Share News

విద్యార్థుల భూమిపైకి బుల్డోజర్లా!

ABN , Publish Date - Apr 02 , 2025 | 05:37 AM

తొలిదశ తెలంగాణ ఉద్యమంలో ఇక్కడి ప్రజల హృదయాలను అర్థం చేసుకున్న ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రాంతీయ అసమానతలను తగ్గించేందుకు 1973లో ప్రత్యేక చట్టాలు, రాజ్యాంగ సవరణ ద్వారా ...

విద్యార్థుల భూమిపైకి బుల్డోజర్లా!

తొలిదశ తెలంగాణ ఉద్యమంలో ఇక్కడి ప్రజల హృదయాలను అర్థం చేసుకున్న ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రాంతీయ అసమానతలను తగ్గించేందుకు 1973లో ప్రత్యేక చట్టాలు, రాజ్యాంగ సవరణ ద్వారా హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీ స్థాపనకు అనుమతి ఇస్తూ 2300 ఎకరాలు కేటాయించారు. అప్పటి నుంచి ఆ భూమి హెచ్‌సీయూ పరిధిలోనే ఉంటూ వస్తుంది. అయితే ఆ భూమి కేటాయింపు, విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషీ చెలాయిస్తూ వచ్చింది. వివిధ ప్రభుత్వ సంస్థలకు, రీసెర్చ్ సెంటర్లకు హెచ్‌సీయూ భూములను కేటాయించింది. 2004లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రీడల అభివృద్ధి కోసం ఐఎమ్‌జీ అకాడమిస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 400 ఎకరాలను కేటాయించారు. 2006లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ఆ కేటాయింపులను రద్దు చేసి ఆ భూమిని తిరిగి యూత్ అడ్వాన్స్‌మెంట్‌ టూరిజం అండ్ కల్చర్ డిపార్టుమెంట్‌కు కేటాయించారు. ఈ కేటాయింపులపై ఐఎమ్‌జీ సంస్థ కోర్టుకు ఎక్కింది. సుదీర్ఘకాలం కేసు కొనసాగి 2024లో ప్రభుత్వానికి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. ఈ ఉత్తర్వుల ప్రకారం ఆ భూమిని తిరిగి హెచ్‌సీయూకి ఇవ్వాలి. కానీ ఇప్పుడు ప్రభుత్వం కేసు మేమే గెలిచాం కాబట్టి మా ఇష్టం వచ్చినట్లు వేలం వేసుకుని అమ్ముకుంటాం అంటున్నది. 1973 నుంచి హెచ్‌సీయూ పరిధిలో ఉన్న భూమి రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కారణంగా 2004 నుంచి ఒక్కసారిగా పాలకుల చేతుల్లోకి వెళ్ళింది. ఇప్పుడు ఈ 400 ఎకరాల భూమిని ముఖ్యమంత్రి ఇష్టానుసారం కార్పొరేట్ శక్తులకు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు.


టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆనాటి ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ము కాస్తుందనీ, అవుటర్‌ రింగ్‌ రోడ్‌ను కార్పొరేట్లకు లీజుకిచ్చిందని, దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం అంటూ అధికారంలోకి వచ్చి ఆ ఇందిరమ్మ ఇచ్చిన భూమినే కార్పోరేట్ శక్తులకు బహిరంగ మార్కెట్లో అమ్ముతానని ప్రకటించటం దారుణ విషయం. ఇది రాష్ట్ర ప్రభుత్వం సమిష్టిగా తీసుకున్న నిర్ణయంగా ఎక్కడా కనిపించడం లేదు. రేవంత్‌రెడ్డి సొంత నిర్ణయమేనని స్పష్టమవుతుంది. ముఖ్యమంత్రి, మంత్రులు ఎంతసేపు 2004లో ప్రైవేట్ వ్యక్తుల చేతులలోకి వెళ్ళబోయిన భూమిని ఇప్పుడు కేసు గెలిచి ప్రభుత్వం దక్కించుకుందీ అంటున్నారే గాని 1973 నుంచి 2004 వరకు అవి హెచ్‌సీయూ భూములేనని మర్చిపోతున్నారు.

గతంలో టీఎన్జీవోలకు ఇచ్చిన భూములు కూడా అక్రమంగా హెచ్‌సీయూ నుంచి లాక్కున్నవే వంద ఎకరాలకు పైగా భూమిని ఎన్జీవోల పేరుతో ప్రముఖ నాయకులంతా పంచుకొని తమకు నచ్చిన వారికి కేటాయించుకొని వందల కోట్ల రూపాయలు పోగేసుకున్నారు. అదే ఎన్జీవో కాలనీకి రోడ్డు పేరుతో హెచ్‌సీయూ నుంచి శాశ్వతంగా విభజించుకున్నారు. ఎక్కువమంది ఇతర రాష్ట్రాల విద్యార్థులే ఉండడంతో అడిగేవారు లేరని, విద్యార్థులు కొంతమంది రోడ్డుపైకి వచ్చినా తేలికగా అణచివేయవచ్చునన్న ధోరణితో మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం కన్ను ఇక్కడి భూములపై పడింది. ఇప్పుడు తీసుకోవాలనుకుంటున్న భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం బహిరంగ వేలం వేసి అమ్ముతామంటూ ఏ మాత్రం బేషజం లేకుండా ప్రకటించడం ప్రభుత్వం దివాలాకోరుతనానికి నిదర్శనం. వివాదాస్పదమైన 400 ఎకరాల భూమిలో అనేక వృక్షజాతులు, జీవ వైవిధ్యం కలిగిన, అరుదైన రాళ్ళు, చెరువులు ఉన్నాయి.


