ఇక కొత్తగా ఇంటర్ విద్య
ABN , Publish Date - Mar 30 , 2025 | 01:03 AM
ఇంటర్ విద్యలో భారీ సంస్కరణలను నూతన విద్యాసంవత్సరం (2025–26)నుంచే ప్రారంభిం చడానికి జిల్లాలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఒకటో తేదీ నుంచే ద్వితీయ సంవత్సరం తరగతులు
4 నుంచి ‘ప్రథమ’ విద్యార్థులకు బ్రిడ్జి క్లాసులు
ప్రభుత్వ విద్యార్థులందరికీ ఎంట్రన్స్ పరీక్షల మెటీరియల్
అడ్మిషన్లకోసం టెన్త్ విద్యార్థుల వద్దకే అధ్యాపకులు
ఏలూరు అర్బన్, మార్చి 29 (ఆంధ్రజ్యోతి) : ఇంటర్ విద్యలో భారీ సంస్కరణలను నూతన విద్యాసంవత్సరం (2025–26)నుంచే ప్రారంభిం చడానికి జిల్లాలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ జూని యర్ కళాశాలల్లోనూ బోధించేందుకు వీలుగా మార్పులు జరగనున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుంచి నేరుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరేందుకు కొద్దిరోజులుగా జూని యర్ లెక్చరర్లు బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయి లో పదో తరగతి పరీక్షలు రాస్తున్న బాలబాలి కలను, వారి తల్లిదండ్రులను కలుసుకుని నచ్చ చెబుతుండగా, కొద్దిరోజుల్లోనే ఇంటర్ ద్వితీయ సంవత్సరం తరగతులను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ ఏడాది నుంచి ఇంటర్ విద్యలో అమలుకానున్న పలు సంస్కరణలపై ఓ పరిశీలన.
జూ ఈ ఏడాది నుంచి ఇంటర్ తరగతుల షెడ్యూలు మారింది. ఆ ప్రకారం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులను ప్రారంభించాల ని ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలను ప్రైవేటు/కార్పొరేట్ కళాశాలలతో పోటీపడేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఏప్రిల్ ఒక టో తేదీ నుంచి 23 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరం తరగతులను నిర్వహించి, 24నుంచి జూన్ ఒకటో తేదీ వరకు వేసవి సెలవులు ఇచ్చేలా షెడ్యూలును సవరించిం ది. సెలవుల అనంతరం జూన్ 2నుంచి కళాశాలలు పునఃప్రారంభమవుతాయి. జిల్లా లో 19 ప్రభుత్వ, 31 హైస్కూల్ ప్లస్, 6 సోషల్‌వెల్ఫేర్, 3 కేజీబీవీలు, 3 ట్రైబల్‌వెల్ఫేర్, 90 ప్రైవేటు అన్ ఎయిడెడ్ జూనియర్ కళా శాలల్లో ఈ ఏడాది ప్రథమసంవత్సరం ఇంటర్ నుంచి ద్వితీయ సంవత్సరంలోకి ప్రవేశించనున్న బాలబాలికలు మొత్తం 18,500 మంది ఉన్నారు.
జూ ఈ ఏడాది నుంచి ప్రభుత్వ యాజమాన్య పరిధిలోని అన్ని కళాశాలల్లో అడ్మిషన్లు తీసు కున్న విద్యార్థులందరికీ ఎన్‌ఐటీ/ఐఐటీ, మెడిసిన్, తదితర జాతీయస్థాయి ఎంట్రన్స్ పరీక్షల మెటీరియల్‌ను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. వీటితోపాటు మొదటిసారిగా సైన్సు విద్యార్థులకు రికార్డ్ బుక్‌లు, ప్రాక్టికల్స్ మాన్యువల్స్‌ను అందజేయనున్నారు.
జూ ఈ ఏడాది నుంచి ప్రథమ సంవత్సరంలో ఎంబైపీసీ గ్రూపును కొత్తగా ప్రారంభించ నున్నారు. ఈ గ్రూపులో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులు మెడిసిన్, ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు రెండింటికీ అర్హత సాధిస్తారని అధికార వర్గాలు వివరించాయి. దీనివల్ల ప్రభుత్వ యాజమాన్య జూనియర్ కళా శాలల్లో ఈ ఏడాది ఫస్టియర్ ఇంటర్ అడ్మి షన్లు 4500ల నుంచి 6వేలకు పెరుగుతా యని అంచనా వేస్తున్నారు. కాగా పదో తరగతి పరీక్షల ఫలితాల వెల్లడికి మరో నెల గడువు ఉన్నప్పటికీ, విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలవైపు ఆకర్షితులయ్యేలా వారికి అదనపు తర్ఫీదునిచ్చేందుకు ఏప్రిల్ 4నుంచే ప్రథమ సంవత్సరం బ్రిడ్జి క్లాసులను నిర్వహించనున్నారు. ఫస్టియర్ పాఠ్యాం శాలు, భాషానైపుణ్యాలు, తదితర అంశాలపై బ్రిడ్జిక్లాసుల్లో విద్యార్థులకు బోధిస్తారు.
ఎన్నో ప్రయోజనాలు..
ఈ ఏడాది ఇంటర్మీడియట్ విద్యలో ప్రవేశ పెడుతున్న సంస్కరణల వల్ల ప్రభుత్వ కళా శాలల్లో అడ్మిషన్లు తీసుకునే విద్యార్థులకు చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇంటర్మీడి యట్‌ను పాఠశాల విద్యలో విలీనంచేయడంతో ప్రస్తుతం వున్న హైస్కూల్ ప్లస్‌లలో కొన్నిం టిని ప్రభుత్వ జూనియర్ కళాశాలలుగా ఇప్పుడున్నచోటే ఏర్పాటుచేసే అవకాశం ఉంది. సంస్కరణల వల్ల ఈ ఏడాది నుంచి ప్రైవేటు కళాశాలలతో ప్రభుత్వ జూని యర్ కళాశాలల విద్యార్థులు ధీటైన పోటీని వ్వడం ఖాయం.
–బి.ప్రభాకరరావు, డీవీఈవో, ఏలూరు జిల్లా