Share News

అందాల పోటీలు... అంతకు మించి!

ABN , Publish Date - Mar 30 , 2025 | 02:12 AM

అంతర్జాతీయస్థాయిలో, అన్నిదేశాలలో అందాల పోటీలు ప్రస్తుతం ఒక అవిభాజ్య అంశంగా మారిపోయాయి. ఈ పోటీలు కాలక్రమేణా సౌందర్య ప్రదర్శనకు మాత్రమే పరిమితం కాకుండా మనుషులలోని బహుముఖీన ప్రజ్ఞా విశేషాలకు...

అందాల పోటీలు... అంతకు మించి!

అంతర్జాతీయస్థాయిలో, అన్నిదేశాలలో అందాల పోటీలు ప్రస్తుతం ఒక అవిభాజ్య అంశంగా మారిపోయాయి. ఈ పోటీలు కాలక్రమేణా సౌందర్య ప్రదర్శనకు మాత్రమే పరిమితం కాకుండా మనుషులలోని బహుముఖీన ప్రజ్ఞా విశేషాలకు అద్దంపట్టేలా రూపాంతరం చెందడం విశేషం. ప్రస్తుత ప్రపంచంలో సౌందర్యానికి సంబంధించి చెప్పుకోదగినవిగా ‘బిగ్ ఫోర్’ పోటీలను చెబుతారు. అవి మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్, మిస్ ఎర్త్, మిస్ ఇంటర్నేషనల్. మిస్ వరల్డ్ పోటీలు గత 73 సంవత్సరాలుగా అంతర్జాతీయంగా ఎంతో ప్రామాణికతను, ప్రాచుర్యాన్ని, ప్రభావాన్ని సాధించాయి. 1951 జూలై 29న మొట్టమొదటిసారిగా లండన్‌లోని లైసియం థియేటర్‌లో ఇవి జరిగాయి. యునైటెడ్ కింగ్డమ్‌కు చెందిన ఎరిక్ మోర్లీ మనసులో పుట్టిన ఆలోచన ఇది. అందాల పోటీలు అప్పటివరకు కేవలం శారీరక కొలతలు, రంగు, వివిధ వస్త్రాలలో వారి ఆకట్టుకునే సౌష్టవం ఇత్యాది అంశాలకు మాత్రమే పరిమితమై ఉండేవి. కానీ మిస్ వరల్డ్ పోటీలు ‘బ్యూటీ విత్ పర్పస్’ అనే లక్ష్యంతో, ఒక అడుగు ముందుకు వేసి సౌందర్యానికి సామాజిక ప్రయోజనాత్మకతకీ వారధిని నిర్మించాయి.


అలా మొదలైన ‘మిస్ వరల్డ్’ పోటీలు ప్రపంచవ్యాప్తంగా ఏటా ఎంతో సందడిగా, వందకు పైగా దేశాల నుంచి సుందరీమణుల ప్రాతినిధ్యంతో అలరారుతున్నాయి. తెలంగాణ రాజధానినగరం హైదరాబాద్ ఈ 2025 సంవత్సరపు 73వ మిస్ వరల్డ్ పోటీలకు వేదికగా ఎంపికకావడం, మే నెలలో వాటి నిర్వహణ దిశగా సన్నాహాలు జరుగుతూండటం ఆహ్వానించదగిన అంశం. హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకువచ్చే దిశగా, తెలంగాణ రాష్ట్రానికి అంతర్ దేశీయ వైభవం సాధించే దిశగా ఈ వేడుకలు ఒక ముందడుగు. 430 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన హైదరాబాద్ నగరం ‘ముత్యాల నగరం’గా, ‘వజ్రాల నగరం’గా, ‘ప్రేమ నగరం’గా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఈ సౌందర్య పోటీల ఆవిష్కరణతో హైదరాబాద్ నగరం ‘అందాల నగరం’గా కూడా అంతర్జాతీయంగా మరొక గుర్తింపును పొందే అవకాశం ఏర్పడింది. మిస్ వరల్డ్ పోటీలకు భారతదేశానికి అనుబంధం 1966లో మొదటిసారిగా ఏర్పడింది. ఆ ఏట ‘రీటా ఫారియా’ అనే భారతీయవనిత అంతర్జాతీయంగా అందరినీ దాటి ప్రపంచ సుందరిగా ఎంపిక అయ్యింది.


ఈ కిరీటాన్ని గెలుచున్న తొలి ఏషియన్‌ కూడా ఆమె. ఆ తర్వాత దాదాపు 28 ఏళ్ళ పాటు మళ్లీ ఏ భారతీయ సుందరి ఈ కిరీటాన్ని దక్కించుకోలేకపోయింది. భారతదేశంలో 1991 నుంచి నూతన ఆర్థిక సంస్కరణలు, సరళీకరణ ప్రక్రియ ఆరంభంతో శాటిలైట్ ఛానల్స్‌, మీడియా, వినోద పరిశ్రమకు సంబంధించి విప్లవాత్మకమైన మార్పులు సంభవించాయి. ఈ నేపథ్యంలో 1994లో ఐశ్వర్యరాయ్ ప్రపంచ సుందరిగా ఈ కిరీటాన్ని దక్కించుకుని వంద కోట్ల భారతీయుల దృష్టిని ఆకర్షించింది. దానికి కొనసాగింపుగా, 1997లో డయానా హెడెన్, 1999లో యుక్తాముఖి, 2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా, 2017లో మానుషి చిల్లర్ వంటి భారతీయ సుందరీమణులు ఈ కిరీటాన్ని గెలుచుకున్నారు. ఈ పరిణామాల దృష్ట్యా భారతదేశంలో గతంలో ఎన్నడూ లేనిస్థాయిలో కాస్మెటిక్ ఇండస్ట్రీ ఆధారిత ఆర్థికపరమైన అంశాలు ప్రభావితం అయ్యాయి. అందాల పోటీలను నిర్వహించే ఆతిథ్యదేశానికి, ప్రాంతానికి అంతర్జాతీయ స్థాయిలో, దాదాపు 120కి పైగా దేశాలలో ‘బ్రాండింగ్’ రూపొందుతుంది. స్థానిక వ్యాపారం కూడా ఎంతో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది.


