వైభవంగా విశ్వావసు నామ ఉగాది వేడుకలు
ABN , Publish Date - Mar 30 , 2025 | 11:50 PM
విశ్వావసు నామ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకుని ఆదివారం వైభవంగా వేడుకలు నిర్వహించారు.

రాజుపాలెం, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): విశ్వావసు నామ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకుని ఆదివారం వైభవంగా వేడుకలు నిర్వహించారు. ఉదయాన్నే భక్తిశ్రద్ధలతో ప్రజలు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేసి ఉగాది పచ్చడి తీసుకుని పంచాంగ శ్రవణం ఆలకించా రు. అదే విధంగా ప్రముఖ పుణ్యక్షేత్ర మైన వెల్లాల దేవస్థానంలో ఉగాది పర్వ దినం సందర్భంగా చెన్నకేశవ, శ్రీదేవి భూదేవి విగ్రహాల ప్రత్యేక అలంకరణ చేసి గ్రామ పురవీధుల్లో ఊరేగించి పండుగ జరుపుకున్నారు. శ్రావణ పంచాంగం వ్యవసాయ భూమిలో దిశలు తూర్పు నుంచి పడమరకు, పడమర నుంచి తూర్పునకు మళ్లీ పడమటికి రావడంతో ముందుగా పూజించుకున్న ట్రాక్టర్లు, ఎద్దుల ద్వారా పంట పొలాలకు వెళ్లి సేద్యాలు ప్రారంభించారు. ఈ సంవత్సరం ఎర్రగా పండే ధాన్యానికి మంచి దిగుబడులు వస్తాయని పంచాంగ శ్రవణంలో వేద పండితులు తెలిపినట్లు రైతులు తెలిపారు.
ఆసక్తిగా సాగిన పంచాంగ శ్రవణం
ప్రొద్దుటూరు టౌన్, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): ఉగాది పర్వదినం సందర్భంగా స్థానిక అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో పంచాంగ శ్రవణం ఆసక్తిగా సాగింది. పండుగ సందర్భంగా ఆదివారం అగస్త్యేశ్వరస్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి పూలమాలలతో అలంకరించారు. సాయంత్రం ఆలయ కాలక్షేప మండపంలో ప్రముఖ సిద్ధాంతి బీవీ రామకృష్ణయ్య పంచాంగశ్రవణం చేశారు. ఈ సంవత్సరం వర్షాలు సంవృద్ధిగా ఉంటాయని, పంటలు బాగా పండినా ధాన్యం ధరలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఎర్రని భూముల్లో పంటలు బాగా పండుతాయని వ్యాపారాలు అభివృద్ధి సాధించి విద్యార్థులు పురోగతి సాధిస్తారని తెలిపారు. ఉద్యోగులకు పదోన్నతులు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుందని పేర్కొన్నారు. పంచాంగశ్రవణం అనంతరం రమణయ్య భాగవతార్‌తో మయ్యూర ధ్వజం హరికథ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ కొత్తమిద్దె రఘురామిరెడ్డి, ఈవో రామచంద్రాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.
పోరుమామిళ్లలో: ఉగాది సందర్భంగా స్థానిక వెంకటేశ్వరస్వామి దేవాలయంలో అర్చ కులు పంచాంగ శ్రవణం వినిపించారు. ఏ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి, ఏరాశి వారికి ఎలా ఉందో సవివరంగా వివరించారు.