Share News

Waqf Land Scam: వక్ఫ్‌ భూములకు ఎసరు

ABN , Publish Date - Apr 09 , 2025 | 03:25 AM

ముస్లింల సంక్షేమం కోసం ఉద్దేశించిన 30 వేల ఎకరాల వక్ఫ్ భూమిపై దురుద్దేశపూరిత కుట్రలు కొనసాగుతున్నాయి. సీఎం స్పష్టమైన ఆదేశాలను ఉల్లంఘిస్తూ, వాణిజ్య అవసరాల పేరుతో భూములను కబ్జా చేయన్ను మంత్రాంగంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి

Waqf Land Scam: వక్ఫ్‌ భూములకు ఎసరు

  • 30 వేల ఎకరాలపై ఇంటి దొంగల కన్ను!

  • రాష్ట్ర ప్రభుత్వ కళ్లకు గంతలు

  • ముస్లింల సంక్షేమానికే వాడాలన్న చంద్రబాబు

  • నాలుగు నెలల క్రితమే అధికారులకు స్పష్టీకరణ

  • ఇప్పుడు ప్రభుత్వానికి తెలియకుండా మంత్రాంగం

  • ఇద్దరు అధికారులు సహా నలుగురు కీలకం

  • వ్యాపారం పేరిట అస్మదీయులకు ఇచ్చే ఎత్తు

  • వారి ద్వారా వాటిని అనుభవించాలనే కుయుక్తి

  • వక్ఫ్‌బోర్డును అడ్డుపెట్టుకుని నోటిఫికేషన్‌

‘‘వక్ఫ్‌ భూములను వాణిజ్య అవసరాలకు వాడొద్దు. వాటిని కమ్యూనిటీ అభివృద్ధి, సంక్షేమం కోసమే వాడాలి..’’

- సీఎం చంద్రబాబు

...ఆ తర్వాత నాలుగు నెలలకే వక్ఫ్‌బోర్డు సీఈవో పేరిట ఓ నోటిఫికేషన్‌ జారీ అయింది. వ్యాపార, వాణిజ్య అవసరాలు, అభివృద్ధికి వక్ఫ్‌ భూములను ఉపయోగిస్తామనేది ఆ నోటిఫికేషన్‌ సారాంశం. ఆసక్తి ఉన్నవారు సంప్రదించవచ్చునని కోరారు. సీఎం ఆదేశాల స్ఫూర్తికి భిన్నంగా, సర్కారు కళ్లు గప్పి ప్రకటన జారీ చేయడమే తప్పు. దీనికితోడు.. కనీస అర్హతలు సైతం నిర్ణయించకుండానే నోటిఫికేషన్‌ ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. దరఖాస్తుదారులే తమ స్తోమత, ఆదాయం, అనుభవం, నైపుణ్యత గురించి దరఖాస్తులో పొందుపరచాలట! ‘అస్మదీయుల’ కోసం నలుగురు పెద్దలు వక్ఫ్‌బోర్డును అడ్డుపెట్టుకుని ఈ డొల్ల వ్యవహారం నడిపించారన్న చర్చ రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల శాఖ వర్గాల్లో మొదలైంది.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో వక్ఫ్‌బోర్డు పరిధిలో 90 వేల ఎకరాల భూమి ఉంది. అందులో 30వేల ఎకరాల భూమి కబ్జాకు గురయింది. మిగిలిన 60 వేల ఎకరాల్లో 30 వేల ఎకరాల భూమి ఖాళీగా ఉంది. ఆ భూమిని కమ్యూనిటీ సంక్షేమం కోసమే వాడాలని సీఎం చంద్రబాబు నాలుగు నెలల క్రితమే సూటిగా, స్పష్టంగా చెప్పారు. అంటే, ఆ భూములను ముస్లిం వర్గాల సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి ఉపయోగించాలన్నది ఆయన ఉద్దేశం. కానీ, వేల కోట్ల విలువైన ఆ భూములపై ఇంటిదొంగలకు ఆశ చావలేదు. ఎలాగైనా వాటిని వ్యాపారం పేరిట అస్మదీయులకు కట్టబెట్టి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆ భూములకు లబ్ధిదారులవ్వాలనే కుట్రలు, కుయుక్తులకు తెరలేపారు.


