Share News

ఈఎంఐ చెల్లించలేదా..?

ABN , Publish Date - Mar 23 , 2025 | 03:38 AM

ఈఎంఐ చెల్లింపు 30 రోజుల పాటు జాప్యమైతే మీ క్రెడిట్‌ స్కోర్‌ 90 100 పాయింట్ల మేర ఒక్కోసారి అంతకుపైగా తగ్గే ప్రమాదం ఉంది అంతేకాదు ఆ జాప్య లావాదేవీ మీ క్రెడిట్‌ హిస్టరీలో ఓ మరకగా మిగిలిపోతుంది ఒక్క తప్పు భవిష్యత్‌లో...

ఈఎంఐ చెల్లించలేదా..?

మీ క్రెడిట్‌ స్కోర్‌ ఢమాల్‌!

అప్పును అర్ధవంతంగా వినియోగించుకోవడంతోపాటు నిర్దేశిత గడువులోగా తిరిగి చెల్లించడమూ ముఖ్యమే. రుణగ్రహీతలు నెలవారీ వాయిదాల (ఈఎంఐ) ను క్రమం తప్పకుండా చెల్లించాలి. ఈఎంఐ చెల్లింపు జాప్యమైనా, విఫలమైనా మీ క్రెడిట్‌ స్కోర్‌కు గండి పడుతుంది. భవిష్యత్‌లో మళ్లీ అప్పు పుట్టడం కష్టమవుతుంది. ఎందుకంటే, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఎవరికైనా రుణం ఇచ్చే ముందు ఆ వ్యక్తి పరపతి స్థాయిని క్రెడిట్‌ స్కోర్‌, క్రెడిట్‌ హిస్టరీ ఆధారంగానే మదిస్తాయి. తర్వాతే ఆ వ్యక్తికి రుణం ఇవ్వాలా..? వద్దా..? అని నిర్ణయం తీసుకుంటాయి. అంతేకాదు, రుణంపై ఎంత వడ్డీ వసూలు చేయాలనేదీ మీ క్రెడిట్‌ స్కోర్‌పైనే ఆధారపడి ఉంటుంది.


క్రెడిట్‌ స్కోర్‌పై ప్రభావమెంత?

ఈఎంఐ చెల్లింపు 30 రోజుల పాటు జాప్యమైతే మీ క్రెడిట్‌ స్కోర్‌ 90-100 పాయింట్ల మేర, ఒక్కోసారి అంతకుపైగా తగ్గే ప్రమాదం ఉంది. అంతేకాదు, ఆ జాప్య లావాదేవీ మీ క్రెడిట్‌ హిస్టరీలో ఓ మరకగా మిగిలిపోతుంది. ఒక్క తప్పు భవిష్యత్‌లో మళ్లీ మీకు రుణం లభించడాన్ని దుర్లభంగా మార్చవచ్చు. అలాగే, ఈఎంఐ చెల్లింపులో విఫలమైతే, ఆనక ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈఎంఐ చెల్లింపుల్లో తరచుగా విఫలమైతే, రుణదాత ఆలస్య రుసుము విధించడంతో పాటు వడ్డీ రేటును కూడా పెంచే అవకాశాలుంటాయి. ఈఎంఐ చెల్లింపులను పూర్తిగా నిలిపివేస్తే, రుణదాత నుంచి న్యాయపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు తనఖా రుణం తీసుకుంటే, తాకట్టులో ఉన్న ఇళ్లు లేదా వాహనాన్ని రుణదాత జప్తు చేసుకోవచ్చు.


