మన విద్యార్థులను ‘ఏఐ’కు సిద్ధం చేయాలి!
ABN , Publish Date - Apr 02 , 2025 | 05:39 AM
కృత్రిమ మేధస్సును (ఏఐ) ప్రాథమిక, మాధ్యమిక విద్యలో ప్రవేశపెట్టడం నేటి ఆధునిక బోధనా విధానాలలో కీలక అవసరం. దేశాలు తమ విద్యార్థులను ఏఐ ఆధారిత భవిష్యత్తుకై సిద్ధం చేయడానికి పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో...

కృత్రిమ మేధస్సును (ఏఐ) ప్రాథమిక, మాధ్యమిక విద్యలో ప్రవేశపెట్టడం నేటి ఆధునిక బోధనా విధానాలలో కీలక అవసరం. దేశాలు తమ విద్యార్థులను ఏఐ ఆధారిత భవిష్యత్తుకై సిద్ధం చేయడానికి పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ దేశాలు ప్రత్యేకమైన విధానాలను, అమలు వ్యూహాలను అభివృద్ధి చేశాయి.
చైనా ఏఐ విద్యలో ముందంజలో ఉంది. మూడవ తరగతి నుంచే తప్పనిసరి ఏఐ పాఠ్య ప్రణాళికను ప్రవేశపెట్టడం చైనా ప్రత్యేకత. విద్యార్థులకు మెషీన్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్, స్పీచ్ రికగ్నిషన్ వంటి అంశాలను పరిచయం చేస్తూ ప్రత్యేక పాఠ్య పుస్తకాలను రూపొందించారు. టెక్నాలజీ కంపెనీల సహకారంతో ఏఐ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌లను అభివృద్ధి చేశారు. వీటి ద్వారా చిన్న పిల్లలకు క్లిష్టమైన ఏఐ అంశాలను అర్థమయ్యేలా బోధిస్తున్నారు. ఏఐ ఆధారిత స్మార్ట్ తరగతి గదులను కూడా అభివృద్ధి చేశారు. దక్షిణ కొరియా ప్రాథమిక స్థాయి నుంచే కంప్యూటేషనల్ థింకింగ్‌పై ఎక్కువ శ్రద్ధతో సాధారణ విషయాలలోకి ఏఐ అక్షరాస్యతను ప్రవేశపెట్టడం ద్వారా సమగ్ర విద్యా విధానాన్ని రూపొందించింది. సింగపూర్ మాధ్యమిక స్థాయిలో ఏఐ విద్యను నిర్మాణాత్మకంగా అమలు చేసింది. ఏఐ అక్షరాస్యత, ప్రోగ్రామ్, కోడ్ ఫర్ ఫన్ వంటి కార్యక్రమాలు విద్యార్థులకు ప్రయోగిక అనుభవాన్ని అందిస్తున్నాయి. ఉపాధ్యాయ శిక్షణ, పరిశ్రమ భాగస్వామ్యం ద్వారా ఏఐ విద్యను సమర్థంగా బోధించేలా చర్యలు తీసుకున్నారు. అమెరికా రాష్ట్రాల వారీగా ఏఐ విద్యను అమలు చేస్తోంది. స్థానిక అవసరాలకు అనుగుణంగా ఏఐ విద్యా కార్యక్రమాలను రూపొందించింది. స్టెమ్ విధానం, నైతిక ఏఐ వినియోగంపై అమెరికా శ్రద్ధచూపుతోంది. గూగుల్, ఐబీఎం వాట్సన్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రైవేటు రంగ సంస్థలు ఏఐ విద్యా కార్యక్రమాలను అభివృద్ధి చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి.
