మాయమవుతున్న హంద్రీ..!
ABN , Publish Date - Apr 05 , 2025 | 12:14 AM
హంద్రీ కర్నూలు నగరం మధ్యలో 7.40 కిలోమీటర్లు ప్రవహిస్తుంది.

దర్జాగా కుడి, ఎడమ గట్ల ఆక్రమణ
338 ఆక్రమణల గుర్తింపు
ఆక్రమణదారుల్లో ఓ బడా రియల్టర్
పూర్తి వివరాలతో నివేదిక పంపిన జలవనరుల శాఖ ఇంజనీర్లు
నది సరిహద్దు సర్వేలో వెలుగు చూసిన వాస్తవాలు
హంద్రీ కర్నూలు నగరం మధ్యలో 7.40 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. స్థిరాస్తుల విలువ భారీగా పెరగడంతో నది కుడి, ఎడమ గట్లు ఆక్రమణకు గురవుతున్నాయి. ఇష్టారాజ్యంగా నది ఒడ్డును చదును చేసి ఇళ్లు కట్టేస్తున్నారు. హంద్రీ ఆక్రమణలపై ఆంధ్రజ్యోతి పలు కథనాలు ప్రచురించింది. జలవనరుల శాఖ ఎఫ్‌ఆర్‌ఎల్ డివిజన్ ఇంజనీర్లు ఎట్టకేలకు స్పందించారు. జాయింట్ కలెక్టర్ నవ్య దృష్టికి తీసుకెళ్లారు. రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ ఇంజనీర్లు సంయుక్తంగా హంద్రీ సరిహద్దు గుర్తింపు సర్వే నిర్వహించారు. నదీ తీరం వెంబడి 338 ఆక్రమణలు గుర్తించారు. ఆక్రమణదారుల్లో నగరంలో పేరుమోసిన బడా రియల్టర్ ఒకరు ఉన్నారు. నది సరిహద్దుల్లో పిల్లర్లు నాటుతున్నారు. అఽధికారులు ఈ అక్రమణలు తొలగిస్తారా..? రాజకీయ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి వదిలేస్తారా..? వేచి చూడాలి.
కర్నూలు, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర తరువాత జిల్లాలో ప్రవహించే అతిపెద్ద నది హంద్రీ. పత్తికొండ మండలం పందికోన కొండల్లో ఒక పాయగా, చిన్నహుల్తి ఎగువన మరో పాయ (వంక)గా ప్రవహించి, దేవనకొండ మండలం అలారుదిన్నె సమీపంలో హంద్రీ నదిగా రూపాంతరం చెందుతుంది. దేవనకొండ, ఆస్పరి, గోనెగండ్ల, కోడుమూరు, కల్లూరు మండలాల్లో ప్రవహించి, కర్నూలు నగర శివారు జొహరాపురం బిడ్జి దిగువన తుంగభద్రలో కలుస్తుంది. నగరం మధ్యలో 5.40 కి.మీలు ప్రవహించే హంద్రీ వివిధ ప్రాంతాలలో 200 నుంచి 300 మీటర్ల వెడల్పు ఉండాలి. గరిష్ఠ వరద ప్రవాహం అంచుల (మ్యాగ్జిమమ్ ఫ్లడ్ లెవల్-ఎంఎఫ్‌ఎల్) నుంచి 50 మీటర్లు (150 అడుగులు) వరకు బఫర్ జోన్ ఉంటుందని జలవనరుల శాఖ ఎఫ్‌ఆర్‌ఎల్ డివిజన్ ఇంజనీర్లు తెలిపారు. కోడుమూరు మండలంలో మొదలైన వక్కేరు వాగు ప్యాలకుర్తి, పెంచికలపాడు, నెరవాడ, సలకాపురం, పెద్దపాడు మీదుగా ప్రవహిస్తూ కల్లూరు వద్ద హంద్రీలో కలుస్తుంది. నగరం పరిధిలో వక్కేరు వాగుగడ్డ వెడల్పు (బఫర్ జోన్) 30-50 అడుగుల వరకు ఉంటుందని ఇంజనీర్లు తెలిపారు. నగరంలో స్థిరాస్తుల విలువ భారీగా పెరగడం, నగరం మధ్యలో ఉండడంతో అక్రమార్కులు నది ఒడ్డు ప్రభుత్వ భూములపై కన్నేశారు. రాజకీయ నాయకుల అండతో దర్జాగా ఆక్రమించేశారు. కొందరైతే ఏకంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది.
338 ఆక్రమణలు గుర్తింపు
హంద్రీ నది కుడి, ఎడమ గట్లు ఎక్కడి క్కడే ఆక్రమణలకు గురయ్యాయి. 1997లో ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో రెండుసార్లు లక్ష క్యూసెక్కులకు పైగా వరద రావడంతో నదీ తీర కాలనీలు ముంపుకు గురయ్యాయి. 2007లో మరోసారి వరద వచ్చి కాలనీలను ముంచేసింది. 2009లో ఊహించని వరదతో జనం భారీ నష్టాన్ని చవి చూశారు. వరద ముప్పు నుంచి ప్రజలను రక్షించాలనే లక్ష్యంగా ఫ్లడ్ వాల్ నిర్మాణాలకు రూ.150 కోట్లు మంజూరు చేశారు. పనులు మొదలు పట్టేందుకు వెళ్లిన ఇంజనీర్లకు ఆక్రమ ణలు అడ్డుగా నిలిచాయి. ప్రజా ప్రతినిధులు, రాజకీయ బడా నాయకులు సైతం ఆక్రమణదారులకే వత్తాసు పలికారు. ఫలితంగా పనులు మొదలు కాలేదు. నిధులు వెనక్కి వెళ్లాయి. అయితే.. నదీ ఆక్రమణలపై పలు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఆంధ్రజ్యోతి పలు కథనాలు ద్వారా వెలుగులోకి తెచ్చింది. ఇరిగేషన్ ఎఫ్‌ఆర్‌ఎల్ డివిజన్ ఈఈ నారాయణరెడ్డి, డీఈఈ రామకృష్ణారెడ్డి జిల్లా అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. జాయింట్ కలెక్టర్ నవ్య ఆదేశాలతో రెవిన్యూ, సర్వే, ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేస్తే విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూశాయి. కుడిగట్టు (రైట్ బ్యాంక్) వెంబడి 164, ఎడమ గట్టు (లెఫ్ట్ బ్యాంక్) వెంబడి 174 ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించారు. కబ్జా స్థలాల్లో మెజార్టీగా ఆర్‌సీసీ భవనాలు నిర్మించారు.
