High Court: దేవుళ్లు సరిగానే ఉన్నారు... కొందరు మనుషులే తేడా..
ABN , Publish Date - Mar 25 , 2025 | 08:14 AM
హైకోర్టు మదురై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దేవుళ్లంతా సరిగానే ఉన్నారు.. కొందరు మనుషులు మాత్రమే తేడాగా వున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. మదురై జిల్లా తిరుప్పరంగుండ్రం కొండను ‘జైన కొండ’గా ప్రకటించాలని కోరుతూ విల్లుపురం స్వస్తిశ్రీ లక్ష్మీసేన స్వామి తరఫున మదురై ధర్మాసనంలో పిటిషన్ దాఖలైంది.

- తిరుప్పరంగుండ్రం వ్యవహారంలో హైకోర్టు ధర్మాసనం అసంతృప్తి
- ఆ కొండ మాకే సొంతం: కేంద్ర పురావస్తు శాఖ
చెన్నై: దేవుళ్లంతా సరిగానే ఉన్నారు.. కొందరు మనుషులు మాత్రమే తేడాగా వున్నారంటూ హైకోర్టు మదురై ధర్మాసనం కటువుగా వ్యాఖ్యానించింది. మదురై జిల్లా తిరుప్పరంగుండ్రం కొండను ‘జైన కొండ’గా ప్రకటించాలని కోరుతూ విల్లుపురం స్వస్తిశ్రీ లక్ష్మీసేన స్వామి తరఫున మదురై ధర్మాసనంలో పిటిషన్ దాఖలైంది. తిరుప్పరంగుండ్రం కొండ జాతీయ ప్రాముఖ్యత కలిగిన పర్వతమని, ఈ కొండ జైనుల కొండ అని, అందువల్ల తిరుప్పరంగుండ్రం కొండను జైన కొండగా ప్రకటించాలని పిటిషన్‌లో అభ్యర్థించారు.
ఈ వార్తను కూడా చదవండి: Tollgates: వాహనదారులకు పిడుగులాంటి వార్త.. 1 నుంచి టోల్ బాదుడు..
అంతేగాక జైన ధర్మాలకు విరుద్ధంగా కొండపై జరిగే కార్యకలాపాలు నిషేధించాలని, తిరుప్పరంగుండ్రం కొండను పునరుద్ధరించి కాపాడేలా ఉత్తర్వులివ్వాలని కోరారు. అలాగే, తిరుప్పరంగుండ్రం కొండ మీద సికిందర్ బాషా దర్గా నిర్వాహకులు జంతు లను బలివ్వడం, మాంసాహారం వండడం, వడ్డించడంపై నిషేధం విధించాలని మదురై చోళై అళగుపురానికి చెందిన చోలైకన్నన్, తిరుప్పరంగుండ్రం కొండపై నెల్లితోపు ప్రాంతంలో ఇస్లామీయులు ప్రార్థనలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించడంపై నిషేధం విధించాలంటూ రామలింగం అనే వ్యక్తులు కూడా వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు వేశారు.
ఈ పిటిషన్లను సోమవారం న్యాయమూర్తులు జస్టిస్ జె.నిషాభాను, జస్టిస్ ఎస్.శ్రీమతితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా మదురై జిల్లా కలెక్టర్, మదురై నగర పోలీస్ కమిషనర్ తరఫున కౌంటర్ అఫిడవిట్లు దాఖలయ్యాయి. తిరుప్పరంగుండ్రం కొండ చుట్టూ అరుళ్‌మిగు 18వ మెట్టు కరుప్పస్వామి, పాండి మునీశ్వరస్వామి ఆలయం, మలైయాండి కరుప్పుస్వామి ఆలయం, మునియప్పన్ ఆలయాల్లో జంతు బలులివ్వడం ఆచారంగా ఉందని అఫిడవిట్లలో వివరించారు. తిరుప్పరంగుండ్రం కొండ ఉత్తరం వైపున మురుగన్ ఆలయం, దక్షిణం వైపున జైన చిహ్నాలు, మధ్యలో దర్గా ఉన్నాయన్నారు.
ఈ ప్రాంతాన్ని హిందువులు ‘స్కందమలై’ అని, ముస్లింలు ‘సికిందర్ హిల్’ అని, జైనులు ‘జైన హిల్’ అని, స్థానిక ప్రజలు ‘తిరుప్పరంగుండ్రం కొండ’ అని పిలుస్తుంటారన్నారు. అన్ని మతాల మధ్య ఐక్యత నెలకొనాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. ఆ ప్రకారం జనవరి 30వ తేది ఇరు మతాల మధ్య శాంతి సమావేశం నిర్వహించామన్నారు. అందులో.. దర్గాకు వచ్చిన వారి కోర్కెలు నెరవేరితే మేకలు, కోళ్లు బలిచ్చి, వండి అందరూ భుజిస్తారని తెలిపారు. తిరుప్పరంగుండ్రం ప్రాంతంలోని ఇరువర్గాలు కూడా ప్రస్తుతం ఉన్న పూజా విధానాలనే కొనసాగించాలని, బయట వ్యక్తులెవ్వరూ జోక్యం చేసుకోరాదని, ఈ విషయంలో గందరగోళం సృష్టించరాదని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తెలిపారు.
అలాగే, ఇస్లామీయలు మాత్రమే కాకుండా ఇతర వర్గాలు కూడా తమ కోర్కెలు ఫలిస్తే మేకలు, కోళ్లు బలిచ్చి, వండుకొని అందరూ కలసి భోంచేయడం ఆనవాయితీ ఉందన్నారు. అదనంగా 1991లో ప్రవేశపెట్టిన ప్రార్థనా స్థలాల ప్రత్యేక నిబంధనల ప్రకారం, 1947 ఆగస్టు 15 నాటికి ఒకప్రార్థనా స్థలం ఎలా ఉందో, అలాగే దానిని సంరక్షించాలని సుప్రీంకోర్టు తేల్చిచెప్పిందని గుర్తు చేశారు. అనంతరం తిరుప్పరంగుండ్రం కొండ ప్రాంతంలో తలెత్తిన సమస్యకు పరిష్కారం లభించిందని ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది తెలిపారు. తిరుప్పరంగుండ్రం కొండ పురావస్తు శాఖకు సొంతమైనదని, అందువల్ల తిరుప్పరంగుండ్రం కొండపై ఏం చేసినా కేంద్ర పురావస్తు శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి వుందని స్పష్టం చేస్తూ..
పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు కొంత గడువు ఇవ్వాలని కేంద్ర పురావస్తు శాఖ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. పిటిషనర్ల తరఫున తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ఈ విషయంలో 1923లో మదురై ప్రిన్సిపల్ సెషన్స్ ఇచ్చిన ఉత్తర్వులను బ్రిటిష్ కౌన్సిల్ ధ్రువీకరించిందని తెలిపారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. తిరుప్పరంగుండ్రం కొండ అందరికి సొంతమైనదని పేర్కొంది. దేవుళ్లు అందరూ సక్రమంగానే ఉన్నారని... కొందరు మనుషులు మాత్రం సరిగా లేరని పేర్కొంటూ, పురావస్తు శాఖ తరపున అఫిడవిట్ వేసేందుకు సమయం ఇస్తూ, తదుపరి విచారణ ఏప్రిల్ 7వ తేదీకి వాయిదావేసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
టీవీ నటిపై లైంగిక దాడికి యత్నం
పరీక్ష రాయనివ్వకపోతే చావే శరణ్యం
Read Latest Telangana News and National News