UPI Transactions: ఫోన్‌పే, గూగుల్‌పే చేస్తున్నారా ఈ 12 అంకెల యూటీఆర్ చరిత్ర తెలుసా
ABN , Publish Date - Apr 14 , 2025 | 03:38 PM
UPI Transactions: నోట్ల రద్దు అనంతరం దేశంలో డిజిటల్ లావాదేవీలు ఊపందుకొన్నాయి. ఈ విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ యూపీఐ లావాదేవీల్లో 12 అంకెల సంఖ్య ప్రముఖంగా కనిపిస్తుంది. ఈ 12 అంకెల సంఖ్య వెనుక ఉన్న అర్థం పరమార్థం ఏమిటంటే..

2016లో భారత్‌లో డిజిటల్ చెల్లింపుల విప్లవానికి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ)లు నాంది పలికాయి. ఇవి ప్రతి లావాదేవీకి ఒక ప్రత్యేకమైన 12 అంకెల రిఫరెన్స్ నెంబర్‌ను జనరేట్ చేస్తోంది. దీనిని సాధారణంగా యూనిక్ ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ (యూటీఆర్) నెంబర్ లేకుంటే రిట్రీవల్ రిఫరెన్స్ నెంబర్ (ఆర్ఆర్ఎన్)గా వ్యవహరిస్తారు. ఈ 12 అంకెల నెంబర్ యూపీఐ లావాదేవీల ట్రాకింగ్, భద్రతతోపాటు పారదర్శకతలో కీలకంగా వ్యవహరిస్తోంది. ఈ 2 అంకెల నెంబర్ వల్ల ప్రయోజనం, నిర్మాణంతోపాటు వాటి వెనుక ఉన్న వాస్తవికతను ఒక్క సారి పరిశీలిద్దాం.
ఈ నెంబర్ వల్ల ప్రయోజనం..
యూపీఐ రిఫరెన్స్ నెంబర్ ఒక డిజిటల్ గుర్తింపు సంఖ్యగా పని చేస్తోంది. ఇది ప్రతి లావాదేవీని ప్రత్యేకంగా గుర్తిస్తోంది.
ట్రాకింగ్, గుర్తింపు: రోజుకు కోట్లాది యూపీఐ లావాదేవీలు జరుగుతోంటాయి. ఈ నేపథ్యంలో ఈ 12 అంకెల నంబర్ ఒక నిర్దిష్ట లావాదేవీని ట్రాక్ చేయడానికి సహాయపడుతుంది. ఇంకా సోదాహరణగా చెప్పాలంటే.. మనం చేసిన చెల్లింపు విజయవంతమైందా? లేక విఫలమైందా? అని తెలుసుకోవడానికి ఈ నంబర్ ఉపయోగపడుతుంది.
వివాదాల పరిష్కారం: ఒకవేళ చెల్లింపు చేసిన డబ్బు గ్రహీత ఖాతాలో జమ కాకపోతే లేదా లావాదేవీలో ఏదైనా సమస్య ఉత్పన్నమైతే..ఈ రిఫరెన్స్ నెంబర్ బ్యాంకులు లేదా యూపీఐ యాప్‌ల కస్టమర్ సర్వీస్‌లకు సమస్యను త్వరగా పరిష్కరించడంలో సహాయపడుతుంది.
భద్రత: ఈ నంబర్ లావాదేవీల గుర్తింపును ధృవీకరించడంలో సహాయపడుతుంది. తద్వారా మోసపూరిత లావాదేవీలను గుర్తించడం సులువు అవుతోంది.
పారదర్శకత: ఈ నంబర్ వినియోగదారులకు వారి ఆర్థిక లావాదేవీల గురించి స్పష్టమైన సమాచారాన్ని అందిస్తుంది. ఇది డిజిటల్ చెల్లింపులపై విశ్వాసాన్ని పెంచుతుంది.
12 అంకెలు ఎందుకు?
12 అంకెల రిఫరెన్స్ నంబర్ నిర్మాణం యాదృచ్ఛికంగా రూపొందించ లేదు.ఇది ఎన్‌పీసీఐ టెక్నికల్ ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా రూపొందించారు. ఇది లావాదేవీల గుర్తింపును సమర్థవంతంగా నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. ఈ నంబర్ సాధారణంగా ఈ క్రింది భాగాలను కలిగి ఉంటుంది.
