Share News

George Reddy Tribute: జార్జి రెడ్డి జ్ఞాపకాలు

ABN , Publish Date - Apr 12 , 2025 | 01:56 AM

ఎంఏ విద్యార్థిగా ఉన్న సమయంలో బి.ఆర్. బాపూజీకి జార్జిరెడ్డితో ఏర్పడిన సాన్నిహిత్యం, అతని వ్యక్తిత్వం, ఆలోచనాధోరణుల ప్రభావం ఈ వ్యాసంలో వివరంగా చర్చించబడింది. జార్జి హత్య అనంతరం విడుదలైన స్మరణ సంకలనాన్ని తయారు చేయడంలో బాపూజీ పాత్ర ముఖ్యమైనది

George Reddy Tribute: జార్జి రెడ్డి జ్ఞాపకాలు

జార్జిరెడ్డితో నా పరిచయం, నేను ఎం.ఏ. మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు (1971–72లో). జార్జిని నాకు ఎవరు పరిచయం చేశారో సరిగా గుర్తు లేదు. కానీ, అతన్ని చాలా తరచుగా, ఉస్మానియా యూనివర్శిటీ, మెయిన్ లైబ్రరీలో చూసేవాణ్ణి. జార్జితో పరిచయం అయ్యాక, అతనూ, ఇంకో నలుగురమూ కలిసి, ఉస్మానియా యూనివర్శిటీ కాంపస్‌, పీజీ హాస్టల్‌లోని ఒకతని రూంలో, వారం పదిరోజులకు ఒకసారి కలుసుకునేవాళ్ళం. అది ఒక రకమైన ‘స్టడీ సర్కిల్’ లాంటిదనుకోవచ్చు. జార్జి లైబ్రరీలో చదువుతూ కనిపించినప్పుడు, ఆ సమయానికి అతను చదువుతున్న పుస్తకం గురించి, చాలా క్లుప్తంగా మాట్లాడుకున్న సందర్భాలున్నాయి. ఒకసారి ‘బకూనిన్’ పుస్తకం ఒకటి చదువుతూ కనిపించాడు. అప్పటికి నేను మార్క్సిజానికి సంబంధించిన పుస్తకాలు ఏవో కొన్ని మాత్రమే చదివాను. కానీ, ‘బకూనిన్’ గురించి విన్నాను. అతను ‘అరాచకవాద సిద్ధాంతకర్త’ అనీ, పార్టీనీ, రాజ్యాంగ యంత్రాంగాన్నీ ఒప్పుకోడనీ, మార్క్సూ ఎంగెల్సులు అతన్ని వ్యతిరేకించారనీ– ఇలా, ఏవో, ఎవరో రాసిన పుస్తకాల్లో, పైపైన చదివినట్టు గుర్తు. అదే మాట జార్జితో అంటే, ‘కాదు. బకూనిన్ కూడా కార్మిక ఉద్యమకారుడే. కాకపోతే, అతని సిద్ధాంతం వేరు’– అని ఏదో క్లుప్తంగా చెప్పాడు. నాదంతా, పైపైన చదివిన, పరిమిత జ్ఞానమే కాబట్టి, నేనేమీ వాదించలేదు. అరకొర జ్ఞానంతో అయినా, కొన్ని రకాల ప్రశ్నలు వచ్చేవి. ఒకసారి జార్జి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టిన ‘సోషలిస్ట్ యూత్ ఫోరం’ అనుకుంటా, ఆ మీటింగుకి వెళ్ళి మాట్లాడినట్టు తెలిసింది. ‘అదేమిటీ, వాళ్ళు బూర్జువాలు గదా? వాళ్ళతో కలవడం ఏమిటీ?’ అన్నాను. దానికి జార్జి, ‘అవును, వాళ్ళు బూర్జువాలే. రేపు సమయం వచ్చినప్పుడు, వాళ్ళు తుపాకులు మనవైపు తిప్పుతారు. ఇప్పుడున్న ప్రధాన శత్రువుని ఎదుర్కోవడానికి వీళ్ళకి మన అవసరం ఉంది.


