ఆహార వృథా అరికట్టాలి
ABN , Publish Date - Apr 02 , 2025 | 05:27 AM
ఇళ్లు, హోటళ్లు, విందులు, విహారాలు, రవాణాలో ఆహారం అమితంగా వృథా అవుతున్నది. ఈ సమస్య ప్రపంచాన్ని వేధిస్తున్నది. 2022లో బిలియన్ టన్నులకు పైగా ఆహారం ప్రపంచవ్యాప్తంగా వృథా అయిందని...

ఇళ్లు, హోటళ్లు, విందులు, విహారాలు, రవాణాలో ఆహారం అమితంగా వృథా అవుతున్నది. ఈ సమస్య ప్రపంచాన్ని వేధిస్తున్నది. 2022లో బిలియన్ టన్నులకు పైగా ఆహారం ప్రపంచవ్యాప్తంగా వృథా అయిందని యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్స్ ఫుడ్ వేస్ట్ రిపోర్ట్ వెల్లడించింది. ఇది ప్రపంచ జనాభాలో 20 శాతం మంది ఆకలి తీరుస్తుందని ఆ నివేదిక పేర్కొంది. భయంకరమైన ఈ సమస్యలో ఇండియా అగ్ర భాగాన ఉంది.
ఆహార వృథా రెండు రకాలుగా జరుగుతుంది. ఇంట్లో వండినది కుప్ప తొట్టేలో పడేస్తున్నాం. పొలం నుండి వినియోగదారునికి చేరే దారిలో పడేసేది ఇంకొంత. వెరసి 73 మిలియన్ టన్నులకు వృథా చేరుతున్నది. ఆహార వృథా వల్ల పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతున్నది. వ్యవసాయానికి నేల, నీరు, విద్యుత్ అధికంగా కావాలి. ఆహార వృథా అంటే వెలకట్టలేని సహజ వనరులను నాశనం చేయడం. ఒక ఎకరా వరి పండించడానికి 20 నుంచి 40 వేల లీటర్ల నీరు అవసరం. ఇండియాలో నగరాలు, పట్టణాల్లోని చెత్తలో పన్నెండు శాతం ఆహార పదార్థాలే ఆక్రమిస్తున్నాయి. నగర పాలక సిబ్బంది సేకరించిన చెత్తను నేలమాళిగల్లో పూడుస్తారు. తడి ఆహారపు చెత్త నేలలో చివికేటప్పుడు మిథేన్ వాయువు ఉత్పత్తి అవుతుంది. ఇది వాతావరణంలోని వేడిని పట్టి నిలుపుతుంది. దీంతో భూమి వేడెక్కుతుంది. బొగ్గు పులుసు వాయువు కంటే మిథేన్ అధిక వేడి కలుగజేస్తుంది. ఆహార వృథా వల్ల జరిగే సామాజిక నష్టాన్ని తోసిపుచ్చలేం. దేశంలో భారీ స్థాయిలో ఆహారోత్పత్తి జరుగుతున్నది. అయినా ఇక్కడ ఇరవై శాతం మంది పేదలు తిండి గింజలు కొనలేక పస్తులుంటున్నారు. భూతాపం పెరుగుదల, అస్థిర వర్ష ఋతువు, వరదలు, కరువులు, కొండ చెరియలు విరిగిపడటం మొదలైన ప్రకృతి వైపరీత్యాలు పంటలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి.
ఈ సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోవాలి. ఇందుకు ద్విముఖ వ్యూహం అవసరం. వ్యక్తిగత స్థాయి పరిష్కారాలు, విధాన సంస్కరణలు గావించి సుస్థిరాభివృద్ధికి బాటలు వేసుకోవాలి. ఇంటి అవసరాలకు తగినన్ని వెచ్చాలే కొనాలి. కచ్చితమైన భోజన ప్రణాళిక వేసుకోవాలి. సరైన మూతలున్న డబ్బాలలో వెచ్చాలు పోసుకొని, సరైన ఉష్ణోగ్రతల్లో వాటిని దాచుకోవాలి. ఎక్కువగా కూరగాయలు దొరికే కాలంలో ఒరుగులు తయారు చేసుకోవాలి. వంట గదిలో వచ్చిన చెత్తను సద్వినియోగపరచుకోవాలి. అంటే కంపోస్ట్ చేసి పూలమొక్కలకు, కూరగాయల మొక్కలకు వేయాలి. ఇలా చేస్తే తాజా పూలు, కూరగాయలు దొరుకుతాయి. ఊరు శుభ్రమౌతుంది. పెరటి తోటలు, మిద్దె తోటలు వేయాలి. వీటి పెంపకానికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాలి. ప్రభుత్వం శీతల గిడ్డంగుల నిర్మాణం చేపట్టి, ఆహార పదార్థాల నిల్వ సామర్థ్యం పెంచాలి. ప్రజల భాగస్వామ్యంతో మెరుగైన నిల్వ పద్ధతులు రూపొందించాలి. ఆహార పదార్థాల ధరలు అదుపు చేస్తే పేదలకు పట్టెడు మెతుకులు దొరుకుతాయి. వస్తు రవాణా వసతులు మెరుగుపరచాలి.
– వి. వరదరాజు
ఈ వార్తలు కూడా చదవండి..
CM Chandrababu Comments: బాపట్ల సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Kakani Investigation News: రెండో రోజు విచారణకు కాకాణి గైర్హాజరు
Palnadu Crime: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన యువతి.. ఎందుకంటే
Read Latest AP News And Telugu News