Share News

ద్రావిడ సంస్కృతికి దర్పణంగా ‘బర్మాకేంపు’

ABN , Publish Date - Apr 07 , 2025 | 03:57 AM

గట్టి ప్రయత్నమే చేసాను. నాదసలు జీవితమే కాదు, రాసేది సాహిత్యమే కాదు అనే స్థాయి నుంచి, ఇది కదా రాయాల్సింది అని తెలుసుకోవడానికి చాలాకాలం పట్టేసింది. అప్పుడు ఈ కథల్లోని బాలుడు సాహిత్యం లోకి రాక తప్పింది కాదు...

ద్రావిడ సంస్కృతికి దర్పణంగా ‘బర్మాకేంపు’

వేరే ప్రాంతాలకి వలస వెళ్ళి అక్కడి మనుషులతో, జీవన విధానాలతో సామరస్యం కోసం నిరంతరం ఘర్షణ పడిన జీవితాలను సాహిత్యంలో కొంతమేరకి చదివాము. కానీ విశాఖపట్నం నడిబొడ్డున ఉన్న బర్మాకేంపు కాందిశీకుల జీవితాలలో ప్రత్యేకమైనది. తన బాల్యాన్ని అక్కడ గడిపిన హరి వెంకట రమణ ఆ కాలాన్ని నమోదు చేస్తూ ‘బర్మాకేంపు కథలు’ రాశారు. వస్తురూప వైవిధ్యం రీత్యా కొత్త చేర్పునిచ్చిన ఈ కథకునితో ముఖాముఖి.

బర్మాకేంపులో తిరుగాడిన బాలుడిని సాహిత్యంలోకి తేవడానికి ఎలాంటి ప్రయత్నం చేసారు?

గట్టి ప్రయత్నమే చేసాను. నాదసలు జీవితమే కాదు, రాసేది సాహిత్యమే కాదు అనే స్థాయి నుంచి, ఇది కదా రాయాల్సింది అని తెలుసుకోవడానికి చాలాకాలం పట్టేసింది. అప్పుడు ఈ కథల్లోని బాలుడు సాహిత్యం లోకి రాక తప్పింది కాదు– ఇల్లిల్లూ తిరిగిన అనుభవాలు, అధోలోకపు జీవులతో పరిచయం వల్ల సాహిత్యంలోకి అతన్ని తీసుకురాక తప్పింది కాదు. చెప్పింది బాలుడి జీవితం నుంచే కానీ చెప్పిందంతా బర్మాకేంపులోని పెద్దల జీవితాలు, పాటలు, చావులు, నీళ్లు, రౌడీలు, ఉద్యమాలు, తగలబడిన పాకలు. అయితే విషాదాన్ని గెడ్డ అడుగున మట్టిలా ఉంచి తేటనీరు ప్రవహించినట్లుగా చిన్నపాటి హాస్యం, వ్యంగ్యంతో కథలు చెప్పే ప్రయత్నం చేసాను. రాస్తున్న ప్రతిసారీ దృశ్యప్రధానంగా ఉందా లేదా అనే కొట్టుకులాడాను. ఒకప్పుడు బర్మాకేంపుకి వస్తావా అంటేనే ఆటోవాళ్ళు భయపడి రాని ఊరు అది. అక్కడింత వైవిధ్యం గల మనుషులు, జీవితాలు వుంటాయని చెప్పడం; పిల్లాడి మనస్తత్వంతో ఎటువంటి జడ్జిమెంట్ లేకుండా కథలు చెప్పాలనుకోవడం; అన్వేషణ, ప్రశాంతత, నింపాదితనం అదే ఈ బర్మాకేంపు బాలుడిని సాహిత్యంలోకి లాక్కొచ్చింది.


మీ బాల్య జ్ఞాపకాలు రాయాలని ఎందుకు అనుకున్నారు?

బర్మాకేంపు జీవితాన్ని నమోదు చేయాలనుకున్నాను. కన్న ఊరికే కాందిశీకులైనవారి గురించి రాయాలనుకున్నాను. కానీ ఎలా చెప్పాలన్నది పెద్దసమస్య. మనసాహిత్యంలో పేదవాళ్ళు, శ్రామికులు, కిందిలోకపు జీవితాలను రాయాలంటే వాళ్లకు వున్న కష్టాలు చాలక ఇంకొన్ని కష్టాలు కల్పించడం చూసాను. నలభై గ్రామాల వూరు కంచరపాలానికి శివారు అయిన స్మశానానికి ఆవల ఇచ్చిన స్థలంలో అందమైన ద్రావిడ సంప్రదాయాన్ని నిర్మించుకున్న శ్రామికుల ఊరు గురించి రాసేను. ఉత్తరాంధ్రలో వున్న ఒక గొప్ప సంస్కృతి ఏమిటంటే ఏదుంటే అది తింటారు, తిన్నదానితో వుంటారు, పనుంటే చేస్తారు, లేదా కాలక్షేపం చేస్తారు కానీ పిరికిగా చావరు. ఎన్ని కష్టాలు వొచ్చినా ఉత్సవ వసంతం వాళ్ళ జీవితాల్లోకి ఆహ్వానిస్తారు. ఇదంతా అందరితో పంచుకోడానికే రాశాను. జ్ఞాపకాలతో, బాల్యంతో కనెక్ట్ కాని వారు ఉండరు అనే నమ్మకంతో పిల్లవాడి దృష్టికోణంతో స్వచ్ఛంగా అతనికి తెలిసింది మాత్రమే చెప్పాను.