తెర వెనక మంత్రాంగం నడిపి ప్రభుత్వానికి ఇసుమంతైనా తెలియనీయకుండా వేల ఎకరాల భూములతో వ్యాపారం చేయాలనుకున్నారు. ఇందుకు వక్ఫ్‌బోర్డుతో ఓ నోటీసు ఇప్పించారు. వక్ఫ్‌ భూములతో వ్యాపారం చేయాలనుకునే వారు ఆసక్తిని (ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌) లిఖితపూర్వకంగా తెలియజేయాలని నోటీసులో పేర్కొన్నారు. మే 8వ వరకు గడువు ఇచ్చారు. ఈ దందాలో నలుగురు పెద్దల పాత్ర ఉంది. వారిలో ఇద్దరు అధికారులు, మరో ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు. అందులో ఒకరు వక్ఫ్‌ వ్యవస్థలో చాలా కీలకమైన వ్యక్తి. ఆయన కనుసన్నల్లోనే భూ మంత్రాంగం నోటీసుదాకా సాగినట్లు తెలిసింది.

ధార్మిక ఆస్తులపై సీఎం గైడ్‌లైన్స్‌..

కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ, దేవదాయ, వక్ఫ్‌ భూములను కాపాడుతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆ భూముల వినియోగం, రక్షణపై శ్వేతపత్రాలు ఇచ్చారు. గత నాలుగు నెలల క్రితం ముఖ్యమంత్రి వద్ద జరిగిన కీలక సమావేశంలో అధికారులు వక్ఫ్‌ భూముల ప్రస్తావన తీసుకొచ్చారు. వాటిని వాణిజ్య అవసరాలకు వాడితే ఎలా ఉంటుందన్న ప్రతిపాదన చేయబోగా, సీఎం గట్టిగా వారించారు. ‘‘వక్ఫ్‌ భూములను వాణిజ్య అవసరాలకు వాడొద్దు. వాటిని కమ్యూనిటీ (ముస్లిం వర్గాల) అభివృద్ధి, సంక్షేమం కోసమే వాడాలి’’ అని స్పష్టం చేశారు. అప్పటికి వక్ఫ్‌బోర్డు నియామకం జరగలేదు. ఈ భేటీలో మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి, కార్యదర్శి, కమిషనర్‌ స్థాయి అధికారులు మాత్రమే పాల్గొన్నారు. ముస్లిం వర్గాల సంక్షేమం, అభివృద్ధి అంటే ఆ వర్గాల వారికి విద్య, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు విద్యాసంస్థలను నెలకొల్పడం, పరిశ్రమలను ఏర్పాటు చేయడం, ఇంకా ఆర్ధికాభివృద్ధిని తీసుకొచ్చే సంస్థలను నెలకొల్పడం వంటి చర్యలు ప్రభుత్వం ద్వారా, మైనారిటీ సంక్షేమశాఖ ద్వారా జరగాలని సీఎం విశదీకరించారు.


వక్ఫ్‌ భూములపై బోర్డుకు అధికారం లేదు..

