విజయోస్తు
ABN , Publish Date - Mar 16 , 2025 | 11:57 PM
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి.

నేటి నుంచి పది పరీక్షలు
128 పరీక్ష కేంద్రాలు
24,393 మంది విద్యార్థులు
ఏర్పాట్లు పూర్తి
భీమవరం రూరల్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లను జిల్లా విద్యాశాఖ సిద్ధం చేసింది. జిల్లాలో 128 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. వీటిలో ఆరు పరీక్షా కేంద్రాలు సమస్యాత్మక కేంద్రాలుగా నిర్ణయించారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఉంటుంది. జిల్లాలో మొత్తం 24,393 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 12.45 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి విద్యార్థులు చేరుకోవాలి. 8.45 గంటల నుంచి పరీక్ష కేంద్రంలో విద్యార్థులను అనుమతిస్తారు. సహేతుక కారణాలతో సకాలంలో పరీక్షకేంద్రానికి చేరుకోలేకపోయిన విద్యార్థులకోసం ‘అర్ధగంట’ గ్రేస్ పీరియడ్‌ను నిర్దేశించారు. ఈ వెసులుబాటును నిత్యం వినియోగించుకునేవారిపై నిఘా ఉంచుతారు. విద్యార్థులు పరీక్ష కేంద్రంలోనికి ఎటువంటి ఎలకా్ట్రనిక్ వస్తువులు తీసుకురాకూడదు. ప్రశ్నా పత్రం లీకేజీ లేకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియో గించుకుని ప్రతీ ప్రశ్నపత్రానికి ఒక క్యూఆర్ కోడ్‌ను ఇచ్చారు. ప్రశ్నపత్రం ఎక్కడైనా లీకైతే కోడ్ ఆధారంగా సంబంధిత లీకేజీ ఏ పరీక్ష కేంద్రం నుంచి జరిగిందనేది వెంటనే తెలిసిపోతుంది. ఎండలు తీవ్రం కావడంతో పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఉక్కపోత, తాగునీటి సమస్యలు తలెత్తకుండా సంబంధిత మండలాల ఎంఈవోలు, కేంద్రా ల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఆల్ ది బెస్ట్
పదో తరగతి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడి లేకుండా పరీక్ష సమయానికి ముం దుగానే వెళ్లాలి. తెలిసిన ప్రశ్నలకు ముందుగా జవాబులు రాసుకోవాలి. ప్రతి ప్రశ్న క్షుణ్ణంగా చదివి జవాబు ఇవ్వాలి. పరీక్ష సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి. ఉచిత బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకోండి. పరీక్ష కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం.
– నారాయణ, డీఈవో
పరీక్షాకేంద్రాల వద్ద 144 సెక్షన్ : ఎస్పీ అద్నాన్ నయీం అస్మి
భీమవరం క్రైం, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. పరీక్షల నిర్వహణపై ఆదివారం ఆయన మాట్లాడుతూ పరీక్షా పత్రా లు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశామని, పరీక్ష పేపర్లు కేంద్రాలకు తీసుకొచ్చేటప్పుడు, సమాధాన పతాల్రు తీసుకెళ్లేటప్పుడు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్నందున బయట వ్యక్తులు రాకుండా చర్యలు తీసుకున్నామని, పరీక్ష కేంద్రాల సమీపంలోని అన్ని జిరాక్స్ సెంటర్లను మూసివేయిస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కేంద్రాల్లో అవసరమైన వరకు బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని, ఎలాంటి అవకతవకలు, మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఇతర శాఖల సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేశామని, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక మొబైల్ పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా సమయంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద ఇన్విజిలేటర్లు, పరీక్షకు కేటాయించిన సిబ్బంది తప్ప ఇతర సిబ్బంది, వ్యక్తులుగాని ఉండరాదని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఏ పరీక్షా కేంద్రం వద్ద అయినా ఎటువంటి అవాంఛనీయ ఘటన జరిగినా, పరీక్షల సమయంలో విద్యార్థులకు అత్యవసర పరిస్థితులు ఎదురైతే సహాయం కొరకు వెంటనే డయల్ 100/112 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు.