ఆదివాసుల సమస్య అడవికే పరిమితమా?
ABN , Publish Date - Jan 07 , 2025 | 12:50 AM
కష్టాలు వేరు; అణిచివేత వేరు. కష్టాలు అందరికీ వుంటాయి. గౌతమ్ ఆదానీకీ, నరేంద్ర మోదీకీ కూడా కష్టాలు వుంటాయి. ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా అణచివేతకు గురవుతున్నది ఎవరూ?...
కష్టాలు వేరు; అణిచివేత వేరు. కష్టాలు అందరికీ వుంటాయి. గౌతమ్ ఆదానీకీ, నరేంద్ర మోదీకీ కూడా కష్టాలు వుంటాయి. ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా అణచివేతకు గురవుతున్నది ఎవరూ? అని ప్రశ్నించుకుంటే మాత్రం మనకు రెండు సమూహాలు గుర్తుకు వస్తాయి. మొదటిది; ఆదివాసులు. రెండోది; ముస్లింలు.
ఆదివాసీ, ముస్లిం సమూహాలు ఈ భూమి మీద వుండడం మెగా కార్పొరేట్లకు ఇష్టం లేదు. ఎందుకంటే, ఆదివాసుల కాళ్ళ కింద వుండే ఖనిజాలు, ముస్లిం దేశాల్లో వున్న చమురు నిల్వలు మొత్తంగా వాళ్ళకు కావాలి. రాజకీయాలను, ఆర్థిక వ్యవస్థను మనం తరచూ విడదీసి చూస్తుంటాం. అవి ఒకే శరీరానికి వున్న రెండు తలలు అనుకోం. పైగా, మోదీ ప్రధాని కావడం వల్ల కొన్ని మెగా కార్పొరేట్ల సంపద పెరుగుతోంది అనే అపోహలో ఉంటాము. కానీ తమ సంపదను పెంచుకోవడానికి మెగా కార్పొరేట్లు తగిన ప్రధానమంత్రిని కూడా ఎన్నుకోగలవేమో అన్న ఆలోచన మనకు రాదు.
ఆదివాసులు, ముస్లింలను అంతరించిపోతున్న జాతులు అనాల్సినంతగా పరిస్థితులు మారిపోతున్నాయి. చంపాల్సిన కుక్కను పిచ్చిది అని ప్రచారం చేయాలన్నది ఓ కుటిలనీతి. ఇప్పుడు ఆదివాసులు, ముస్లింల మీద అలాంటి కుటిల ప్రచారమే జరుగుతున్నది. ‘‘ఆదివాసులు అనాగరీకులు; ముస్లింలు మూర్ఖులు’’...- ఇదీ ఆ ప్రచారం సారాంశం. ఈ ప్రచారాన్ని ఎక్కువమంది నమ్మరు. కానీ ఓటర్లలో ఓ మూడోవంతు నమ్మి ఓటేసినా దేశాధినేతలు మళ్ళీమళ్ళీ గెలువగలరు.
ఆ మధ్య కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి పౌర స్మృతిని (UCC) అమలు చేయాలని ఒక ప్రయత్నం మొదలెట్టింది. ముస్లిం సమూహాన్ని ఇబ్బంది పెట్టడానికి తాము ఒక చట్టాన్ని తెస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ పెద్దలు గట్టి సంకేతాలు ఇచ్చారు. తమ ప్రత్యేక ఉనికిని కోల్పోతున్నట్టు ముస్లిం సమాజం కూడ ఆందోళన చెందింది. మైదాన సమాజం ‘అనాగరికులు’ అంటూ తరచూ కించపరిచే ఆదివాసులకు ఈ చట్టం వెనుకనున్న అసలు కుట్ర అర్థం అయింది. మన దేశంలో ప్రస్తుతం ఏడు వందల రకాల ఆదివాసీ సమూహాలు ఉన్నాయి. ప్రతి ఒక్క సమూహమూ ప్రత్యేకమైన ఆచార వ్యవహారాలని పాటిస్తాయి. వైవిధ్యపూరితమైన తమ సంస్కృతిని అంతం చేయడానికే ఉమ్మడి పౌర స్మృతిని తెస్తున్నట్టు వాళ్ళకు బోధపడింది. ఆదివాసి సంఘాలు ఝార్ఖండ్‌లో పెద్ద సభ జరిపి ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలని తీర్మానం చేశాయి.
నక్సల్బరీ -శ్రీకాకుళం రైతాంగ సాయుధ ఉద్యమాల రూపంలో భారత గడ్డ మీద కమ్యూనిజానికి తిరిగి ప్రాణం పోసింది ఆదివాసులే. ఆ ఉద్యమాలను చూసి ఉలిక్కిపడిన ప్రభుత్వాలు మైదాన ప్రాంతాల్లో భూపరిమితి చట్టాల్ని, అటవీ ప్రాంతాల్లో ఆదివాసీ భూముల పరిరక్షణ చట్టాల్ని తెచ్చాయి. ఇప్పుడు ఆ చట్టాలను వరుసగా రద్దుచేసే పనిలో పడ్డాయి.
మణిపూర్‌లోని కొండలు అటవీ భూముల మీద ఆదివాసులైన కుకీ-జోలకు సాంప్రదాయిక హక్కు ఉంది. లోయలో ఉండే నాగరీకులయిన మెయితీలకు కూడా కొండలు, అటవీ భూముల మీద హక్కు కల్పిస్తూ కొత్త చట్టం చేయడంతో అక్కడ మంటలు రాజుకున్నాయి. ఇదంతా బహిరంగ రహస్యమే. దీని వెనుక అంతకుమించిందేదో ఉందని కుకీ-జోలకు గట్టి అనుమానం.
ఏడాదిన్నరగా అల్లర్లు చెలరేగుతున్నా మణిపూర్ మీద ప్రధాని కనీసం స్పందించలేదు. వారు మౌనంగా వుంటూనే పార్లమెటులో ఇంకో పని చేశారు. అంతర్జాతీయ సరిహద్దుల నుండి వంద కిలోమీటర్ల లోపు ఉన్న అటవీ భూముల్ని దేశ ప్రయోజనాలకు అవసరమైన వ్యూహాత్మక ప్రాజెక్టుల కోసం వాడుకునేలా చట్ట సవరణ చేశారు.
ఇండియాకు ఏడు దేశాలతో అంతర్జాతీయ సరిహద్దులు ఉన్నాయి. వీటి పొడవు 15 వేల కిలోమీటర్లు. ఆ లెక్కన అటవీ భూముల సవరణ చట్టం కేటాయించిన భూముల విస్తీర్ణం దాదాపు 15 లక్షల చదరపు కిలోమీటర్లు. అంటే, 37 కోట్ల ఎకరాలు. ఇంతటి విస్తీర్ణమయిన భూమిని ఎవరి కోసం సేకరిస్తున్నారూ అనేది ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న ప్రశ్న. దేశానికి వ్యూహాత్మక ప్రాజెక్టులంటే రక్షణ శాఖ ప్రాజెక్టులని ఎక్కువమంది భావిస్తారు. ఆదానీ, అంబానీలకు అవసరమైన భూముల్ని కూడ కేంద్ర ప్రభుత్వం దేశ ప్రయోజనాలకు అవసరమైన వ్యూహాత్మక ప్రాజెక్టులుగా పరిగణించే వీలు లేకపోలేదు.
ఈశాన్య రాష్ట్రాల్లో మణిపూర్‌తో సహా అనేకం ఈ వంద కిలోమీటర్ల పరిధిలోకి వస్తాయి. అంటే వ్యూహాత్మక ప్రాజెక్టులు వస్తే ఈ రాష్ట్రాలు అంతరించిపోతాయి. దేశంలోని రేవు పట్టణాలన్నీ ఈ పరిధిలోనికే వస్తాయి. ఆ వంద కిలోమీటర్ల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఎలాంటి అధికారాలు వుండవు.
మణిపూర్ మీద ఎందుకింత ప్రత్యేక ఆసక్తి? అనేది ఎవరికయినా రావలసిన సందేహం. ఈ సందర్భంగా అనేక వాదనలు వినిపిస్తున్నాయి. మణిపూర్‌ను ఆనుకుని మయన్మార్, లావోస్, థాయిలాండ్ దేశాలున్నాయి. మెకాంగ్, రువాక్ నదులు ఇక్కడే కలుస్తాయి. ఈ మూడు దేశాల సరిహద్దులు కలిసే ప్రాంతానికి ‘గోల్డెన్ ట్రయాంగిల్’ (బంగారు త్రిభుజి) అనే పేరుంది. ఓపియం, హెరాయిన్ వంటి మాదకద్రవ్యాలకు ఇది ప్రపంచ కేంద్రం.
