పల్లెల ముఖచిత్రం మార్చగల ‘పీ4’
ABN , Publish Date - Apr 02 , 2025 | 05:34 AM
దిగ్గజ వ్యాపారవేత్తలు, అత్యంత ధనవంతులైన వారెన్ బఫెట్, బిల్‌గేట్స్, మిలిందా ఫ్రెంచ్ గేట్స్ 2010లో ‘ద గివింగ్ ప్లెడ్జ్’ అనే దాతృత్వ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా, ప్రపంచవ్యాప్తంగా 200 మందికి...

దిగ్గజ వ్యాపారవేత్తలు, అత్యంత ధనవంతులైన వారెన్ బఫెట్, బిల్‌గేట్స్, మిలిందా ఫ్రెంచ్ గేట్స్ 2010లో ‘ద గివింగ్ ప్లెడ్జ్’ అనే దాతృత్వ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా, ప్రపంచవ్యాప్తంగా 200 మందికి పైగా ధనవంతులు తమ సంపదలో కనీసం 50శాతం లేదా అంతకంటే ఎక్కువ భాగాన్ని సామాజిక సంక్షేమ కార్యకలాపాలకు దానం చేయడానికి అంగీకరించారు. ఇదే కోవలో ఏపీలో పేదరికాన్ని తగ్గించి పేద కుటుంబాలను సాధికారత వైపు నడిపించేందుకు శ్రీకారం చుట్టిన ప్రక్రియే పీ4 విధానం. సంపన్న వర్గాలు నిరుపేద కుటుంబాలను దత్తత తీసుకుని వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం.
పేదరికం లేని సమాజం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతినిత్యం కృషి చేస్తున్నారు. ఇందుకోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి పీ-4 కార్యక్రమాన్ని ఉగాది రోజున అమరావతి వేదికగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా లోగోను ఆవిష్కరించి, ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించారు.
అట్టడుగున ఉన్న పేదల సాధికారత కోసమే ఈ పీ4 కార్యక్రమం. మొదట నాలుగు గ్రామాల్లో పీ4 కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో 5,869 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. సంపద అధికంగా ఉన్న కుటుంబాలు అట్టడుగున ఉన్న కుటుంబాలకు అండగా నిలవడమే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం. ఇందులో భాగంగా లబ్ధిదారులను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న సమాచారంతో పాటు సర్వే, గ్రామసభల ద్వారా గుర్తిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 40 లక్షల కుటుంబాలు దీనికి అర్హులుగా ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో సర్వే చేపట్టారు. ఈ సర్వే ద్వారా అట్టడుగున ఉన్న వారిని గుర్తించి లబ్ధిదారుల ధ్రువీకరణ అనంతరం వారి వివరాలను సమృద్ధి బంధనమ్ ప్లాట్‌ఫాంలో ఉంచుతారు.
లబ్ధి పొందాల్సిన కుటుంబాలను సాయం చేసే కుటుంబాలతో అనుసంధానించడమే ఈ పీ-4 విధానంలో ప్రభుత్వ పాత్ర. నేరుగా ప్రభుత్వం ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించదు. ఈ ఏడాది ఆగస్టు నాటికి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 5లక్షల కుటుంబాలు భాగస్వామ్యం పొందేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పీ4 విధానం ద్వారా అట్టడుగున ఉన్న 20శాతం మందికి మేలు జరుగుతుంది. సంపద ఉన్న వారిలో 10శాతం మంది అట్టడుగున ఉన్న వారిలో 20శాతం పేదలను ఆదుకోవడం ద్వారా సమాజంలో ఆర్థిక అసమానతలు రూపుమాపవచ్చన్నది ప్రభుత్వం ఆలోచన.
