YS Vivekananda Reddy murder: వైసీపీ నుంచి ప్రాణహాని
ABN , Publish Date - Mar 30 , 2025 | 03:51 AM
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ-2గా ఉన్న సునీల్ యాదవ్ తన ప్రాణాలకు ముప్పు ఉందని, వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ‘హత్య’ సినిమాలో తనను, తన తల్లిని లక్ష్యంగా చేసుకున్నారని, అసలు నిందితుల పేర్లు ఎందుకు చూపించలేదో త్వరలోనే వెలుగు చూస్తుందని అన్నారు.

హత్య సినిమా ఎవరు తీశారో.. తీయించారో త్వరలో పోలీసుల విచారణలో వెలుగులోకి
నలుగురి పేర్లే ఈ సినిమాలో పేర్కొన్నారు
అవినాశ్, భాస్కర్‌రెడ్డి, ఉదయకుమార్, శంకర్‌రెడ్డి లేరా?
రాచమల్లు కేసుల కోసం ఓ నేత కాళ్లు పట్టుకున్నాడు
వివేకా కేసులో ఏ-2 సునీల్ యాదవ్ వ్యాఖ్యలు
పులివెందుల, మార్చి 29(ఆంధ్రజ్యోతి): వైసీపీ నాయకుల నుంచి తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, తనపై తీవ్రస్థాయిలో దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ-2గా ఉన్న సునీల్ యాదవ్ అన్నారు. శనివారం పులివెందులలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘హత్య సినిమా ద్వారా నన్ను, నా తల్లిని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వివేకా హత్యకేసులో 8 మందిపై చార్జిషీట్ ఉంటే ఈ సినిమాలో నలుగురి పేర్లే చూపించారు. మిగిలిన నలుగురి పేర్లు ఎందుకు బయట పెట్టలేదు. ‘హత్య’ సినిమా ఎవరు తీశారో, తీయించారో త్వరలో వెలుగులోకి వస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. హత్య సినిమా తీసింది ‘చార్జిషీట్’ ప్రకారమేనని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ‘‘హత్య సినిమాలో నన్ను, నా తల్లిని ఇబ్బంది పెట్టేలా చిత్రీకరించారు. దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేయడమే నేను చేసిన తప్పా? సినిమాలో కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఉదయకుమార్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి పేర్లు ఎందుకు చూపించలేదో అందరికీ త్వరలోనే అర్థమవుతుంది.
నా దగ్గర రూ.కోట్లకు కోట్లు ఉన్నాయని మాట్లాడుతున్నారు. ఆ కోట్లకు కోట్లు మీరే తీసుకుని నాకో ఇల్లు, అవసరాలకు కొంత డబ్బు ఇస్తే చాలు’’ అని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి హైదరాబాదులో ఓ బీసీ నాయకుడి కాళ్లు పట్టుకుని తనపై ఉన్న కేసులు, దందాలు బయటికి రాకుండా చూడాలని బతిమలాడింది అందరికీ తెలుసునన్నారు. ‘‘వైసీపీకి వివేకానందరెడ్డి వీర విధేయుడుగా ఉన్నారని మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు. కానీ, హత్య జరిగినప్పటి నుంచి లేనిపోని అభాండాలు వేసి ఆయన ఇమేజ్‌ను దిగజారుస్తూ వచ్చారు. రాచమల్లు రెండుసార్లు ప్రెస్‌మీట్ పెట్టి.. సునీల్ యాదవ్ ఫిర్యాదు ఇచ్చీ ఇయ్యగానే ఆగమేఘాల మీద కేసు నమోదు చేయాల్సిన అవసరం ఏముందని పులివెందుల లాయరు ఓబుల్‌రెడ్డి అన్నారని చెప్పారు. కానీ, నా నుంచి 161 స్టేట్‌మెంటు రికార్డు చేసినప్పుడు మీరు దాన్ని ఎందుకు తప్పుబట్టలేదో చెప్పాలి’’ అని ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu: ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం..
Minister Ramanaidu: ఏపీని ధ్వంసం చేశారు.. జగన్‌పై మంత్రి రామానాయుడు ఫైర్
Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. కొత్త తరహా మోసం
For More AP News and Telugu News