Oh, cruel fate! హతవిధీ!
ABN , Publish Date - Apr 13 , 2025 | 11:36 PM
Oh, cruel fate! తన మూడేళ్ల కొడుకు, బంధువులతో కలిసి ఆ తండ్రి ఎంతో సంతోషంగా సొంత ఆటోలో రాజులమ్మ యాత్రకు వెళ్లాడు. మొక్కులు చెల్లించుకుని తిరుగు ప్రయాణమయ్యాడు. మరో 15 నిమిషాలలో ఇంటికి చేరుతారనగా.. ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న ఆటో ఆర్టీసీ బస్సు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో తండ్రీ కొడుకులిద్దరూ మృతి చెందారు.

కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు
బలిజిపేట, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): తన మూడేళ్ల కొడుకు, బంధువులతో కలిసి ఆ తండ్రి ఎంతో సంతోషంగా సొంత ఆటోలో రాజులమ్మ యాత్రకు వెళ్లాడు. మొక్కులు చెల్లించుకుని తిరుగు ప్రయాణమయ్యాడు. మరో 15 నిమిషాలలో ఇంటికి చేరుతారనగా.. ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న ఆటో ఆర్టీసీ బస్సు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో తండ్రీ కొడుకులిద్దరూ మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బలిజిపేటకు చెందిన ముడుసు రామయ్య (30) ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య, కూతురు, కొడుకుతో కలిసి అదే గ్రామంలో నివసిస్తున్నాడు. కాగా తన మూడేళ్ల కుమారుడు పవన్‌కు మొక్కు చెల్లించాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం కొడుకుతో కలిసి తన ఆటోలో శ్రీకాకుళం జిల్లా గార మండలం వత్సవలస రాజులమ్మ యాత్రకు బయలుదేరాడు. మార్గమధ్యలో రాజాంలో తన బంధువులను ఎక్కించుకుని యాత్రకు వెళ్లాడు. అమ్మవారిని దర్శించుకుని.. మొక్కులు చెల్లించుకుని ఆదివారం వారంతా ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు. బంధువులను రాజాంలో విడిచిపెట్టి తండ్రీకొడుకులు స్వగ్రామానికి బయల్దేరారు. అయితే మరికొద్ది నిమిషాలలో ఇంటికి చేరుతారనగా.. కొల్లివలస సమీపంలో బలిజిపేట నుంచి రాజాం వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ ఎదురెదురుగా కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ రామయ్య, ఆయన కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని భోరున విలపించారు. భర్త, కొడుకు మృతదేహాలను చూసి భార్య గుండెలవిసేలా రోదించింది. ఇక తమకు దిక్కెవరెని.. ఎలా బతకాలని కన్నీరుమున్నీరైంది. ఈ ఘటనపై బలిజిపేట ఎస్‌ఐ సింహాచలం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు.