స్వయం ఉపాధికి ఊపిరి
ABN , Publish Date - Mar 17 , 2025 | 12:03 AM
వైసీపీ పాలనలో ఐదేళ్లపాటు పూర్తిగా పక్కన పెట్టిన స్వయం ఉపాధి రుణాలకు ప్రస్తుత ప్రభుత్వం ఊపిరిలూదుతోంది.

యువతకు సబ్సిడీపై రుణాలు
రుణాలు, యూనిట్ల స్థాపనపై లక్ష్యాలు
మహిళలకు శిక్షణ, ఉపాధి కల్పన
వైసీపీ పాలనలో ఐదేళ్లపాటు పూర్తిగా పక్కన పెట్టిన స్వయం ఉపాధి రుణాలకు ప్రస్తుత ప్రభుత్వం ఊపిరిలూదుతోంది. ఉద్యోగం లేక, ఉపాధి కోసం రుణం అందక ఇబ్బంది పడుతున్న యువతకు స్వయం ఉపాధి రుణాలు అందించేందుకు రంగం సిద్ధం చేస్తుంది. రుణాల మంజూరు, యూనిట్ల కేటాయింపుపై జిల్లాల వారీగా అధికారులకు లక్ష్యాలను నిర్దేశించింది.
తాడేపల్లిగూడెం రూరల్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): పశ్చిమలో బీసీలకు స్వయం ఉపాధి సోపానం కింద 1901 మందికి రూ.72.98 కోట్లు, ఏలూరు జిల్లాలో 1901 మందికి రూ.72.98 కోట్లు రుణ సదుపాయం కల్పించేందుకు బీసీ కార్పొరేషన్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వీటితోపాటు బి ఫార్మా పూర్తిచేసిన యువకులు జనరిక్ మందుల షాపులు నిర్వహించేందుకు కూడా రెండు జిల్లాలకు కలిపి 77 యూ నిట్‌లు నెలకొల్పడానికి చర్యలు తీసుకుంటున్నారు. యువతకు ఉపాధి కల్పించడంతోపాటు పేదలకు తక్కువ ధరకు మందు లు అందించే ప్రయత్నం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.
చేతి వృత్తుల వారికి..
చేతి వృత్తులు చేసుకునే మేదర, కుమ్మరి శాలివాహన కులాలకు సబ్సిడీతో కూడిన రుణాలు అందించి వారికి వృత్తులను ప్రోత్సహించనున్నారు. మరుగున పడిపోతున్న చేతి వృత్తులనే రాబోయే తరాలకు అందించాలనే ఉద్దేశంతో ముగ్గురు కలిపి ఒక యూనిట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కొ యూనిట్‌కు 50 శాతం సబ్సిడీపై రూ.3లక్షల రుణం అందించనున్నారు. చేతి వృత్తుల వారికి పశ్చిమగోదావరి జిల్లాకు 145, ఏలూరు జిల్లాకు 145 యూనిట్‌లకు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించారు.
కాపు కార్పొరేషన్ రుణాలు
కాపు యువతకు స్వయం ఉపాధి లక్ష్యంతో 50శాతం సబ్సిడీపై పశ్చిమలో 694 యూనిట్‌లకు రూ.23.31 కోట్లు, ఏలూరు జిల్లాలో 693 యూనిట్‌లకు 23.28 కోట్లు రుణాలు అందించేందుకు లక్ష్యం నిర్దేశించారు. వాటితోపాటు అగ్రవర్ణ కులాలైన కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, క్షత్రియ ఆర్యవైశ్య కులాలకు ప్రత్యేక ఆర్థిక పరిపుష్టి అందించే దిశగా పశ్చిమలో 215 యూనిట్‌లకు రూ.4.30 కోట్లు, ఏలూరు జిల్లాలో 215 యూని ట్‌లకు రూ.4.30 కోట్ల రుణాలు అందించనుంది. వీటితోపాటు ఎంఎస్‌ఎంఈ రుణాల ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సబ్సిడీతో కూడిన రుణ సదుపాయం కల్పించేందుకు నిధులు విడుదల చేయనున్నారు.
మహిళలకు శిక్షణ.. కుట్టు మిషన్లు
మహిళలు స్వయం సమృద్ధి సాధించేందుకు ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న కుట్టు మిషన్లు కూడా ప్రభుత్వం అందించ నుంది. అందుల్లో భాగంగానే పశ్చిమలో 4589 మందికి, ఏలూరు జిల్లాలో 4569 మందికి శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టుమిషన్లు అందించేందుకు సన్నాహాలు చేస్తోంది.