సీన్‌ కట్‌ చేస్తే.... ఈ నెల 3వ తేదీన వక్ఫ్‌బోర్డు సీఈవో పేరిట ఓ వ్యాపారప్రకటన ఇచ్చారు. తమ వద్ద 1 నుంచి 200 ఎకరాల సామర్థ్యం కలిగిన భూములు ఉన్నాయని, వాటిని వ్యాపార, వాణిజ్య అవసరాలు, అభివృద్ధికి ఉపయోగిస్తామని, మే 8వ తేదీలోగా ఆసక్తి ఉన్న వారు తమకు లిఖితపూర్వకంగా తెలియజే యాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే, దరఖాస్తు దారులకు ఎలాంటి అర్హత ఉండాలి? వారి ఆదాయం ఎంత ఉండాలి? వారి పూర్వానుభవం ఏమిటి? వారి ఆర్ధిక స్థోమత ఎంత ఉండాలి? తదితర అంశాలపై ఆ ప్రకటనలో స్పష్టత ఇవ్వలేదు. ఓ క్యూఆర్‌కోడ్‌ ఇచ్చి దాన్ని స్కాన్‌చేసుకోవాలని చెప్పారు. ఆ కోడ్‌ను స్కాన్‌చేస్తే ఓ డాక్యుమెంట్‌ వస్తుంది. అందులోనూ ఆసక్తిని కనబరిచేవారికి ఉండే అర్హతలు ఏమిటి, సాంకేతిక పరిమితులు ఏమిటో తెలియజేయలేదు. అంతా సాదాసీదాగా, ఓ చెట్టుకింద సంస్థ ఇచ్చిన ప్రకటనలా ఉంది. దాన్ని చూసిన వారికి ఎవరికైనా దీనికి వెనక ఏదో గూడుపుఠాణి దాగి ఉందన్న అనుమానం వస్తుంది. నిపుణత, అనుభవం అనే శీర్షిక పెట్టారు. కానీ అదెలా ఉండాలో వివరించలేదు. ఆర్థిక స్థిర త్వం ఏమిటో దరఖాస్తుదారులే తెలియజేయాలని పేర్కొన్నారు. అంటే, ఏ ప్రభుత్వ సంస్థ అయినా తమ వద్ద వర్క్‌ చేయాలనుకునే కంపెనీలు, సంస్థలకు నిర్దిష్ట ప్రమాణాలు, అర్హతలు, అనుభవం ఉండాలని ముందుగానే నిర్ణయిస్తాయి. వాటిని నిర్దేశిస్తూ ఆ ప్రమాణాలకు తగిన వారే దరఖాస్తు చేసుకోవాలని చెబుతాయి. కానీ, ఇది ఇందుకు పూర్తి విరుద్దంగ ఉంది. ఏదీ చెప్పలేదు. దరఖాస్తు దారులే తమ స్థోమత, ఆదాయం, అనుభవం, నైపుణ్యత వంటివి చెప్పాలని పేర్కొన్నారు. దీన్ని బట్టే అర్ధమవుతోంది ఇదెంత డొల్లగా ఉందో! ఈ ప్రకటన గురించి ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి ఆరాతీయగా, విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి.


ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా, ప్రభుత్వానికి మాటమాత్రమైన చెప్పకుండానే వక్ఫ్‌బోర్డు సీఈవో ఈ ప్రకటన జారీ చేశారు. అయితే, ఇలాంటి ప్రకటనలు ఇచ్చే అధికారం వక్ఫ్‌బోర్డు సీఈవోకు లేదు. వక్ఫ్‌బోర్డు స్వతంత్ర సంస్థ కావొచ్చు. కానీ, దాని పరిధిలోని వేల ఎకరాల భూములను కాపాడుతోంది ప్రభుత్వం. వక్ఫ్‌బోర్డుతో సహా మైనారిటీ సంక్షేమశాఖ పరిధిలోని అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి వేతనాలు చెల్లిస్తోంది ప్రభుత్వమే. కాబట్టి ఈ సంస్థ పరిధిలోని ప్రతీ గజం భూమిపై ప్రభుత్వానికే బాధ్యత ఉంటుంది. ఒకవేళ భూముల విషయంలో వక్ఫ్‌బోర్డు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే విధిగా ఆ ప్రతిపాదనపై ప్రభుత్వాన్ని సంప్రదించాలి. సర్కారుకు అంగీకరించిన తర్వాతే ఏ నిర్ణయం అయినా తీసుకోవాలి. కానీ వక్ఫ్‌బోర్డు ఇవేవీ చేయకుండానే తనకు తానే నోటిఫికేషన్‌ ఇచ్చింది.

