Share News

Another 110 people మరో 110 మంది..

ABN , Publish Date - Apr 14 , 2025 | 11:49 PM

Another 110 people సీతంపేట ఐటీడీఏ పరిధిలో కొత్తగా 110 మంది సికిల్‌సెల్‌ అనీమియా బాధితులు ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌కు అర్హత సాధించారు. బాధితులకు ఈ ఏడాది జూన్‌ నుంచి రూ.10వేల చొప్పున ప్రతినెలా పింఛన్‌ అందే అవకాశం ఉంది.

Another 110 people మరో 110 మంది..
గత ఏడాది వైటీసీలో నిర్వహించిన వైద్య శిబిరానికి హాజరైన సికిల్‌సెల్‌ బాధితులు, వారి కుటుంబసభ్యులు(ఫైల్‌)

ఇటీవల గుర్తించిన అధికారులు

పింఛన్‌ మంజూరుకు అర్హత

జూన్‌ నుంచి పొందే అవకాశం

సీతంపేట రూరల్‌,ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఐటీడీఏ పరిధిలో కొత్తగా 110 మంది సికిల్‌సెల్‌ అనీమియా బాధితులు ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌కు అర్హత సాధించారు. బాధితులకు ఈ ఏడాది జూన్‌ నుంచి రూ.10వేల చొప్పున ప్రతినెలా పింఛన్‌ అందే అవకాశం ఉంది. ఇప్పటివరకు సీతంపేట ఐటీడీఏ పరిధిలో 35 మంది గిరిజనులు ఈ పింఛన్‌ పొందుతున్నారు. త్వరలో వారితో పాటు కొత్తగా నిర్ధారించిన 110 మంది సికిల్‌ సెల్‌ అనీమియా బాధితులకు కూడా పింఛన్‌ మంజూరు కానుంది.

ఇదీ పరిస్థితి..

- వాస్తవంగా సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఎంతోమంది సికిల్‌సెల్‌ అనీమియాతో బాధపడుతున్నారు. పైకి చూసేందుకు వారు బాగానే కనిపించినా.. ఉన్నట్టుండి కళ్లు తిరిగిపడి పోవడం, నీరసించి పోవడం వంటి లక్షణాలు ఈ వ్యాధిగ్రస్థులను వెంటాడుతుంటాయి. ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి ప్రతినెలా రక్తం ఎక్కించాల్సి వస్తోంది. వారికి వైద్యం ఎంతో ఖర్చుతో కూడుకున్నది కావడంతో ఇప్పటికే ఆ వ్యాధిగ్రస్థులకు ప్రభుత్వం పింఛన్‌ రూపంలో రూ.10వేలు అందిస్తోంది.

- కొత్తగా ఈ పెన్షన్‌ పొందాలంటే సికిల్‌సెల్‌ అనీమియా రోగులు విశాఖ కేజీహెచ్‌ ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తోంది. ఎన్ని రోజులైనా అక్కడే ఉండి హెచ్‌బీఎల్‌సీ(సాలుబిలిటీ పరీక్ష)నిర్ధారణ పరీక్షలు చేయించుకుని అక్కడ వైద్యుల నుంచి ధ్రువపత్రం పొందాల్సి వచ్చేది. ఈ సర్టిఫికెట్‌ కోసం బాధితులతో పాటు వారి కుటుంబసభ్యులు అనేక పాట్లు పడేవారు. వారి కష్టాలను గమనించిన ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి విశాఖ కేజీహెచ్‌లో ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించే వైద్య సిబ్బందిని సీతంపేట వైటీసీకి రప్పించారు. గత ఏడాది డిసెంబరులో ఐటీడీఏ పరిధిలో సికిల్‌సెల్‌ అనీమియా బాధితులను హెచ్‌బీఎల్‌సీ పరీక్షలు చేయించారు.

- ఈ ప్రత్యేక వైద్య శిబిరంలో 110 మందిని పాజిటివ్‌గా గుర్తించారు. అప్పుడే పుట్టిన శిశువు నుంచి 40ఏళ్ల వయసు కలిగిన సుమారు లక్ష మందికి సాలుబిలిటీ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 225 మందికి సికిల్‌సెల్‌ అనీమియా పాజిటివ్‌ అని వచ్చింది. వారికి కేజీహెచ్‌ వైద్యులు హెచ్‌సీఎల్‌సీ(హై పెరఫార్మమెన్స్‌ లిక్విడ్‌ క్రొమటోగ్రఫి)పరీక్షలు చేయగా.. 110మందికి ఈ వ్యాధి ఉన్నట్లు తేలింది. అనంతరం వారికి వ్యాధి నిర్ధారణ ధ్రువపత్రాలు అందజేశారు. వాటి ఆధారంగా సీతంపేట ఐటీడీఏ పరిధిలోని అన్ని పీహెచ్‌సీల వైద్యాధికారులు సికిల్‌సెల్‌ అనీమియా బాధి తులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే పింఛన్‌కు అవరసమయ్యే దరఖాస్తును నింపి డీఎంహెచ్‌వో కార్యాలయానికి పంపించారు. అక్కడ దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. పాజిటివ్‌ వచ్చిన 110 మంది సికిల్‌సెల్‌ అనీమియా బాధితులకు జూన్‌ నుంచి రూ.10వేల పింఛన్‌ రానుంది. ఇన్‌చార్జి పీవో చొరవ , పింఛన్లు మంజూరు చేసిన ప్రభుత్వానికి గిరిజనులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

Updated Date - Apr 14 , 2025 | 11:49 PM