకు సంబంధించి డేటాను విడుదల చేసిన ప్రభుత్వం తగిన సూచనలు, సలహాలను ఇచ్చింది. ముఖ్యంగా ఉప్పు, పంచదార, ఆయిల్‌ వినియోగాన్ని తగ్గించాలని సూచించింది. దీనివల్ల హైపర్‌ టెన్షన్‌, షుగర్‌, ఒబేసిటీ నియంత్రించేందుకు అవకాశం ఉంది. శారీరక శ్రమ అవసరమని, ఇందుకు నడక, యోగా వంటివి రోజుకు 30 నిమిషాలు చేయాలని పేర్కొంది. మెడిటేషన్‌, ప్రాణాయామంతో స్ర్టెస్‌ తగ్గి మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపింది. పొగాకు, ఆల్కహాల్‌, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, ప్రాసెస్డ్‌, జంక్‌ ఫుడ్‌, పాలిష్‌ చేసిన బియ్యం వినియోగించవద్దని కోరింది. మిల్లెట్స్‌, బ్రౌన్‌ రైస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. బ్యాలెన్స్‌డ్‌ డైట్‌ తీసుకోవాలని, ఆహారంలో అధికంగా ఫైబర్‌ ఉండేలా చూసుకోవడంతోపాటు కూరగాయలు, పండ్లు, ప్రొటీన్‌ ఉండాలని పేర్కొంది. అదే సమయంలో రైతులకు కూడా కీలక సూచనలు చేసింది. పంటల్లో పురుగు మందుల వినియోగాన్ని తగ్గించాలని, సేంద్రియ వ్యవసాయం వైపు దృష్టిసారించాలని పేర్కొంది. వ్యక్తిగత శుభ్రతను పాటించడంతోపాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంపై దృష్టి పెట్టాలని కోరింది.

Updated Date - Apr 08 , 2025 | 01:30 AM