సంవత్సరం, రోజు: నెంబర్‌లోని కొన్ని అంకెలు లావాదేవీ జరిగిన సంవత్సరంతోపాటు రోజును సూచిస్తాయి. ఇంకా సోదాహరణగా చెప్పాలంటే.. 2025లో జరిగిన లావాదేవీలో మొదటి అంకె 5 కావచ్చు. ఇది సంవత్సరాన్ని సూచిస్తుంది.
బ్యాంక్ లేదా సర్వీస్ ప్రొవైడర్ కోడ్: కొన్ని అంకెలు లావాదేవీని ప్రారంభించిన బ్యాంక్ లేదా పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ (పీఎస్‌పీ)ని గుర్తిస్తాయి.
యూనిక్ ట్రాన్సాక్షన్ ఐడెంటిఫైయర్: మిగిలిన అంకెలు ఆ రోజు జరిగిన నిర్దిష్ట లావాదేవీని గుర్తించడానికి ఒక ప్రత్యేకమైన సీక్వెన్స్‌ను కలిగి ఉంటాయి.
ఈ 12 అంకెలు ఒక సమర్థవంతమైన లావాదేవీ గుర్తింపు వ్యవస్థను సృష్టించడానికి రూపొందించబడ్డాయి. ఇది ఒకే రోజులో జరిగే లక్షలాది లావాదేవీలను డూప్లికేషన్ లేకుండా నిర్వహించగలదు. 12 అంకెలు ఎంచుకోవడం వెనుక కారణం.. ఇది సరళంగానే కాక.. స్కేలబుల్‌గా ఉంటుంది. అంటే భవిష్యత్తులో లావాదేవీల సంఖ్య పెరిగినా ఈ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది.
ఇందులో వాస్తవికతలు..నిజాలు
మార్చగల పరిణామం: 2024లో యూపీఐ ద్వారా 15,547 కోట్ల లావాదేవీలు జరిగాయని ఒక నివేదిక స్పష్టం చేసింది. ఇంత పెద్ద సంఖ్యలో లావాదేవీలను నిర్వహించడానికి, 12 అంకెల నంబర్ ఒక సమర్థవంతమైన గుర్తింపు విధానంగా పనిచేస్తుంది.
సరళత: 12 అంకెలు చాలా సంక్లిష్టంగా లేకుండా, అవసరమైన సమాచారాన్ని కలిగి ఉంటాయి. ఇది బ్యాంకులు, వినియోగదారులకు సులభంగా ఉపయోగపడుతుంది.
భద్రతా ప్రమాణాలు: ఈ నంబర్ యూపీఐ యొక్క భద్రతా వ్యవస్థలో ఒక భాగం, ఇది టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్, ఎన్‌క్రిప్షన్‌తో కలిపి లావాదేవీలను సురక్షితంగా ఉంచుతుంది.
గ్లోబల్ అడాప్షన్: యూపీఐ ఇప్పుడు శ్రీలంక,సింగపూర్ వంటి దేశాలలో కూడా అమలులోకి వస్తోంది. ఈ 12 అంకెల రిఫరెన్స్ నంబర్ అంతర్జాతీయ లావాదేవీల ట్రాకింగ్‌లో కూడా సహాయపడుతుంది.
ఎలా ఉపయోగించాలి?
వినియోగదారులు తమ యూపీఐ యాప్ (గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం మొదలైనవి)లో లావాదేవీల హిస్టరీ విభాగంలో ఈ 12 అంకెల రిఫరెన్స్ నంబర్‌ను పరిశీలించవచ్చు. లావాదేవీలో ఏదైనా సమస్య ఉంటే..ఈ నంబర్‌ను బ్యాంక్ లేదా యాప్ కస్టమర్ కేర్‌కు అందించడం ద్వారా సమస్యను త్వరగా పరిష్కరించవచ్చు.
చివరగా..
యూపీఐ లావాదేవీలలో 12 అంకెల రిఫరెన్స్ నంబర్ అనేది ఒక సాంకేతిక, వాస్తవిక ఆవిష్కరణ. ఇది డిజిటల్ చెల్లింపులను సురక్షితంగా,పారదర్శకంగానే కాక సమర్థవంతంగా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది లావాదేవీల ట్రాకింగ్‌ను సులభతరం చేయడమే కాక, వినియోగదారులకు విశ్వాసాన్ని కలిగిస్తుంది. ఈ వ్యవస్థ భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. అంతేకాదు.. దీని వెనుక ఉన్న సాంకేతికత భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.