బుల్ మార్చ్
ABN , Publish Date - Mar 25 , 2025 | 02:51 AM
భారత స్టాక్ మార్కెట్లో వరుసగా ఆరో రోజూ బుల్ ర్యాలీ కొనసాగింది. సోమవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ మరో 1,078.87 పాయింట్ల వృద్ధితో 77,984.38 వద్ద స్థిరపడింది. ఫిబ్రవరి 6 తర్వాత (6 వారాల) నమోదైన గరిష్ఠ ముగింపు స్థాయి ఇదే...

23,600 ఎగువ స్థాయికి నిఫ్టీ
6 వారాల గరిష్ఠానికి సెన్సెక్స్
ఇంట్రాడేలో 78,000 పైకి..
6 రోజుల్లో రూ.27 లక్షల కోట్ల సంపద వృద్ధి
7 రోజుల్లో 160 పైసలు పెరిగిన రూపాయి విలువ
ముంబై: భారత స్టాక్ మార్కెట్లో వరుసగా ఆరో రోజూ బుల్ ర్యాలీ కొనసాగింది. సోమవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ మరో 1,078.87 పాయింట్ల వృద్ధితో 77,984.38 వద్ద స్థిరపడింది. ఫిబ్రవరి 6 తర్వాత (6 వారాల) నమోదైన గరిష్ఠ ముగింపు స్థాయి ఇదే. ఒక దశలో సూచీ 1,201.72 పాయింట్ల లాభంతో 78,107.23 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. నిఫ్టీ సైతం ఒక దశలో 358.35 పాయింట్లు ఎగబాకి 23,708.75 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసినప్పటికీ, చివరికి 307.95 పాయింట్ల లాభంతో 23,658.35 వద్ద ముగిసింది. అమెరికా, ఐరోపా మార్కెట్ల సానుకూల సంకేతాలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులతోపాటు బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లలో జోరుగా కొనుగోళ్లు మార్కెట్‌ను మరింత ముందుకు నడిపించాయి. రూపాయి పుంజుకోవడమూ ట్రేడింగ్ సెంటిమెంట్‌ను మెరుగుపరిచిందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. గడిచిన ఆరు రోజుల్లో సెన్సెక్స్ 4,155.47 పాయింట్లు (5.62 శాతం), నిఫ్టీ 1,260 పాయింట్లు (5.5 శాతం) పుంజుకోగా.. బీఎ్‌సఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.27.10 లక్షల కోట్లు పెరిగి రూ.418.29 లక్షల కోట్లకు (4.87 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది. ఈ ఒక్క రోజే మార్కెట్ సంపద రూ.5 లక్షల కోట్ల మేర పెరిగింది.
సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్ కంపెనీల్లో 23 రాణించాయి. ఎన్‌టీపీసీ షేరు 4.61 శాతం వృద్ధితో సూచీ టాప్ గెయినర్‌గా నిలిచింది. కోటక్ బ్యాంక్ 4.51 శాతం ఎగబాకింది. ఎస్‌బీఐ, టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్ స్టాక్స్ 3 శాతానికి పైగా పెరిగాయి. మార్కెట్ దిగ్గజాలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ 1.95 శాతం వరకు బలపడ్డాయి. ఇండ్‌సఇండ్ బ్యాంక్, టైటాన్, జొమాటో షేర్లు మాత్రం 2 శాతానికి పైగా క్షీణించాయి.
ప్రధాన కంపెనీలతోపాటు చిన్న, మధ్య స్థాయి షేర్లలోనూ ట్రేడర్లు కొనుగోళ్లు పెంచారు. దాంతో బీఎ్‌సఈ మిడ్‌క్యాప్ సూచీ 1.32 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1.17 శాతం వృద్ధి చెందాయి.
బీఎ్‌సఈలోని రంగాలవారీ సూచీలన్నీ రాణించాయి. బ్యాంకెక్స్, యుటిలిటీస్, పవర్, ఇండస్ట్రియల్స్ ఇండెక్స్‌లు రెండు శాతానికి పైగా పెరిగాయి. బీఎ్‌సఈలో 4,298 కంపెనీల షేర్లు ట్రేడవగా.. 2,458 లాభపడ్డాయి. 1,689 నష్టపోగా.. 151 యథాతథంగా ముగిశాయి. 102 కంపెనీల షేర్లు సరికొత్త ఏడాది గరిష్ఠానికి ఎగబాకాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ రకం ముడిచమురు బ్యారెల్ ధర ఒకదశలో 0.83 శాతం పెరుగుదలతో 72.76 డాలర్ల స్థాయిలో ట్రేడైంది.
ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాముల ధర రూ.700 తగ్గి రూ.90,550కి దిగివచ్చింది. కిలో వెండి మాత్రం రూ.200 పెరుగుదలతో రూ.1,00,500 ధర పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం రేటు ఒకదశలో 0.22 శాతం పెరిగి 3,029 డాలర్ల స్థాయిలో ట్రేడైంది.
37 పైసలు పెరిగిన రూపాయి
ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ ఏకంగా 37 పైసలు పెరిగి రూ.85.61 వద్ద ముగిసింది. ఈక్విటీ మార్కెట్ల ర్యాలీతోపాటు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల కొత్త పెట్టుబడులు ఇందుకు దోహదపడ్డాయి. రూపాయి బలపడటం వరుసగా ఇది ఏడో రోజు. ఈ 7 రోజుల్లో మన కరెన్సీ విలువ 160 పైసలు పెరిగింది.
ఈ ఏడాది నష్టాలు భర్తీ
స్టాక్ మార్కెట్ సూచీలతో పాటు ఫారెక్స్ మార్కెట్లో రూపాయి కూడా ఈ ఏడాది ఏర్పడిన నష్టాల నుంచి పూర్తిగా తేరుకున్నాయి. ఈ ఫిబ్రవరిలో 4,302.47 పాయింట్లు (5.55 శాతం), జనవరిలో 638.44 పాయింట్లు (0.81 శాతం) నష్టపోయిన సెన్సెక్స్.. ఈ నెలలో ఇప్పటివరకు 4,786.28 పాయింట్లు (6.53 శాతం) పుంజుకుంది. గత కొన్ని నెలలుగా భారీగా అమ్మకాలకు పాల్పడుతూ వచ్చిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ).. గడిచిన కొన్ని రోజుల్లో మళ్లీ కొనుగోళ్లు పెంచ డం, పలు కంపెనీల షేర్లు ఆకర్షణీయ ధరలకు లభిస్తుండటంతో మదుపరులు వేల్యూ బైయింగ్‌కు పాల్పడడం, ఈ ఏడాదిలో మరో రెండు సార్లు వడ్డీ రేట్లు తగ్గించనున్నట్లు అమెరికా ఫెడరల్ రిజర్వ్ సంకేతాలివ్వడం, ట్రంప్ సుంకాల అమలు విషయంలో కాస్త మెత్తబడవచ్చన్న ఆశలు, రూపాయి బలోపేతం వంటి అంశా లు ఈక్విటీల ర్యాలీకి దోహదపడ్డాయని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.
మన కరెన్సీ విషయానికొస్తే.. 2024 డిసెంబరు 31న రూ.85.64 వద్ద ముగిసిన డాలర్-రూపాయి మారకం విలువ.. గత నెలాఖరులో ఆల్‌టైం రికార్డు కనిష్ఠ స్థాయి రూ.87.59 స్థాయికి బలహీనపడింది. ఆ తర్వాత కాస్త తేరుకున్న రూపాయి.. గడిచిన వారం రోజుల్లో శరవేగంగా పుంజుకుంది. 160 పైసలు లాభంతో ఎక్స్చేంజ్ రేటు మళ్లీ రూ.85.61 వద్దకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలహీనపడటం, ఈక్విటీ మార్కెట్లో ర్యాలీ, విదేశీ ఇన్వెస్టర్ల కొత్త పెట్టుబడులు, ఆర్థిక సంవత్సరాంతం కావడంతో ఎగుమతిదారులు డాలర్లను విక్రయిస్తుండటం ఇందుకు దోహదపడిందని ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి.
ఇవి కూడా చదవండి...
Anchor Shyamala Investigation: బెట్టింగ్ యాప్స్ కేసు.. పోలీసుల ఎదుట యాంకర్ శ్యామల
Social Media: సోషల్ మీడియాతో జర జాగ్రత్త.. ఎక్స్‌ట్రాలు చేశారంటే లోపలేస్తారు..!
Read Latest Business News And Telugu News