Share News

Pension Scam: పెన్షన్ల సొమ్ముతో పరారీ

ABN , Publish Date - Apr 02 , 2025 | 05:31 AM

ఎన్‌టీఆర్ జిల్లా కంచికచర్లలో సచివాలయ ఉద్యోగి తోట తరుణ్‌కుమార్‌ రూ.7.50 లక్షల పెన్షన్‌ సొమ్ముతో పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టగా, బాధితులకు ప్రత్యామ్నాయంగా నగదు అందజేశారు

Pension Scam: పెన్షన్ల సొమ్ముతో పరారీ

  • 7.50 లక్షలతో ఉడాయించిన సచివాలయ ఉద్యోగి

  • గతంలోనూ ఇదే తీరు.. సస్పెన్షన్‌ తొలగింపుతో మళ్లీ!

కంచికచర్ల, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): పెన్షన్‌ సొమ్ము రూ.7.50 లక్షలతో సచివాలయ ఉద్యోగి ఒకరు పరారైన సంఘటన ఎన్‌టీఆర్‌ జిల్లా కంచికచర్లలో జరిగింది. మంగళవారం సాయంత్రం వరకు సదరు ఉద్యోగి ఆచూకీ తెలియకపోవడంతో ఎంపీడీవో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గంపలగూడెం మండలం పెనుగొలనుకు చెందిన తోట తరుణ్‌కుమార్‌ కంచికచర్ల-3 సచివాలయంలో విద్య, సంక్షేమ సహాయకునిగా పనిచేస్తున్నారు. ఈ సచివాలయం పరిధిలోని పెన్షన్‌ లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు మార్చి 29న తరుణ్‌కుమార్‌ బ్యాంకు నుంచి రూ.48.35 లక్షలు డ్రా చేశాడు. దానిలో మిగిలిన సచివాలయ సిబ్బందికి రూ.40.85 లక్షలు ఇచ్చాడు. వెటర్నరీ అసిస్టెంట్‌ గోపాలాచారి రూ.2.92 లక్షలు తీసుకోలేదు. దీనితోపాటు తాను పంపిణీ చేయాల్సిన రూ.4.58 లక్షలతో కలిసి మొత్తం రూ.7.50 లక్షలు తరుణ్‌కుమార్‌ వద్ద ఉన్నాయి. మంగళవారం ఉదయం పెన్షన్‌ సొమ్ము పంపిణీ చేయాల్సి ఉండగా.. తరుణ్‌కుమార్‌ విధులకు రాలేదు. అధికారులు ఫోన్‌ చేస్తే.. స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. దీంతో ఎంపీడీవో లక్ష్మీకుమారి ఫిర్యాదు మేరకు కంచికచర్ల పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి, గాలిస్తున్నారు. లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయంగా నగదు సమకూర్చి పెన్షన్‌ అందించామని ఎంపీడీవో చెప్పారు. కాగా గతంలో నెమలి సచివాలయంలో పనిచేస్తున్నప్పుడూ తరుణ్‌ రూ.2 లక్షలతో పరారైనట్టు తెలిసింది. అప్పట్లో అతడిని సస్పెండ్‌ చేసిన అధికారులు.. సొమ్ము జమ చేయడంతో తిరిగి పోస్టింగ్‌ ఇచ్చారు.

Updated Date - Apr 02 , 2025 | 05:32 AM