పీ4 ద్వారా సంపన్న (మార్గదర్శి), ఆర్థికంగా వెనుకబడిన (బంగారు కుటుంబం) కుటుంబాల మధ్య నేరుగా అనుసంధానం ఉంటుంది. ఇందులో ప్రభుత్వం నేరుగా ఆర్థిక సహాయం అందించకపోయినా మార్గదర్శి కుటుంబాలు సమర్థంగా సహాయపడేలా సౌకర్యాలు కల్పిస్తుంది. వివిధ శాఖల డేటా సిస్టమ్స్ విశ్లేషణలు, గ్రౌండ్ సర్వేల ద్వారా అత్యంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలను గుర్తిస్తారు. ఈ ప్రక్రియ డైనమిక్‌గా ఉంటుంది. అర్హులైన కుటుంబాలు ఎప్పటికప్పుడు చేర్చబడతాయి. అదనంగా, కుటుంబాలు తమను తాము బంగారు కుటుంబంగా నమోదు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ధ్రువీకరణ ప్రక్రియ అనంతరం అర్హులైన కుటుంబాలు పథకంలో భాగమవుతాయి.
దేశవ్యాప్తంగా ఏ అవినీతి అరాచకం జరిగినా ఏ1, ఏ2, ఏ3, ఏ4గా ఉండే వైసీపీ నేతలకు పీ4 అంటే ఏం తెలుస్తుంది. దాచుకోవడం దోచుకోవడం తప్ప మరేమీ తెలియని వైసీపీ నేతలకు పేదలు ఏమైపోతే ఏమిటి? వారు మాత్రం ప్యాలెస్‌లు కట్టుకొని రాజభోగాలు అనుభవించవచ్చు, పేదలు సాధికారత సాధిస్తే మాత్రం కళ్లు మండుతాయి! పేదలకు సాయం చేయకపోగా, పేదలను ఆదుకునేందుకు చేపట్టిన మంచి కార్యక్రమంపై బురదజల్లే వైసీపీ నేతలను పేదలు తరిమి తరిమికొట్టే పరిస్థితి రాకపోదు.
‘ద గివింగ్ ప్లెడ్జ్’ కార్యక్రమంలో భారతదేశం నుంచి పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు పని చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 30దేశాల నుంచి 240 మంది ఇందులో చేరి కోట్లాది కుటుంబాలలో మార్పు తెచ్చారు. ప్రతి దేశంలో ఆర్థిక అసమానతలు సహజమే. కానీ ఏ దేశంలో అయితే ఇవి తక్కువగా ఉంటాయో ఆ దేశంలో ప్రజలు సంతోషంగా ఉంటారు. ఆర్థిక అసమానతలను పరిష్కరించడానికి సాహసోపేతమైన చర్యలు అవసరం. సంపద సృష్టి ఒక్కటే సరిపోదని భావించి, అందుకు అనుగుణంగా సంపదను సమర్థమైన మార్గాల ద్వారా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు పీ-4 విధానానికి శ్రీకారం చూట్టారు. ఈ కార్యక్రమానికి పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు సహకరించాలి. ప్రభుత్వ లక్ష్యాలకు దాతల సహకారం తోడైతే ఎంతో అభివృద్ధి సాధించవచ్చు అన్న విషయం జన్మభూమి, గ్రామాల దత్తత కార్యక్రమాల ద్వారా ఇదివరకే రుజువైంది. ఊరి నుంచి ఎదిగిన శ్రీమంతులు, స్థితిమంతులు, ప్రవాసాంధ్రులు ఆ దిశగా ఆలోచించాలి. అందరు ముందుకు వస్తే పల్లెలు కొత్తరూపు సంతరించుకోవడానికి ఎంతోకాలం పట్టదు.
n ఏలూరి సాంబశివరావు
పర్చూరు శాసనసభ్యులు
ఈ వార్తలు కూడా చదవండి..
CM Chandrababu Comments: బాపట్ల సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Kakani Investigation News: రెండో రోజు విచారణకు కాకాణి గైర్హాజరు
Palnadu Crime: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన యువతి.. ఎందుకంటే
Read Latest AP News And Telugu News