Share News

టీడీపీ చేతికి ఒకసారే

ABN , Publish Date - Apr 15 , 2025 | 12:20 AM

TDP's hand once 4 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, 24 బ్రాంచ్‌లు, 9 ఏటీఎం కేంద్రాలు, మూడు మొబైల్‌ ఏటీఎంలు, 1.30 లక్షల మంది సభ్యులు, రూ.1,750 కోట్ల లావాదేవీలు’.. ఇదీ ఉమ్మడి విజయనగరం జిల్లా సెంట్రల్‌ కోఆపరేటివ్‌ బ్యాంకు స్వరూపం.

టీడీపీ చేతికి ఒకసారే
జిల్లా కేంద్రంలోని డీసీసీబీ కార్యాలయం

టీడీపీ చేతికి ఒకసారే

తెలుగుదేశం పార్టీకి అందని ద్రాక్షగా డీసీసీబీ

సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌, వైసీపీ చేతుల్లోనే

వెలుగులోకి అవకతవకలు, వైఫల్యాలు

ఈ ప్రభుత్వ హయాంలో నైనా... గాడినపడేనా?

రెండు నెలల్లో కొత్త పాలకవర్గం వచ్చే అవకాశం

94 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, 24 బ్రాంచ్‌లు, 9 ఏటీఎం కేంద్రాలు, మూడు మొబైల్‌ ఏటీఎంలు, 1.30 లక్షల మంది సభ్యులు, రూ.1,750 కోట్ల లావాదేవీలు’.. ఇదీ ఉమ్మడి విజయనగరం జిల్లా సెంట్రల్‌ కోఆపరేటివ్‌ బ్యాంకు స్వరూపం. ఇంతటి ఘన చరిత్ర ఉన్న డీసీసీబీకి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత ఒకే ఒకసారి ఆ పార్టీనేత అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఆయన పేరు కురిమిల్లి సత్యంనాయుడు. అది కూడా 1992కు ముందు మాత్రమే. అటు తరువాత ఇంతవరకూ టీడీపీకి డీసీసీబీ పగ్గాలు దక్కలేదు. అనేక అక్రమాలు.. వైఫల్యాలతో పేరుమాసిన డీసీసీబీ ఇప్పటికైనా గాడిన పడుతుందేమోనని సభ్యలు ఆశతో ఎదురుచూస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఈసారి టీడీపీకే డీసీసీబీ దక్కే అవకాశం ఉంది. రెండు నెలల్లోగా ఎన్నికలు జరగవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు.

విజయనగరం, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి):

సహకార వ్యవస్థలో కీలక విభాగంగా ఉండే డీసీసీబీ సుదీర్ఘ కాలం టీడీపీయేతరుల చేతుల్లోనే ఉండిపోయింది. అదే సమయంలో రుణాల మంజూరు, ఇతరత్రా ప్రయోజనాల విషయంలో భారీ వైఫల్యాలు, అవినీతిని మూటగట్టుకుంది. 1983 నుంచి ఇప్పటివరకూ టీడీపీ ఐదుసార్లు గెలిచింది కానీ ఆ పార్టీకి డీసీసీబీ పగ్గాలు వచ్చింది ఒకే ఒకసారి మాత్రమే. కాగా వైసీపీ నేత బొత్స సత్యనారాయణ డీసీసీబీ అధ్యక్షుడిగానే రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. 1992 నుంచి 1999 వరకూ రెండుసార్లు డీసీసీబీ చైర్మన్‌గా పనిచేశారు. అటు తరువాత మరిశర్ల కుటుంబం సుదీర్ఘ కాలం డీసీసీబీని ఏలింది. 2012లో జరిగిన ఎన్నికల్లో మరిశర్ల తులసీ డీసీసీబీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. 2017లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికలు జరపాల్సి ఉన్నా అప్పట్లో నిర్వహించలేదు. కాంగ్రెస్‌ హయాంలో నియామకం అయిన కమిటీలనే కొనసాగించారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ మళ్లీ మరిశర్ల తులసీకే ఆ బాధ్యతలు అప్పగించింది. ఫలితంగా డీసీసీబీ పగ్గాలు అనేవి టీడీపీకి అందని ద్రాక్షగా మిగిలాయి.

సేవలు పోయి వ్యాపార ధోరణిలోకి..

వైసీపీ హయాంలో జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు నిర్వీర్యం అయ్యాయి. రైతులకు సేవలందించాల్సింది పోయి వ్యాపార ధోరణిలోకి మారాయి. పీఏసీఎస్‌ల్లో 50 శాతం వాటాలు ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూ అప్పట్లో జగన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు వ్యతిరేకించడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఉమ్మడి జిల్లాలో 94 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఉన్నాయి. గతంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు రైతు సేవలో తరించేవి. తొలుత ఎటువంటి రుసుం చెల్లించకుండానే రైతులు ఈ సంఘాల ద్వారా పంట రుణాలు, ఎరువులు పొందేవారు. పంట ఉత్పత్తులు విక్రయించిన తరువాత డబ్బులు చెల్లించేవారు. అక్కడకు కొద్దిరోజుల తరువాత సభ్యత్వ రుసుం కింద రూ.10 వసూలు చేసి సంఘ సభ్యులుగా చేర్చుకునేవారు. ప్రాంతీయ వ్యవసాయ కోఆపరేటివ్‌ బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందేవారు. అయితే ప్రస్తుతం పీఏసీఎస్‌ల్లో రైతుల సభ్యత్వం తగ్గిపోయింది. సభ్యత్వ రుసుం ఏకంగా రూ.300కు పెరిగింది. అలాగే పీఏసీఎస్‌ కార్యవర్గాల ఎన్నికలు పంచాయతీ ఎన్నికలకు మించి ఖర్చుగా మారాయి. దీంతో పీఎసీఎస్‌ల్లో అవినీతి కూడా పెరిగిపోయింది.

సహకార ఉద్యమంతో..

భారతదేశంలో 19వ శతాబ్దం చివరి రోజుల్లో సహకార ఉద్యమం ఓ స్థాయికి చేరింది. గ్రామాల్లో రైతులను వడ్డీ వ్యాపారులు పిప్పిచేయడంతో రైతులు ఉద్యమ బాట పట్టారు. దీంతో ప్రభుత్వం సహకార వ్యవస్థను ప్రవేశపెట్టక తప్పలేదు. రాష్ట్ర సహకార బ్యాంకులకు నాబార్డు రుణాలు ఇస్తే.. అక్కడ నుంచి జిల్లా సహకార బ్యాంకులకు, అటు తరువాత ప్రాంతీయ కోపరేటివ్‌ బ్యాంకులకు రుణాలు సర్దుబాటు చేసేవారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సహకార వ్యవస్థకు నిధుల సర్దుబాటు నిలిచిపోయింది. నవరత్నాలకే అన్ని నిధులు మళ్లిస్తుండడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. నిధుల సర్దుబాటు నుంచి విత్తనాలు, ఎరువుల సరఫరా సైతం తగ్గుముఖం పట్టింది. ఆ తర్వాత జిల్లాలో సహకార బ్యాంకుగా ఉన్న డీసీసీబీ రైతు సేవలకు దూరమైంది. సాధారణ వాణిజ్య బ్యాంకులా మారిపోయింది. ఫక్తు రాజకీయ విభాగంగా పేరొందింది. కంప్యూటరీకరణతో పాటు వసతులపరంగా మెరుగుపడినా రైతులపరంగా ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదు. కూటమి ప్రభుత్వం దృష్టిపెట్టాల్సిన అవసరముంది.

Updated Date - Apr 15 , 2025 | 12:20 AM