Share News

ప్రభుత్వ పాఠశాలలకు ఉపశమనం

ABN , Publish Date - Mar 28 , 2025 | 12:25 AM

ప్రభుత్వ విద్యా సంస్థలకు విద్యుత్‌ బిల్లుల భారం తప్పనుంది.

ప్రభుత్వ పాఠశాలలకు  ఉపశమనం

  • విద్యుత్‌ బిల్లుల భారం భరించేందుకు ముందుకువచ్చిన ప్రభుత్వం

  • ఈపీడీసీఎల్‌కు ప్రస్తుతం విద్యా సంస్థల నుంచి రావలసిన మొత్తం రూ.1.57 కోట్లు

  • రానున్న రోజుల్లో సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటు దిశగా అడుగులు

విశాఖపట్నం, మార్చి 27 (ఆంధ్రజ్యోతి):

ప్రభుత్వ విద్యా సంస్థలకు విద్యుత్‌ బిల్లుల భారం తప్పనుంది. పాఠశాలలు సక్రమంగా విద్యుత్‌ బిల్లులు చెల్లించలేకపోతున్నాయని గుర్తించిన ప్రభుత్వం ఆ భారాన్ని మోయడానికి ముందుకువచ్చింది. ఇటీవల విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పుల కారణంగా మారుమూల గ్రామాల్లో కూడా తప్పనిసరిగా విద్యుత్‌ సరఫరా అవసరం ఏర్పడింది. వినియోగం కూడా పెరిగింది. దీంతో విశాఖలోని తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థకు పాఠశాలల బిల్లుల బకాయి పెరిగిపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో ఇటీవల ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. పాఠశాలల బిల్లులను ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించింది. అయితే ఇంకా ఆదేశాలు వెలువడాల్సి ఉంది.

విశాఖపట్నం సర్కిల్‌ వరకు లెక్కలు వేసుకుంటే జిల్లాలో 65 ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలు ఉన్నాయి. వాటి నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు రూ.44,06,629 మేర బిల్లులు వసూలు కావాల్సి ఉంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు 570 వరకు ఉండగా, వాటి నుంచి రూ.1,12,91,437 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం రూ.1.57 కోట్లు వసూలు కావాల్సి ఉంది.

సబ్సిడీగా ఇచ్చే అవకాశం

ప్రభుత్వ ప్రకటన మేరకు విద్యా సంస్థల బిల్లుల మొత్తాన్ని సబ్సిడీగా డిస్కమ్‌లకు అందించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత నెల బిల్లు మాత్రమే ఇలా ఇస్తారా?, ఇప్పటివరకూ ఉన్న బకాయిల మొత్తం విడుదల చేస్తారా? అనేది తేలాల్సి ఉంది.

త్వరలో సోలార్‌ విద్యుత్‌

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్‌ విద్యుదుత్పత్తిని పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నాయి. ఈ పథకాలను వినియోగించుకునే వారికి రాయితీలు కూడా అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి విద్యా సంస్థలో విద్యుత్‌ అవసరాల మేరకు సోలార్‌ ప్రాజెక్టులు నెలకొల్పి, అవసరమైన విద్యుత్‌ను సొంతంగా ఉత్పత్తి చేసుకునేలా చూడాలని యోచిస్తున్నారు. ఇది సాకారమైతే విద్యుత్‌ బిల్లులను ప్రభుత్వం కూడా భరించాల్సిన అవసరం ఉండదు. సోలార్‌ ప్రాజెక్టుకు అవసరమైన పెట్టుబడి ఒకసారి పెడితే సరిపోతుంది. అన్ని విద్యా సంస్థల్లో మైదానాలు, పైకప్పులు ఖాళీయే కాబట్టి వాటిపై సోలార్‌ పలకలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని ఈపీడీసీఎల్‌ ఉన్నతాధికారి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. త్వరలోనే వీటిపై మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉందని వివరించారు.

Updated Date - Mar 28 , 2025 | 12:25 AM