అలాగే, మనకి వాళ్ళ అవసరం ఉంది’– అనే ధోరణిలో సాగింది జార్జి వివరణ. జార్జి హత్య జరిగిన రోజున (14–4– 1972), చీకటి పడుతున్న వేళ, ఆరూ, ఆరున్నర ప్రాంతంలో, ‘ఎ’ హాస్టల్ మెస్సులో, అన్నం తిని, రోజూ లాగే లైబ్రరీకి బైల్దేరాను. లైబ్రరీ మెట్లు ఎక్కుతుండగా, జార్జి, ఇంకో అతనితో ఎదురుపడ్డాడు. ‘ఎక్కడికి’ అని నేను అడిగితే, ‘ఇంజినీరింగు కాలేజీ హాస్టల్‌లో, మన కుర్రాళ్ళని, ఎన్నికల్లో అవతలి పక్షం వాళ్ళు బెదిరిస్తున్నారని తెలిసింది. అక్కడికి వెళ్తున్నా’ అన్నాడు. లైబ్రరీలో చదువుకుంటూ, ఒక గంట గడిచిందో లేదో, ఒక స్నేహితుడు పరిగెత్తుకుంటూ వచ్చి, ‘జార్జిని స్టాబ్ జేసిండ్రంట!’ అని చెప్పాడు. వెంటనే, ఇంజినీరింగు కాలేజీ వెనక వున్న ఒక హాస్టల్‌కి పరిగెత్తికెళ్తే, అక్కడ కొందరు పోలీసులున్నారు. నేల మీద రక్తం పడివుంది. జార్జి వేసుకునే రబ్బరు స్లిప్పర్స్ పడి వున్నాయి. జార్జిని గాంధీ హాస్పటల్ కి తీసుకెళ్ళారని తెలిసింది. బస్సు పట్టుకుని గాంధీ హస్పటల్‌కి వెళ్తే, ఉస్మానియా హాస్పటల్‌కి పరీక్ష కోసం తీసికెళ్ళారని చెప్పారు. అక్కణ్ణించీ ఉస్మానియా హాస్పటల్‌కి వెళ్తే, అక్కడ మొదట్లోనే, ఒక పోలీసు అవుట్ పోస్టో, మార్చ్యురీనో ఏదో ఉంది. అక్కడ, చూస్తే జార్జి మృతదేహం నేల మీద, అడుగున చాపలాంటిది కూడా లేకుండా, పడి వుంది. ద్వారం దగ్గిర, రాజకీయ నాయకుడి డ్రెస్సులో ఒకరున్నారు. అతనెవరంటే, అప్పటి కాంగ్రెస్ పార్టీలో, ఎమ్మెల్యేనో, కార్మిక శాఖామంత్రో అనుకుంటాను, టి.అంజయ్య. నేను పెద్దగా ఏడుస్తూ, అంజయ్యతో, ‘మీరంతా ఏమి చేస్తున్నారు, ఇలా జరుగుతూవుంటే...’ అని ఏదేదో అంటున్నాను. అక్కడున్న ఇతర స్టూడెంట్స్ కూడా, నినాదాలిస్తూ, ఆవేదనతో ఉన్నారు. జార్జి హత్య తరవాత, అతని మిత్రులందరమూ తరచూ, కలుసుకుంటూ వుండే వాళ్ళం. జార్జిని హత్య చేసిన తర్వాత, ప్రత్యర్ధులు, అతని సన్నిహిత అనుచరుల మీద కూడా దాడులు చేస్తూ ఉండేవారు.


అలాంటి సందర్భాలలో, జార్జికి సన్నిహితంగా ఉండిన ఒకరిద్దరు, అవతలి పక్షాన్ని ఖండిస్తూ కరపత్రాలు ఇంగ్లీషులో రాస్తూ ఉండేవారు. నేను పుస్తకాలు ఎక్కువగా చదువుతాననీ, చలం గారి గురించీ, కమ్యూనిజం గురించీ, హాస్టల్లో, వాదప్రతివాదాలు చేస్తాననీ తెలిసి, అలాంటి కరపత్రాల్ని తెలుగులోకి అనువదించమని నన్ను అడిగేవారు. 1973లో, జార్జి హత్య జరిగి ఒక ఏడాది కావస్తూండడంతో, ఒక సంస్మరణ సంచిక, తెలుగులో తేవాలని, అతని సన్నిహిత మిత్రులందరూ అనుకుని, ఆ పని నాకు అప్పగించారు. దానికోసం, జార్జి గురించి బాగా తెలిసినవాళ్ళని, వ్యాసాలు రాసి ఇవ్వమని అడిగాను. తెలుగువాళ్ళెవ్వరూ, తెలుగులో రాసి ఇవ్వడానికి చొరవ చూపలేకపోయారు. ముగ్గురు ఇతర భాషల వాళ్ళు, ఇంగ్లీషులో రాసిచ్చారు. వాటిని, నేను యథాతథంగా కాక, స్వేచ్ఛానువాదం చేశాను. మధ్య మధ్యలో శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ నించీ కొన్ని కవితా పంక్తుల్నీ, ఆ కవితా సంకలనానికి చలం గారు రాసిన ‘యోగ్యతాపత్రం’లో నించీ కొన్ని పదబంధాల్నీ, ఆ సందర్భానికి అవసరం అనుకుని, వాటిని వాడుతూ అనువదించాను. ఈ పుస్తకంలో ఒక ముందు మాటా, చిన్నవీ, పెద్దవీ కలిసి 5 వ్యాసాలూ ఉన్నాయి. ‘జార్జి వ్యక్తిత్వం’ అనే వ్యాసం, జార్జితో సన్నిహితంగా మెలిగిన ‘విజయ్ కులకర్ణి’ అనే అతను ఇంగ్లీషులో రాసిచ్చినట్టు గుర్తు. ‘నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం’ అన్న వ్యాసాన్నీ, ‘విద్యార్థి ఉద్యమాలు’ అన్న వ్యాసాన్నీ, టెక్నాలజీ కాలేజీకి చెందిన ‘భాస్కర్’ అనే అతను రాసిచ్చాడు. ‘దోపిడీ వ్యవస్థలో స్త్రీలు’ అనే వ్యాసాన్ని, ఆర్ట్స్ కాలేజీలో, లింగ్విస్టిక్స్ పాఠాలు చెప్పే మా లెక్చరర్ లక్ష్మీబాయి గారు రాశారు. ఈ పుస్తకంలో చివరిలో ఉన్న చిన్న వ్యాసం, ‘ఏది హింస?’ అన్నది నేను రాసినదే. ఆత్మరక్షణ కోసం ప్రజలు చేసే పోరాటాన్ని హింస అనకూడదనే వాదన ఉన్న ఈ వ్యాసానికి, ఎలాగోలా, అహింసావాదిగా పేరుపొందిన గాంధీని గుర్తు చెయ్యాలని, ‘మోహన్ గాంధీ’ అని ఆ వ్యాసకర్త పేరుగా పెట్టాను. ‘ముందుమాట’ కూడా నేనే రాశాను.