తెలంగాణలో ప్రశ్నించే మేధావులందరికీ తలో పదవీ కట్టబెట్టి వాళ్ళ నోళ్లు మూయించింది ప్రభుత్వం. అశాశ్వతమైన పదవుల కోసం శాశ్వతమైన వ్యవస్థను పణంగా పెట్టిన మేధావి వర్గం తెలంగాణకు జరుగుతున్న తీవ్ర అన్యాయాన్ని ఆపేందుకు ముందుకు వస్తుందో రాదో వేచిచూడాలి. తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేస్తామన్న రాజకీయ పార్టీలకు ఓట్ల రాజకీయాలు ముఖ్యం తప్ప ప్రజా ప్రయోజనం కోసం కాదని మరోసారి తేటతెల్లం అవుతున్నది. గతంలో కేసీఆర్ కూడా ఓయూ భూములు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం కేటాయిస్తాం అనగానే ఓయూ ఒక్కసారిగా భగ్గుమన్నది. తెలంగాణ సమాజం మొత్తం ఒక్క తాటిపైకి వచ్చి కేసీఆర్ నియంతృత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాడి ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చేసింది. ఇప్పుడు ఆ ఐక్యత తెలంగాణ సమాజంలో ఎక్కడా కనిపించడం లేదు. హెచ్‌సీయూ అంటే అది తెలంగాణకు సంబంధం లేదన్నట్టుగా కొన్ని రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి.

రాజకీయంగా కేసీఆర్‌ కంటే దారుణంగా రేవంత్ వ్యవహరిస్తున్నాడు. విద్యార్థుల పైన కేసులు పెట్టి, లాఠీచార్జి చేయించి మహిళలను కూడా విచక్షణరహితంగా ఈడ్చుకు వెళ్ళి అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. భూమికోసం ఉద్యమించటం కోర్టు ధిక్కరణ అని ముఖ్యమంత్రి, మంత్రులు పదేపదే ప్రకటన చేసి విద్యార్థులను భయపెడుతున్నారు. ఇప్పటికే కోర్టు తీర్పు వచ్చినందున, ఈ విషయం ఇక కోర్టులో లేనందున విద్యార్థులు ప్రభుత్వంపై కొట్లాడుతున్నారు. మరోపక్క యూనివర్సిటీ అధికార యంత్రాంగం పూర్తిగా ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గినట్టు కనిపిస్తున్నది. అందుకే వేలమంది పోలీసులను, బుల్డోజర్లను, జేసీబీలను లోపలికి అనుమతించి దగ్గరుండి పనులు చేయిస్తున్నది.


రేవంత్‌రెడ్డికి పాలన కోసం ఆదాయం వచ్చే మార్గాలు కనిపించడం లేదు కాబోలు. భవిష్యత్ తరాల విద్యా వనరులని, సమాజహితం కోసం కేటాయించిన ప్రభుత్వ భూముల్ని అమ్ముతున్నారు. విద్యార్థుల వెనక స్థిరాస్తి వ్యాపారులు, రాజకీయ నాయకులు ఉండి ఇదంతా నడిపిస్తున్నారు అని స్వయంగా స్థిరాస్తి వ్యాపారిగా జీవితం ప్రారంభించిన రేవంత్ రెడ్డి విమర్శ చేయడం సరైంది కాదు. ఈ 400 ఎకరాల్లో ఒక్క అంగుళం కూడా హెచ్‌సీయూది కాదని వాదిస్తున్న మంత్రి శ్రీధర్‌బాబు 2004 కంటే ముందు ఆ భూమి ఎవరి ఆధీనంలో ఉందో సమాధానం చెప్పాలి.

2007లో ప్రభుత్వ ఆస్తి, సంరక్షణ (తిరిగి స్వీకరించటం) చట్టం ప్రకారం యూనివర్సిటీలో 80శాతం భూమి వినియోగం లేకుండా ఉందని భావించి ప్రైవేట్‌ వ్యక్తులకు, సంస్థలకు ధారాదత్తం చేయవచ్చని చేస్తున్న వాదన విడ్డూరం. విద్యాసంస్థల భూమిని విద్యాసంస్థల విస్తరణ కోసం వాడటం కోసం ఇప్పటివరకు చూశాం కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, కార్పొరేట్ల కోసం విద్యాలయ భూములను లాక్కొంటున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది. ఇందిరమ్మ ఇచ్చిన భూమిని ఇందిరమ్మ రాజ్యమే కబళించాలని చూడటం ఇక్కడ కొసమెరుపు.

అసలైన కాంగ్రెస్ భావజాలం గల ఎమ్మెల్యేలు కూడా ఈ విషయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోకుండా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని తొలి తెలంగాణ ఉద్యమానికి ప్రతీక అయిన హెచ్‌సీయూ భూమిని యథాతథంగా ఉంచి నిజాయితీని, నిబద్ధతను చాటుకోవాలి.

డా. దొంతగాని వీరబాబు

హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీ

ఈ వార్తలు కూడా చదవండి..

CM Chandrababu Comments: బాపట్ల సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Kakani Investigation News: రెండో రోజు విచారణకు కాకాణి గైర్హాజరు

Palnadu Crime: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన యువతి.. ఎందుకంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 02 , 2025 | 05:37 AM