Mohan Guruswamy: భూతాపం పెరిగే కొద్దీ ఆహార ఉత్పత్తి తగ్గుతోంది
ABN , Publish Date - Apr 06 , 2025 | 04:51 AM
భూతాపం కారణంగా ఆహార ఉత్పత్తి తగ్గడంతో పాటు జీవ వైవిధ్యంలో మార్పులు, విపత్తులకు దారి తీసే అవకాశముందని ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు మోహన్ గురుస్వామి ఆందోళన వ్యక్తం చేశారు.

విత్తనాభివృద్ధికి సర్కార్ చర్యలు తీసుకోవాలి
విత్తనాల పండుగలో మోహన్ గురుస్వామి
కడ్తాల్, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): భూతాపం కారణంగా ఆహార ఉత్పత్తి తగ్గడంతో పాటు జీవ వైవిధ్యంలో మార్పులు, విపత్తులకు దారి తీసే అవకాశముందని ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు మోహన్ గురుస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. ఒక డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత పెరిగినట్లయితే 15 నుంచి 20ు మేర ఆహార ఉత్పత్తి తగ్గుతుందన్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అన్మా్‌సపల్లి సమీపంలోని ది ఎర్త్ సెంటర్‌లో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ (సీజీఆర్), భారత్ బీజ్ స్వరాజ్‌మంచ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ తొలి విత్తనాల పండుగలో శనివారం ఆయన పాల్గొని ప్రసంగించారు.
గడిచిన ఐదు దశాబ్దాల్లో వ్యవసాయంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. గతంలో ఉన్న 1.20 లక్షల వరి వంగడాల స్థానంలో కేవలం 3 వేల రకాల విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని చెప్పారు. విత్తనాభివృద్ధి కోసం సరైన కృషి జరగడం లేదని, విత్తన పరిశోధనకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.