బయ్యవరంలో కలకలం
ABN , Publish Date - Mar 19 , 2025 | 12:38 AM
మండలంలోని బయ్యవరం సమీపంలో అండర్ బ్రిడ్జి వద్ద మూటకట్టి వున్న గుర్తు తెలియని మహిళ శరీర భాగాలు లభ్యం కావడం కలకలం రేపింది.

వంతెన కింద మూటలో మహిళ శరీర భాగాలు
పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు
సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఇన్‌చార్జి ఎస్పీ వకుల్ జిందాల్
ఎక్కడో హత్యచేసి.. శరీర భాగాలను ఇక్కడ వేసినట్టు వెల్లడి
కశింకోట, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బయ్యవరం సమీపంలో అండర్ బ్రిడ్జి వద్ద మూటకట్టి వున్న గుర్తు తెలియని మహిళ శరీర భాగాలు లభ్యం కావడం కలకలం రేపింది. మంగళవారం వంతెన కింద నుంచి పొలం పనులకు వెళుతున్న రైతులు చూసి పోలీసులకు, వీఆర్‌వోకు, వీఆర్‌ఏకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తరువాత క్లూస్ టీంను రప్పించి మూటను విప్పారు. గుర్తు పట్టలేని విధంగా మహిళ శరీరభాగాలు బయటపడ్డాయి. స్థానిక పోలీసుల నుంచి సమాచారం అందుకున్న జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ వకుల్ జిందాల్ సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. మహిళను ఎక్కడో దారుణంగా హత్య చేసి, ముక్కలుగా నరికి మూటకట్టి ఇక్కడకు తీసుకువచ్చి పడేసి వుంటారని పోలీసులు భావిస్తున్నారు. హత్యకు గురైన మహిళ వయసు సుమారు 40 సంవత్సరాలు వుంటుందని పోలీసులు అంచనా వేశారు. కుడి తొడపై 1.5 అంగుళాల నల్లమచ్చ, కాలు వేళ్లకు రెండు వెండి తొడుగులు, కుడి చేతి మణికట్టుపై టాటూ, నాలుగు రోల్డ్‌గోల్డ్ గాజులు ఉన్నాయని ఇన్‌చార్జి ఎస్పీ చెప్పారు.. మహిళ ఆచూకీ తెలిసిన వారు 9440796088 (సీఐ స్వామినాయుడు) లేదా డయల్ 100/112కు ఫోన్ చేసి సమాచారం అందజేయాలనికోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా వుంచుతామన్నారు. ఈ కేసు దర్యాప్తు కోసం ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. అనంతరం మృతదేహం శరీర భాగాలను చాపలో చుట్టి అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఇన్‌చార్జి ఎస్సీ వెంట అదనపు ఎస్పీలు ఎం. దేవప్రసాద్, ఎల్.మోహనరావు, అనకాపల్లి డీఎస్పీ ఎం.శ్రావణి, సీఐలు స్వామినాయుడు, విజయ్‌కుమార్, అశోక్‌కుమార్, కోటేశ్వరరావు, పైడపునాయుడు, అప్పలరాజు, ఎస్‌ఐలు మనోజ్ కుమార్, లక్ష్మణరావు ఉన్నారు.