Share News

వెల్‌నెస్‌ సెంటర్ల ఏర్పాటుకు ముందుకొస్తున్నారు

ABN , Publish Date - Apr 02 , 2025 | 12:40 AM

విశాఖపట్నంలో వెల్‌నెస్‌ సెంటర్లకు మంచి డిమాండ్‌ ఉందని, చాలామంది అనువైన భూములు కావాలంటూ పర్యాటక శాఖను సంప్రతిస్తున్నారని జిల్లా పర్యాటక శాఖాధికారి (డీటీఓ) సుధాసాగర్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

వెల్‌నెస్‌ సెంటర్ల ఏర్పాటుకు ముందుకొస్తున్నారు

  • ‘పతంజలి’ ప్రతినిధులు పలు ప్రాంతాలు చూసి వెళ్లారు

  • మేర్లిన్‌ కే, శాంక్టన్‌కు నోటీసులు ఇచ్చాం

  • పర్యాటక ప్రాజెక్టులకు సింగిల్‌ విండో అనుమతులు

  • ‘ఆంధ్రజ్యోతి’తో జిల్లా పర్యాటక శాఖాధికారి సుధా సాగర్‌

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నంలో వెల్‌నెస్‌ సెంటర్లకు మంచి డిమాండ్‌ ఉందని, చాలామంది అనువైన భూములు కావాలంటూ పర్యాటక శాఖను సంప్రతిస్తున్నారని జిల్లా పర్యాటక శాఖాధికారి (డీటీఓ) సుధాసాగర్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. డిప్యూటీ కలెక్టర్‌ హోదాలో పనిచేస్తున్న ఆయన ఇటీవల డీటీఓగా బాధ్యతలు చేపట్టారు.

ప్రశ్న: వెల్‌నెస్‌ సెంటర్ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్న సంస్థలేవి?

జవాబు: పతంజలి గ్రూపునకు చెందిన ప్రతినిధులు ఇటీవల పలు ప్రాంతాలను చూసి వెళ్లారు. ఇంకా చాలామంది ముందుకు వస్తున్నారు. ప్రభుత్వం కూడా మంచి వెల్‌నెస్‌ సెంటర్‌ ఏర్పాటు చేసే యోచనలో ఉంది.

ప్ర: పర్యాటక శాఖ బీచ్‌ రెస్టారెంట్లను అద్దెకు ఇస్తే వారు పక్కన భూములు ఆక్రమించడంపై తీసుకున్న చర్యలు?

జ: తొట్లకొండలో శాంక్టన్‌కు, భీమిలిలో మేర్లిన్‌ కే’కు అదనపు నిర్మాణాలు చేపట్టకూడదని హెచ్చరిస్తూ నోటీసులిచ్చాం.

ప్ర: అన్నవరంలో ఒబెరాయ్‌, మే ఫెయిర్‌ ప్రాజెక్టుల పరిస్థితి?

జ: ఒబెరాయ్‌ గ్రూపు ఎర్త్‌ వర్క్‌ ప్రారంభించింది. మే ఫెయిర్‌ భూములకు ప్రధాన మార్గం నుంచి యాక్సెస్‌ లేకపోవడంతో దానికి సంబంధించి పనులు చేయాలని ఇటీవల ప్రభుత్వం ఆదేశించింది.

ప్ర: పర్యాటక ప్రాజెక్టులకు సింగిల్‌ విండో అనుమతులు ఎప్పటి నుంచి ఇస్తారు?

జ: రెండు రోజుల క్రితమే సింగిల్‌ విండోకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ అందుబాటులోకి వచ్చింది. దరఖాస్తులను ప్రాసెస్‌ చేస్తాం.

ప్ర: భీమిలి మండలంలో పర్యాటక శాఖకు భూములిచ్చారా?

జ: శారదాపీఠం నుంచి వెనక్కి తీసుకున్న 15 ఎకరాలిస్తే పర్యాటక ప్రాజెక్టులు చేపడతామని ఉన్నతాధికారులు ప్రభుత్వాన్ని కోరారు.

ప్ర: బంగ్లాదేశ్‌ నౌకను రెస్టారెంట్‌గా మార్చేలా అనుమతులు వచ్చాయా?

జ: అటవీ శాఖ నుంచి అనుమతి వచ్చింది. ఇటీవల విజయవాడలో సీఆర్‌జెడ్‌ సమావేశం జరిగింది. త్వరలోనే వారు కూడా అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.

Updated Date - Apr 02 , 2025 | 12:40 AM