చేతివృత్తులు, హస్తకళలు, స్థానిక వంటలు, వస్త్రాలు, కళారూపాలు, సాహిత్యం, సంగీతం, లలిత కళలు వంటి సాంస్కృతిక విశేషాలు ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం లభిస్తుంది. ఈ సౌందర్య పోటీల ప్రారంభ, ముగింపు ఉత్సవాలలో ప్రత్యేకంగా ఆయా దేశాలు లేదా ప్రాంతాలు తమదైన స్థానిక, దేశీయ, మూలవాసుల సంస్కృతులను కళా ప్రదర్శనల ద్వారా చూపించడం వల్ల ఆ ప్రాంత ఔన్నత్యం, అస్తిత్వం, సాంస్కృతిక వైవిధ్యం ప్రపంచమంతా తెలిసే అవకాశం ఉంటుంది. అందాల పోటీలు అంతర్జాతీయంగా ఒక దేశ బ్రాండ్‌ని మార్కెటింగ్ చేయడంలో దోహదపడుతున్నాయి అనేది నిజమైనప్పటికీ, స్త్రీ హక్కుల పరిరక్షణ సంఘాలు, మానవ హక్కుల సంఘాలు, ఇతర పౌర సంఘాలు దీని పట్ల ప్రతి సందర్భంలోనూ వ్యతిరేకతను, నిరసనను వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ఈ అందాల పోటీలు స్త్రీలను విలాస వస్తువుగా, భోగవస్తువుగా, ఆటబొమ్మగా చూసే సంస్కృతిని పెంపొందిస్తున్నాయని వారు విమర్శిస్తున్నారు. అందుకే ప్రతి ఏటా ఈ అందాల పోటీలు జరిగే దేశాలలో, ప్రాంతాలలో మహిళా సంఘాల నిరసన సెగలు సహజంగా పరిణమించాయి. అయితే ఇటీవలి కాలంలో ఈ ధోరణిలో కొత్త ప్రశ్నలు మొదలవడం గమనించదగిన అంశం.


అందాల పోటీలో పాల్గొనే వాళ్ళందరూ వివిధ ప్రొఫెషనల్ రంగాలలో నిష్ణాతులు కావడం, కేవలం ‘స్కిన్ షో’కు పరిమితమైన వారుగా కాకుండా, డాక్టర్లుగా, కార్పొరేట్ మేనేజర్లుగా, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా, వర్థమాన పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతూ, వివిధరంగాలలో ప్రతిభను, ప్రగతిని చూపించిన మహిళలే ఇందులో పాల్గొనడానికి సుముఖత చూపడం గమనార్హం. మరొకవైపున ఈ పోటీలలో సాంస్కృతిక విశిష్టతలను చెప్పే అంశాలు, మేధస్సుని పరీక్ష చేసే అంశాలు, సామాజిక సేవ, మానవీయ కోణాలను పరీక్ష చేసే మరెన్నో అంశాలు అంతర్భాగంగా జోడించడం వల్ల ఒక స్త్రీ మూర్తిమత్వాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించగలిగే పోటీలుగా ఇవి రూపాంతరం చెందాయి. ‘‘మేధస్సుని కలిగినవారు సివిల్ సర్వీసెస్, గ్రూప్స్‌ తదితర పోటీ పరీక్షలలో పాల్గొంటారు. ప్రొఫెషనల్ నైపుణ్యం కలిగినవారు వైద్యులుగా, వ్యాపారవేత్తలుగా, న్యాయవాదులుగా, ఇంజనీర్లుగా తమ ప్రతిభని ప్రదర్శిస్తున్నారు. వీటన్నిటితో పాటు సౌందర్యం కూడా అదనంగా కలిగిన మేము, మా సౌందర్యాన్ని ప్రదర్శించి అందులో మిగతావారికన్నా ఎంతో బాగున్నామని నిరూపించుకోవడంలో తప్పేముంది?’’ అని అందాల పోటీల్లో పాల్గొంటున్న సుందరీమణులు వేస్తున్న ప్రశ్నలు ఇప్పుడు అందర్నీ ఆలోచింపజేస్తున్నాయి.


హైదరాబాద్‌లో జరగబోయే ఈ అందాల పోటీలు మరింత నాణ్యతతో, మరింత సాంస్కృతిక వైవిధ్యతతో, శారీరక సౌందర్యంతో అంతఃసౌందర్యాన్ని కూడా ప్రదర్శించే విధంగా రూపొంది, తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ సౌందర్య చిత్రపటంలో ప్రత్యేకంగా నిలుపుతాయి అని ఆశించవచ్చు.

డాక్టర్ మామిడి హరికృష్ణ

డైరెక్టర్‌, తెలంగాణ భాష–సాంస్కృతిక శాఖ

ఈ వార్తలు కూడా చదవండి

AP News: కొలిక్కి రాని కొలికపూడి ఇష్యూ.. తిరువూరులో ఉత్కంఠ..

Good News To Youth: ఉద్యోగాల పండగ.. టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో సీఎం గుడ్‌న్యూస్

CM Chandrababu: ప్రజా సేవకు పునరంకితం అవుతామని సంకల్పం చేస్తున్నా...

For More AP News and Telugu News

Updated Date - Mar 30 , 2025 | 02:12 AM