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ సరిహద్దులు కలిసే ప్రాంతాన్ని ‘గోల్డెన్ క్రిసెంట్’ (బంగారు నెలవంక) అంటారు. అది సహజ మాదకద్రవ్యాల కేంద్రమయితే, ‘బంగారు త్రిభుజి’ సింథటిక్ మాదకద్రవ్యాల కేంద్రం. ‘యాబా’ అని పిలిచే మెథంఫెటమైన్ (Methamphetamine) సింథటిక్ మాదకద్రవ్యం వాణిజ్యం ఇటీవల ఈ ప్రాంతంలో విపరీతంగా పెరిగింది. డ్రగ్స్‌తో పాటు ఆయుధాలు, కమర్షియల్ సెక్స్ రవాణాలకు ఇది ట్రాన్సిట్ పాయింట్.
ప్రపంచ వాణిజ్యంలో నిజానికి ఆయుధాలకన్నా మాదకద్రవ్యాలది చాలా పెద్ద వాటా. ఐక్యరాజ్య సమితి ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ (UNODC) అంచనా ప్రకారం మాదకద్రవ్యాల వాణిజ్యం 426 బిలియన్ డాలర్లు. ఆయుధాలకన్నా మాదకద్రవ్యాల అమ్మకాలు నాలుగు రెట్లు ఎక్కువగా వుండడానికి కారణం ఏమంటే, మనుషులు ఆయుధాలను ఎప్పుడో ఒకసారి వాడుతారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడితే ప్రతిరోజూ వాటిని కొనాల్సి వుంటుంది. అంచేత, వాణిజ్యంలో భారీ టర్నోవర్ ఆశించే మెగాకార్పొరేట్లు ఇప్పుడు మాదకద్రవ్యాల మీద దృష్టిపెట్టారని, గోల్డెన్ ట్రయాంగిల్ మీద పట్టుకోసమే మణిపూర్‌ను మండిస్తున్నారని కుకీ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
అడవుల నుండి ఆదివాసుల్ని తరిమేస్తున్నట్టే పట్టణ శ్రామికవాడల నుండి ముస్లింలని ఒక పథకం ప్రకారం బుల్డోజర్లతో తరిమేస్తుండడాన్ని మనం తరచూ చూస్తున్నాం. భారత ముస్లింలలో కొందరు వ్యాపారులు, కొండొకచో కార్పొరేట్లు కూడ ఉన్నారు. కానీ, అత్యధికులు యంత్రయుగపు కులవృత్తుల్లో జీవిస్తున్నారు.
మెగా కార్పొరేట్ల ఆగడాలు అడవులకే పరిమితంకావు. ఆదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ నుండి పాతికేళ్ళపాటు సోలార్, పవన విద్యుత్తును అధిక ధరకు కొనడానికి జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీని కోసం నీకెంత నాకెంత (Quid pro quo) పద్ధతిలో భారీగా ముడుపులు అందుకుందని ఇటీవల అంతర్జాతీయ వేదికల మీద పెద్ద దుమారం రేగడం మనకు తెలుసు. ఒప్పుకున్న షరతుల ప్రకారం భారీ నష్టపరిహారాన్ని చెల్లించాలి గనుక ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడమూ చంద్రబాబు ప్రభుత్వానికి కుదరదు. ఫలితంగా ఆ భారాన్ని రాష్ట్ర ప్రజలే భరించాల్సి వుంటుంది. ఇది కూడా మనకు తెలుసు. కానీ మనకు తెలియాల్సిన మరో పార్శ్వం ఏమంటే ఆదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థకు గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్లాంట్లున్నాయి. వీటి నిర్మాణానికి ఆయా ప్రాంతాల్లో ఆదివాసులతోపాటు, మత్స్యకారులు, వ్యవసాయదారులు, పేదవర్గాల్ని భారీ సంఖ్యలో సామూహిక స్థానభ్రంశానికి గురిచేశారు.
అణచివేత ఒకచోట మొదలయితే అది ఒకటి రెండు సమూహాలకు పరిమితమై ఆగిపోదు. హిట్లర్ ముందు కమ్యూనిస్టుల్ని, యూదుల్ని అణిచివేయాలనుకున్నాడు. అది అతిశయించి మొత్తం తన దేశ ప్రజల్ని అణచివేయడానికి సిద్ధమయ్యాడు. అత్యాశపరులయిన కార్పొరేట్ల ఆగడాలకు బలవుతున్నది అడవుల్లో ఆదివాసులు, పట్టణాల్లో మరొకరు మాత్రమే అనుకోవడానికి వీల్లేదు. వాటి దుష్ప్రభావాలు దేశ ప్రజలు అందరి పైనా ఉంటాయి; ఉంటున్నాయి.
డానీ