జగన్‌ హయాంలోనే దుస్సాహసం

జగన్‌ జమానాలో వేల ఎకరాల వక్ఫ్‌ భూములు పరాధీనమయ్యాయి. నాటి వైసీపీ నేతలు ఈ భూములపై పెద్ద మంత్రాంగం నడిపారు. ఓ కన్సల్టెంట్‌తో వక్ఫ్‌బోర్డు భూములపై అధ్యయనం చేయించారు. వాటిని వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తే ఆదాయం వస్తుందని, అలా వచ్చే ఖర్చుతో ప్రభుత్వ అవసరాలు తీరుతాయని నివేదిక ఇప్పించారు. ఈ నివేదిక ఆధారంగా, వక్ఫ్‌ భూములను వాణిజ్య అవసరాలకు లీజు ప్రాతిపకదిన ఇచ్చేందుకు అనుమతించాలని ఆ నాటి వక్ఫ్‌బోర్డు సీఈవో ప్రతిపాదించారు. అప్పుడు వక్ఫ్‌బోర్డు కూడా లేదు. కేవలం సీఈవో ఆనాటి మైనారిటీ శాఖలోని పెద్దల ఆదేశాలతో ఈ ప్రతిపాదన పంపించారు. ఈ ప్రతిపాదనను చూసి జగన్‌ కంగుతిన్నారు. ఓటు బ్యాంకుకు ఆయువుపట్టు లాంటి వక్ఫ్‌ భూములతో వ్యాపారం చేస్తారా? అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రతిపాదనను ముట్టుకోవద్దని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు, అంటే 2024 మార్చి నెలకుముందు, జరిగిన పరిణామాలివి.


అంతా చీకటి మంత్రాంగం

మైనారిటీ సంక్షేమశాఖలో కీలకస్థానాల్లో ఉన్న నలుగురి పెద్దలకు వక్ఫ్‌ భూములపై కన్నుపడింది. తాము ఏది చెప్పినా సీఎం వింటున్నారని వారు భావిస్తున్నారు. కాబట్టి వక్ఫ్‌ భూముల విషయంలో ఏం చేసినా అడిగేవారుండరని అనుకున్నారు. నగర, పట్టణ ప్రాంతాల్లో వక్ఫ్‌ భూముల్లో పెట్రోలు బంకులు, వాణిజ్య భవనాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, మల్టిప్లెక్స్‌ల వంటి వాటికి తమ అస్మదీయులతోనే లీజు ఒప్పందాలు చేయించాలని ముందుగానే నిర్ణయించారు. రాయలసీమలోని భూములను సోలార్‌, విండ్‌ ఎనర్జీ కంపెనీలకు ఇచ్చేపేరిట ప్రకటన ఇచ్చినా, అది జరగదని వారికి తెలుసు. ఈ పేరిట వాణిజ్య అవసరాలను నడుపుకోవచ్చన్నది అసలు ఉద్దేశం. అంతే...తమ ఆలోచనలను వక్ఫ్‌బోర్డుపై రుద్దారు. వక్ఫ్‌ సభ్యులకు పూర్తి సమాచారం ఇవ్వకుండా అంతా మంచికే అని చెప్పి బోర్డులో ఆనుకూల తీర్మానం చేయించారు. ఆ తర్వాత ఈనెల 3న ప్రకటన ఇప్పించారు. ఈ మొత్తం వ్యవహారంలో మైనారిటీ సంక్షేమంలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు, మరో రిటైర్డ్‌ అధికారి పాత్ర ఉన్నట్లు తెలిసింది. ఇందులో ఓ అధికారి డిప్యూటేషన్‌పై వచ్చి పనిచేస్తున్నారు. మరొకరు మైనారిటీ సంక్షేమశాఖలో కీలక వ్యక్తి వద్ద పనిచేస్తున్నారు. ఈయన రిటైర్డ్‌ అధికారి. ఇక నాలుగో వ్యక్తే కీలకం. ఈయన కీలక హోదాలో ఉండి మొత్తం అందరినీ కూడగట్టి వాణిజ్య అవసరాలకు వక్ఫ్‌ భూముల ప్లాన్‌ను రచించినట్లు తెలిసింది.

Updated Date - Apr 09 , 2025 | 03:31 AM