Legislative Council: మండలిలో వైసీపీ రచ్చ!
ABN , Publish Date - Mar 13 , 2025 | 03:54 AM
శాసన మండలిలో వైసీపీ సభ్యులు రభస సృష్టించారు. పోడియంపైకి ఎక్కి.. చైర్మన్ చుట్టూ చేరి అరుపులు, నినాదాలతో గందరగోళం సృష్టించారు. తమ తమ స్థానాల్లోకి వెళ్లి నిరసన తెలుపాలని చైర్మన్ సూచించినా వినిపించుకోలేదు.

పోడియంపైకి ఎక్కి.. చైర్మన్ చుట్టూ మోహరింపు
వాయిదా తీర్మానాన్ని తిరస్కరించినా ఫీజులు, నిరుద్యోగ భృతిపై చర్చకు పట్టు
విపక్ష ఎమ్మెల్సీల నినాదాలు, అరుపులతో గందరగోళం
3 సార్లు వాయిదా వేసినా అదే పరిస్థితి.. మార్షల్స్‌ను రప్పించిన చైర్మన్
ఇది దుష్ట సంప్రదాయమన్న బొత్స.. తిప్పికొట్టిన మంత్రి పయ్యావుల
ఆయనకు జ్ఞాపక శక్తి పోయిందేమోనని ఎద్దేవా
అమరావతి, మార్చి 12(ఆంధ్రజ్యోతి): శాసన మండలిలో వైసీపీ సభ్యులు రభస సృష్టించారు. పోడియంపైకి ఎక్కి.. చైర్మన్ చుట్టూ చేరి అరుపులు, నినాదాలతో గందరగోళం సృష్టించారు. తమ తమ స్థానాల్లోకి వెళ్లి నిరసన తెలుపాలని చైర్మన్ సూచించినా వినిపించుకోలేదు. దీంతో ఆయన మార్షల్స్‌ను సభలోకి పిలవాల్సి వచ్చింది. నిరసనలు, నినాదాల నడుమే సభను కొనసాగించారు. దీంతో వైసీపీ ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారు. బుధవారం ఉదయం 10 గంటలకు మండలి సమావేశాలు ప్రారంభం కాగానే.. వైసీపీ ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్‌కుమార్, రమేశ్ యాదవ్, తోమాటి మాధవరావు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించినట్లు చైర్మన్ మోషేన్‌రాజు ప్రకటించారు. ఆ వెంటనే ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అయితే నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశాలపై ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్సీలు ప్లకార్డులను ప్రదర్శిస్తూ.. ‘వియ్ వాంట్ జస్టిస్..’, ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ..’ అంటూ నినాదాలు సాగించారు. గందరగోళ పరిస్థితుల నడుమే చైర్మన్ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. ఈ సందర్భంగా విద్యామంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. ‘ఈరోజు మండలి సమావేశాల్లో లఘు చర్చ ఉంది. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగాలు, ఉపాధి కల్పనపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వం పెట్టిన రూ.4,500 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను మేం చెల్లిస్తున్నాం. దీంతో ’ఫీజు పోరు’ అనే పేరుతో ఆందోళన తలపెట్టిన వైసీపీ.. తర్వాత ‘యువత పోరు’ అని మార్చుకోవడంతో జనం నవ్వుకుంటున్నారు. వైసీపీ ఎమ్మెల్సీలు సభలో దేనికోసం పోరాడుతున్నారో క్లారిటీ ఉంటే బాగుంటుంది’ అని అన్నారు. చైర్మన్ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వైసీపీ సభ్యులు వినిపించుకోకుండా నినాదాలు కొనసాగిస్తూ కార్యకలాపాలను అడ్డుకోవడంతో 10.15కి సభను వాయిదా వేశారు.
దాదాపు 20 నిమిషాల తర్వాత తిరిగి ప్రారంభం కాగానే.. బొత్స తప్ప మిగిలిన వైసీపీ ఎమ్మెల్సీలందరూ పోడియం వద్దకు వెళ్లారు. బిగ్గరగా నినాదాలు చేస్తూ.. పోడియంను చేతులతో గట్టిగా కొడుతూ పెద్దపెద్దగా శబ్దాలు చేయడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో 10.44కి రెండోసారి సభ వాయిదాపడింది. గంట తర్వాత 11.40కి మళ్లీ మొదలైంది. వైసీపీ ఎమ్మెల్సీలు తిరిగి నిరసన ప్రారంభించారు. వారిలో కొందరు పోడియంపైకి వెళ్లి చైర్మన్‌ను చుట్టుముట్టి బిగ్గరగా అరుస్తూ.. కేకలు వేస్తూ నానా రభస చేశారు. వారి తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాసేపటికే 11.47కి మూడోసారి సభను వాయిదా వేశారు. అనంతరం సుమారు 30 మంది మార్షల్స్ మండలి సమావేశ హాలులోకి వచ్చారు. పోడియంపైకి ఎవరూ వెళ్లకుండా ముందు రక్షణ గోడలా నిలబడ్డారు. 20 నిమిషాల తర్వాత సభ కార్యకలాపాలు తిరిగి మొదలయ్యాయి. యథావిధిగా వైసీపీ ఎమ్మెల్సీలు అరుపులతో పోడియం వద్దకు రావడంతో అప్పటికే సిద్ధంగా ఉన్న మార్షల్స్ వారిని నిలువరించారు. వైసీపీ ఎమ్మెల్సీలు వారిని తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. సభలోకి మార్షల్స్‌ను రప్పించడంపై బొత్స తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఇది దుష్ట సంప్రదాయం. ఇంతమంది మార్షల్స్‌ను పెట్టి ఈ రకంగా సభను నడపడం ఎప్పుడూ చూడలేదు.
మేమేమైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నామా? చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నామా? మార్షల్స్‌ను బయటకు పంపించాలి’ అని డిమాండ్ చేశారు. చైర్మన్ సమాధానమిస్తూ.. ‘సభలో సభ్యులకు నిరసన తెలిపే హక్కుంది. అయితే మీకు కేటాయించిన స్థానాల్లో ఉండి ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపితే ఈ పరిస్థితి రాదు. ప్రతిపక్ష నాయకుడిగా మీరు చెప్పింది పరిగణనలోకి తీసుకుంటాం. మీకు గౌరవంగా కేటాయించిన స్థానాలున్నాయి. అక్కడి నుంచి కూర్చునో, లేదంటే నిలబడో నిరసన తెలిపితే అభ్యంతరం లేదు. అలాకాకుండా పోడియంపైకి వచ్చి నిరసన తెలుపుతామంటే మాత్రం అనుమతించేది లేదు. సభలో నుంచి మార్షల్స్‌ను పంపించేస్తాం. కచ్చితంగా మాకు సభను నడిపించుకోవలసిన అవసరం ఉంది. మాకుండే పద్ధతుల్లో మేం నడిపించుకుంటాం’ అని స్పష్టం చేశారు. బొత్స స్పందిస్తూ.. ‘ఈ దుష్ట చర్యలతోనే సభను నడిపిస్తామంటే కానివ్వండి చూద్దాం.. ప్రజలే తేలుస్తారు’ అని అన్నారు. వైసీపీ సభ్యుల నిరసనల నడుమే చైర్మన్ సభను కొనసాగించారు. కొంతసేపటి తర్వాత బొత్స మళ్లీ మాట్లాడుతూ.. నియంతృత్వ ధోరణికి నిరసన తెలుపుతూ సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని చెప్పి బయటకు వెళ్లిపోయారు. మిగిలిన వైసీపీ ఎమ్మెల్సీలూ ఆయన్ను అనుసరించారు. ఆ తర్వాత సభ కార్యకలాపాలు సజావుగా సాగాయి.
పయ్యావుల-బొత్స మాటకు మాట
నిరసనల నడుమ మండలిలో ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్, విపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య ఆసక్తికరమైన సంవాదం జరిగింది.
పయ్యావుల: సభలో ఎప్పుడూ మార్షల్స్‌ను చూడలేదని బొత్స అంటున్నారు. ఆయనకు షార్ట్ టర్మ్ మెమొరీ లాస్ ఏమైనా వచ్చిందేమో! గత వైసీపీ ప్రభుత్వంలో మార్షల్స్‌ను ఎలా ఉపయోగించారనేది ఎలా మరచిపోయారో అర్థం కావడం లేదు. ఆయన ఒకసారి మెమొరీని రిఫ్రెష్ చేసుకుంటే బెటర్. పెద్దల సభ చైర్మన్‌గా మిమ్మల్ని (మోషేన్‌రాజు) ఎంత చికాకు పెట్టినా.. ఇబ్బంది పెట్టినా సభ్యులను ఒక్క మాట కూడా అనకుండా సభను గౌరవంగా నడిపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆ గౌరవాన్ని వాళ్లు కాపాడుకోలేనప్పుడు మీ నిర్ణయం సరైందే.
బొత్స: ‘గత ప్రభుత్వంలో ఈ సభలో పయ్యావుల కేశవ్ లేరు. మిగిలిన టీడీపీ సభ్యుల ప్రవర్తన, వాడిన భాష ఏవిధంగా ఉందో.. ఇప్పుడు మా భాష, ప్రవర్తన ఏ విధంగా ఉన్నాయో బేరీజు వేసుకుంటే తెలుస్తుంది
పయ్యావుల: వీళ్లు మంత్రులుగా ఉండి ఆనాటి సభాపతి మీద ఏం చేశారో గుర్తు తెచ్చుకుంటే మంచిది. ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స.. నాటి సభాపతిపై ఏ రకమైన భాష ఉపయోగించారు? ఆయన ఇప్పటికైనా పశ్చాత్తాపాన్ని సభలో ప్రకటిస్తారా.. లేదా?
9 నెలలైనా డీఎస్సీ ఏదీ: బొత్స
వాకౌట్ చేసిన అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. యువత, విద్యార్ధులు, నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి 9నెలలు దాటినా డీఎస్సీ నిర్వహించలేదన్నారు. ఫీజు బకాయిలన్నీ జగన్ విడుదల చేసేశారని.. బకాయిలు ఎక్కడున్నాయో దమ్ముంటే చూపించాలన్నారు. ఏటా 4లక్షల ఉద్యోగాలన్న సీఎం.. జాబ్ కేలెండర్ ఎప్పుడిస్తారో చెప్పడం లేదని.. నిరుద్యోగ భృతిపై స్పష్టత లేదని.. గ్రూపు-2 అభ్యర్థులను మోసం చేశారని.. ఇది అసమర్థ ప్రభుత్వమని తేలిపోయిందని ధ్వజమెత్తారు.