15 రోజులకోసారి స్కోర్‌ అప్‌డేట్‌

ఇంతక్రితం క్రెడిట్‌ బ్యూరో రికార్డులు నెలకోసారి అప్‌డేట్‌ అయ్యేవి. ఈ ఏడాది జనవరి 1 నుంచి రికార్డులను 15 రోజులకోసారి అప్‌డేట్‌ చేయాలని ఆర్‌బీఐ ఆదేశించింది. తద్వారా రుణగ్రహీతల కార్యకలాపాలు, వారి రుణ నిర్వహణ సమాచారం మరింత వేగంగా అప్‌డేట్‌ అవుతూ వస్తోంది. అంటే, మీరు ఈఎంఐ చెల్లించడంలో ఏమాత్రం జాప్యమైనా ఆ సమాచారం మీ క్రెడిట్‌ హిస్టరీలో వెంటనే రికార్డు అవుతుంది. తత్ఫలితంగా మీ స్కోర్‌ కూడా తగ్గుతుంది.

చెల్లింపు జాప్యమైతే ఏం చేయాలి?

ఆకస్మిక ఆర్థిక అత్యయిక పరిస్థితి కారణంగా సమయానికి ఈఎంఐ చెల్లించడం ఒక్కోసారి సాధ్యపడకపోవచ్చు. అలాంటప్పుడు, మీ పరిస్థితి గురించి రుణదాతకు వెంటనే సమాచారం అందించి, సర్దుబాటుకు అదనపు గడువు ఇవ్వాలని కోరడం మేలు. మీరు చెప్పిన కారణం సరైనదని అనిపిస్తే, రుణదాత మీ అభ్యర్థనను మన్నించే అవకాశం ఉంటుంది. తద్వారా, ఆ జాప్య చెల్లింపును మీ క్రెడిట్‌ హిస్టరీలో అప్‌డేట్‌ కాకుండా, స్కోర్‌ తగ్గకుండా నివారించేందుకు అవకాశం ఉంటుంది.


క్రెడిట్‌ స్కోర్‌ను పెంచుకోండిలా..

తగ్గిన క్రెడిట్‌ స్కోర్‌ను పెంచుకోవడానికి సమయం పడుతుంది. ఇందుకు నిలకడ, ఆర్థిక క్రమశిక్షణ ఎంతో అవసరం. భవిష్యత్‌లో ఈఎంఐలు, క్రెడిట్‌ కార్డు బిల్లులను నిర్దిష్ఠ గడువులోగా తూ.చ తప్పక చెల్లించాలి. అంతేకాదు, క్రెడిట్‌ కార్డు పరిమితిలో 30 శాతానికి మించి ఉపయోగించకుండా జాగ్రత్తపడాలి. కార్డు పరిమితిలో 30 శాతానికి మించి వినియోగించుకుంటున్నట్లయితే, సకాలంలోనే బిల్లు చెల్లించినప్పటికీ క్రెడిట్‌ స్కోర్‌ తగ్గుతుంది. ఎందుకంటే, మీరు జీవితంలో రుణాలపైనే అధికంగా ఆధారపడుతున్నారనడానికి అది సంకేతం. సకాలంలో చెల్లింపులతో పాటు మీ క్రెడిట్‌ రిపోర్టును అప్పుడప్పుడూ చెక్‌ చేసుకోండి. రికార్డుల్లో ఏవైనా తప్పులుంటూ సంబంధిత క్రెడిట్‌ బ్యూరోకు వెంటనే ఫిర్యాదు చేయండి. సకాలంలో స్పందించడంతో పాటు ఆర్థిక క్రమశిక్షణతో క్రెడిట్‌ స్కోర్‌ను మళ్లీ మెరుగుపర్చుకోవడం సాధ్యమే.

ఇవి కూడా చదవండి:

Earth Hour 2025: ఈరోజు ఎర్త్ అవర్..ఈ టైంలో కరెంట్ బంద్ చేసి, ప్రకృతికి సహకరిద్దాం..

WhatsApp: దేశంలో కోటి వాట్సాప్ ఖాతాలు తొలగింపు..ఇలా చేస్తే మీ అకౌంట్ కూడా..

NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ

Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..

PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 23 , 2025 | 04:31 AM