రాష్ట్రంలోనే తొలిసారిగా నది సరిహద్దు పిల్లర్లు
జలవనరుల శాఖ పరిధిలోని కాలువలు సర్వే చేసి సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఓ నదిని సర్వే చేసిన సరిహద్దులు గుర్తించి పిల్లర్లు ఏర్పాటు చేయడం రాష్ట్ర చరిత్రలోనే ప్రథమమని అధికారులు అంటున్నారు. దాదాపు రూ.16 లక్షల ఖర్చుతో పది అడుగులు ఎత్తు, నాలుగు వైపులు అడుగు మందంతో బలమైన స్టీల్ వినియోగించి సిమెంట్ పిల్లర్లు తయారు చేయించారు. రెవెన్యూ, సర్వే, ఇరిగేషన్ అధికారులు సర్వే చేసి సరిహద్దు గుర్తిస్తున్నారు. భూమిలో ఐదు అడుగుల లోతులో సిమెంట్ పిల్లర్లు పాతుతున్నారు. పిల్లరు మధ్యలో ఉన్నది నది పోరంబోకు ప్రభుత్వ భూమి. ఆ పిల్లరు నుంచి 150 అడుగుల వరకు బఫర్ జోన్ ఉంటుంది. అక్కడి వరకు ఎలాంటి భవనాలు నిర్మించరాదని అధికారులు పేర్కొంటున్నారు.
విస్తుగొలిపే వాస్తవాలు
హంద్రీ కుడి గట్టు (రైట్ బ్యాంక్) వైపు 164 ఆక్రమణులు ఉన్నట్లు గుర్తించారు. అందులో బడా రియల్టర్ ఒకరు సర్వే నంబరు 424/ఏ, 470/బి పరిధిలో 15 ప్లాట్లు వేసి పక్కా భవనాలు నిర్మించారని గుర్తించారు. సర్వే నంబరు.470/బిలో 25 ప్లాట్లలో బెస్‌మట్టం వరకు నిర్మాణాలు చేపట్టారని, ఇవన్ని ఆక్రమిత స్థలం, బఫర్ జోన్‌లో ఉన్నాయని గుర్తించి నివేదిక పంపించారు. సర్వే నంబరు.740/బి, 498/ఎ, 533, 24 పరిధిలో పలువు 1.25 సెంట్లలో పక్కా భవనాలు, రేకుల షెడ్లు ఏర్పాటు చేసుకున్నారు. వీరిలో కొందరికి రెవెన్యూ అధికారులు డి.పట్టా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఓ వెంచర్ యజమాని 40 సెంట్లు హంద్రీ నది ప్రభుత్వ ఆక్రమించినట్లు కూడా గుర్తించారు.
యడమ గట్టు (లెఫ్ట్ బ్యాంక్) వైపు 174 ఆక్రమణలు గుర్తించారు. మెజార్టీగా ఆర్‌సీసీ భవనాలు నిర్మించుకున్నారు. సర్వే నంబరు.770/ఎఫ్ పరిధిలో ఓ ఫైనాన్స్ సంస్థ భవనం కొంతభాగం హంద్రీ నది ఒడ్డున ఉన్నట్లు గుర్తించారు.
సర్వే నంబర్లు వారిగా గుర్తించిన హంద్రీనది కుడి, ఎడమ వైపు ఆక్రమణలు
సర్వే నంబరు కుడి వైపు ఎడమ వైపు
770/ఎఫ్ -- 1
422/ఎ -- --
424/ఏ 2 4
470/బి 145 33
498/ఎ 8 24
533 8 110
24 1 2
మొత్తం 164 174
హంద్రీ ఆక్రమణలు అరికట్టేందుకు సరిహద్దు పిల్లర్ల ఏర్పాటు
హంద్రీ నది కర్నూలు నగరం మధ్యలో 7.40 కి.మీ ప్రవహిస్తుంది. కుడి, ఎడమ గట్ల వైపు ఆక్రమణులు ఉన్నమాట నిజమే. రెవిన్యూ, సర్వే అధికారులతో కలసి నది సరిహద్దులు గుర్తించి పిల్లర్లు (ఆర్‌సీసీ దిమ్మెలు) నాటుతున్నాం. హంద్రీ నదిని ఆక్రమణల నుంచి కాపాడేందుకు జిల్లా అధికారుల ఆదేశాలతో ఈ చర్యలు తీసుకున్నాం. నది రెండు వైపుల 334 ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించాం. పూర్తి వివరాలతో ఉన్నతాధికారులకు నివేదించాం. పైఅధికారుల ఆదేశాల మేరకు ఆక్రమణలు తొలగించే చర్యలు కూడా తీసుకుంటాం.
- బి. రామకృష్ణ, డీఈఈ, ఇరిగేషన్ ఎఫ్‌ఆర్‌ఎల్ డివిజన్, కర్నూలు