దాన్నిండా, ‘మహాప్రస్థానానికి’ చలం గారు రాసిన ముందుమాటలో రాసిన మాటలే, భావాలే! ముందు అట్టమీద, జార్జి ఫోటో కింద, సందర్భానికి తగినట్టు ఉండాలని, శ్రీశ్రీ, తన మిత్రుడు ‘కొంపెల్ల జనార్దనరావు’ కోసం రాసిన, నివాళి కవితలో నించీ, కొన్ని మాటలు తీసి పెట్టాను. వెనక అట్టమీద, వరవరరావు గారు జార్జిరెడ్డి మీద, ఈ పుస్తకానికి అని కాకుండా, అంతకు ముందే రాసిన కవితని వేశాను. ఇకపోతే, ప్రత్యేకంగా చెప్పవలిసింది, ఈ పుస్తకంలో, ఇచ్చిన కొటేషన్ల గురించి. శ్రీశ్రీ, చలం గార్ల మాటల్ని ఇచ్చాను. అవి ఎక్కువగా ఇవ్వడానికి ముఖ్య కారణం, నేను బియ్యేలో ఉన్నప్పటి (1967–70) నించే, చలం గారి రచనల్లోనించీ, ఆయన కమ్యూనిజం గురించి అనుకూలంగానూ, అపార్థంగానూ చెప్పిన మాటల్ని, కొన్ని కాయితాలమీద రాసుకునే వాణ్ణి. కమ్యూనిజానికి సంబంధించిన పుస్తకాలేవీ అంతకు ముందు చదవకపోయినా, చలం గారి రచనల వల్లనే, ‘కమ్యూనిజం’ గొప్ప సిద్ధాంతం అనే అభిప్రాయం బియ్యేలోనే నాకు ఏర్పడింది. ఎంత గట్టిగా అంటే, కమ్యూనిజానికి వ్యతిరేకంగా, చలం గారు రాసిన మాటల్ని కూడా పట్టించుకోనంతగా, ఇష్టపడ్డాను. తర్వాత రోజుల్లో, చలం గారికి రాసిన ఉత్తరాల్లో, కమ్యూనిజం గురించీ, జార్జి రెడ్డి హత్య గురించీ, సాయుధ పోరాటం గురించీ, చాలా ప్రస్తావనలు వచ్చాయి. అవి చదివి, చలం గారు, ‘ఇది వరకు నీ ఉత్తరాలలో, తెల్లగడ్డి పూలూ, కాంపస్ సౌందర్యమూ కనిపించేవి. ఈ మధ్య తెల్లగడ్డి పూలు పూయడం లేదా మీ కాంపస్‌లో? సాయుధ పోరాటం అంటున్నావు?’ అనే రకంగా రాశారు, కొంత విమర్శతో.

బి.ఆర్. బాపూజీ (ఏప్రిల్ 14: జార్జి రెడ్డి వర్ధంతి)

Updated Date - Apr 12 , 2025 | 01:57 AM