భారతదేశంలో ఏఐ విద్యా ప్రణాళికను దశల వారీగా అమలు చేయడం సమర్థవంతమైన మార్గంగా భావించాలి. ప్రాథమిక స్థాయిలో (1–3 తరగతులు) విద్యార్థులకు ఏఐ పరిచయం చేసే విధానం పునాది స్థాయిలో ఉండాలి. పిల్లలకు ఆకర్షణీయమైన అభ్యాస (ప్రాక్టికల్) విధానాల ద్వారా కంప్యూటేషనల్ థింకింగ్‌ను పరిచయం చేయాలి. విజువల్ ప్రోగ్రామింగ్ టూల్స్, రోబోట్– ఆధారిత విద్య ద్వారా ప్రాథమిక ప్రోగ్రామింగ్, లాజికల్ థింకింగ్ నైపుణ్యాలను అభివృద్ధి చేయాలి. ఉన్నత ప్రాథమిక విద్య (4–6 తరగతులు)లో విద్యార్థులకు సరైన పాఠ్య ప్రణాళిక, ప్రాక్టికల్ ఉదాహరణలు, సరళమైన మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్టుల ద్వారా మౌలిక ఏఐ భావనలను బోధించాలి. చిన్న చిన్న మెషీన్ లెర్నింగ్ ప్రాజెక్టులు, ఇంటరాక్టివ్, సూపర్‌వైజ్డ్ లెర్నింగ్ ప్రయోగాల ద్వారా మరింత లోతుకు తీసుకువెళ్లాలి. ఏఐ నైతికత గురించి అవగాహన పెంచాలి. మాధ్యమిక స్థాయిలో (7–9 తరగతులు) గణనీయమైన మార్పులు తీసుకురావాలి. విద్యార్థులు పైథాన్ వంటి భాషలను నేర్చుకోవాలి. డేటా విశ్లేషణ, మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లను ప్రాక్టికల్ ప్రాజెక్టుల ద్వారా అధ్యయనం చేయాలి. ఈ దశలో ఏఐ సామాజిక ప్రభావంపై అవగాహన పెంచాలి. 10–12 తరగతులు ఏఐ విద్యకు మరింత ప్రాముఖ్యతను తెచ్చే దశ. అధునాతన ప్రోగ్రామింగ్, పరిశ్రమ సహకార ప్రాజెక్టులు ఇందులో భాగం కావాలి. విద్యార్థులు ఏఐ అభివృద్ధి వినియోగంపై నైతిక అవగాహన పెంచుకునేలా చర్యలు తీసుకోవాలి.
ఏఐ విద్యా ప్రణాళిక విజయవంతంగా అమలవ్వాలంటే తగిన మౌలిక సదుపాయాలు ఉండాలి. దీనిలో అధిక వేగం గల ఇంటర్నెట్, కంప్యూటింగ్ పరికరాలు, ఏఐ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌లు, స్మార్ట్ తరగతి గదులు ముఖ్యమైనవి. ఉపాధ్యాయులు సాంకేతిక పరిజ్జానం కలిగి ఉండాలి. వారి శిక్షణ కోసం ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేయాలి. పరిశ్రమ మెంటర్ల సహకారం విద్యార్థులకు ఉపయుక్తం.
సాంప్రదాయ పాఠ్య ప్రణాళికలో ఏఐను సమర్థంగా అనుసంధానించాలి. గణితంలో స్టాటిస్టికల్ కాన్సెప్ట్స్, సైన్స్‌లో డేటా అనాలిసిస్, భాషా పాఠాలలో సహజ పద్ధతిలో నేర్చుకునే (ఎన్ఎల్‌పీ) అంశాలు ఉండాలి. ఏఐ నైతికత, సంఘంపై ప్రభావాన్ని సామాజిక శాస్త్రాల బోధనలో భాగం చేయాలి. విద్యార్థుల పురోగతిని మూల్యాంకనం చేయడానికి ప్రాజెక్ట్–ఆధారిత, నిరంతర మూల్యాంకన విధానాలను అనుసరించాలి.
భారతదేశం ఏఐ విద్యను విజయవంతంగా అమలు చేయాలంటే అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను గణనలోకి తీసుకొని, స్థానిక విద్యా అవసరాలకు అనుగుణంగా ప్రణాళికను రూపొందించాలి. మన జాతి భవిష్యత్తు మనం భావితరాలకు అందించే విద్యపై ఆధారపడి ఉంది. ప్రపంచ దేశాలలో అగ్రగామిగా నిలవడానికి విద్యలో ఏఐ చేర్చడం లాంటి సంస్కరణలను వెంటనే చేపట్టడం ఇప్పుడు తక్షణావసరం.
ప్రొఫెసర్ ఎన్. శివప్రసాద్
విశ్రాంత ఆచార్యులు, ఐఐటీ మద్రాసు
ఈ వార్తలు కూడా చదవండి..
CM Chandrababu Comments: బాపట్ల సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Kakani Investigation News: రెండో రోజు విచారణకు కాకాణి గైర్హాజరు
Palnadu Crime: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన యువతి.. ఎందుకంటే
Read Latest AP News And Telugu News