బర్మాకేంపు మానవసంబంధాలలో మీరు గుర్తించిన పరిణామం ఏమిటి?

ఒకప్పటి సమష్టితత్త్వం ఇప్పుడు లేదు. నూకాలమ్మ తల్లి కాస్త నూకాంబిక అయ్యింది. బయటనుంచి వచ్చినవాళ్ళు కొన్న ఆ కొంచెం స్థలంలో మూడంతస్తుల ఇళ్లు కట్టారు, అద్దెలకిచ్చారు. కొత్తగా వొచ్చిన వాళ్ళకి కాందిశీకులంటే తెలీదు. ఇప్పుడక్కడ అభ్యుదయ ఉద్యమాలు చేసేవాళ్ళు లేరు. వాళ్లంతా కాలనీలకు, సౌకర్యంగా వున్న ప్రదేశాలకు తరలిపోయారు. చాలా చర్చిలు వచ్చాయి. ఒకప్పుడు ఊరందరికీ ఒక్క గుడే ఉండేది ఇప్పుడు కొత్త గుడులు వొచ్చాయి. జనం ఇప్పుడు కూడా కొట్టుకుంటున్నారు, కానీ తిరిగి కలుసుకోవటం లేదు. ఒకప్పుడు విశాలమైన ప్రదేశంలో అగ్నిగుండం తొక్కేవారు ఇప్పుడు దానికి స్థలమే లేదు. స్మశానం బయట అందమైన పెయింటింగులు వొచ్చాయి కానీ స్మశానంలోని పొగమాత్రం అందరిముక్కుల్లోకి ప్రతిరోజూ దూరుతుంది, ఇప్పటి వినిమయ సంస్కృతిలాగ. అయినా నగరంలో బ్రతకడానికొచ్చిన వాళ్ళని బర్మాకేంపు నేనున్నానని ఇంకా చేరదీస్తుంది.


ఈ కథలు రాయటం మీపై ఎలాంటి ప్రభావం చూపింది?

బర్మాకేంపు, ఒక జీవితాన్ని శ్రామికుల దృష్టితో ఎలా చూడాలో నేర్పింది. ద్రావిడ సంస్కృతి అంటే ఏంటో ప్రత్యక్షంగా చూపించింది. ప్రజలపట్ల, జీవితంపట్ల ఉండాల్సిన దృష్టి ఏంటో అర్థమయ్యేలా చెప్పింది. కొన్నిసార్లు గెలుస్తాము, చాలాసార్లు ఓడిపోతాము. ‘అయితే ఏంటి’ అన్న ధీమా ఇచ్చింది. ఈ వెలుగులో తర్వాత రాసిన ‘మాబడి కథలు’ అభ్యుదయ కుటుంబాలలో వున్న పిల్లవాడి ప్రభుత్వ పాఠశాల అనుభవాలు, మానవసంబంధాల్లో పైకి కనపడని కులం ఇతర డైనమిక్స్ ఎలా వుంటాయో చెప్పేవి. ‘పెందుర్తి.ORG కథలు’ ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణ. మధ్యతరగతి కుటుంబాలలో తెచ్చిన మార్పులను రికార్డు చేసేవి. మనుషుల్ని ప్రేమించడం, నిమ్మళత్వం, హక్కు కోసం కొట్లాడటం అనే తాత్విక భూమిక మాత్రం బర్మాకేంపుదే.

ఇంటర్వ్యూ : కె.ఎన్. మల్లీశ్వరి

ఇవి కూడా చదవండి..

Pamban Bridge: పాంబన్ వంతెనను ప్రారంభించిన మోదీ

Roller Coaster Tragedyl: మరికొన్ని నెలల్లో పెళ్లి.. సరదా ప్రాణం తీసింది

Indian Air Force: నాలుగు రోజుల్లోనే ఎయిర్ ఫోర్స్‌కు మరో పెద్ద దెబ్బ

For National News And Telugu News

Updated Date - Apr 07 , 2025 | 03:57 AM