Share News

రియా : నైతిక పతనంలో న్యూస్‌ ఛానల్స్‌

ABN , Publish Date - Mar 28 , 2025 | 02:05 AM

ఇతరుల జవాబుదారీతనాన్ని డిమాండ్‌ చేసే జర్నలిస్టులు తమ వృత్తిధర్మ నిర్వహణ విషయమై చిత్తశుద్ధితో ఆత్మ పరిశీలన చేసుకోవడం అరుదు అని పలువురు తరచు విమర్శిస్తుంటారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి గృహంలో...

రియా : నైతిక పతనంలో న్యూస్‌ ఛానల్స్‌

ఇతరుల జవాబుదారీతనాన్ని డిమాండ్‌ చేసే జర్నలిస్టులు తమ వృత్తిధర్మ నిర్వహణ విషయమై చిత్తశుద్ధితో ఆత్మ పరిశీలన చేసుకోవడం అరుదు అని పలువురు తరచు విమర్శిస్తుంటారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి గృహంలో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు లభించడంపై న్యూస్‌ టీవీ ఛానెల్స్‌ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాయి. అది సహేతుకమే. న్యాయమూర్తుల ప్రవర్తనలోని మంచి చెడులను నిర్ణయించేదెవరు? అని న్యూస్‌ యాంకర్లు తీక్షణంగా ప్రశ్నించారు. ఇది జరిగిన 24 గంటల అనంతరం సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్యకేసులో తమ దర్యాప్తును ముగించినట్టు సీబీఐ ఒక నివేదికను కోర్టుకు నివేదించింది. సుశాంత్‌ మరణానికి ఆత్మహత్యే కారణమని, ఆ ఘటనకు ఇతర అసహజ కారణాలు ఏవీ లేవని సీబీఐ స్పష్టం చేసింది. ఈ దర్యాప్తు నివేదికపై మీడియాలో ఎటువంటి గగ్గోలు లేదు. చర్చలేవీ జరగలేదు సుశాంత్‌ మరణానికి దారితీసిన కారణాలు నిజంగా ఏమిటనేవి తెలుసుకోవాలని ప్రజలు అభిలషిస్తున్నారు. సుశాంత్‌ స్నేహితురాలు రియా చక్రవర్తి శీల హననానికి పాల్పడినవారు ‘నేను తప్పు చేశాను’ అని ఒప్పుకున్నారా లేదా అనే విషయాన్ని కూడా ప్రజలు తెలుసుకోవలసి ఉన్నది.


అయితే ఇవేమీ జరగలేదు. ప్రతిభావంతుడు అయిన బాలీవుడ్‌ నటుడు జూన్‌ 2020లో ముంబైలోని తన గృహంలో మరణించినట్టు పోలీసులు కనుగొన్నారు. ఈ యువ నటుడి మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. సుశాంత్‌ మరణంలో యువ నటి రియా చక్రవర్తి ప్రమేయముండవచ్చని ఆరోపణలు వచ్చాయి. సుశాంత్‌ మరణంపై తలెత్తిన వివాదానికి ఆమే కేంద్రమయింది. ఇది ఆమెకు ఊహించని పరిణామం. వారాలు, నెలల తరబడి రియాను, ఆమె కుటుంబాన్ని మీడియా వెంటాడింది. పోలీసు దర్యాప్తును ఎదుర్కొన్నారు. సుశాంత్‌ మరణంలో రియా, ఆమె కుటుంబం ప్రమేయం ఉండి ఉంటుందని న్యూస్‌ టీవీ ఘోషించింది. తొలుత ప్రైమ్‌ టైమ్‌ టీవీ కథనాలు సుశాంత్‌ ఆత్మహత్య చేసుకునేలా అతడిని రియా, ఆమె కుటుంబమే ప్రేరేపించి ఉంటుందని సూచించాయి. ఆ తరువాత సుశాంత్‌ ఆత్మహత్య చేసుకోలేదని, హత్యకు గురయ్యాడని, అందుకు జరిగిన కుట్రలో రియా భాగస్వామి అని అభియోగాలు మోపాయి. సుశాంత్‌ ఆస్తులను కైవశం చేసుకునేందుకు రియా కుట్ర పూరితంగా ప్రయత్నించిందని ఆరోపించిన న్యూస్‌ టీవీ ఒక అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముఠాలో భాగస్వామిగా ఉందని కూడా ఆమెను చిత్రించాయి. ఇలా ఆ యువ నటి పట్ల ద్వేషపూరితంగా ఎడతెగని దుష్ప్రచారం చేశాయి. అంతేనా? సుశాంత్‌కు చేతబడి చేసిందని కూడా విమర్శించాయి. రియాను ‘మంత్రగత్తె’ అని పేర్కొంటూ ఆమెను తీవ్రంగా దూషించాయి. సామాజిక మాధ్యమాల వైఖరి మరింత ఘోరంగా, భయానకంగా ఉన్నది. ‘సుశాంత్‌కు న్యాయం జరగాలి’ అనే ఉద్యమాన్ని ఆరంభించాయి. సుశాంత్‌ విషాద మరణానికి రియానే కారకురాలు అని గొంతుచించుకున్నాయి. ఈ ఆరోపణలు ఏవీ అప్పుడూ ఇప్పుడూ రుజువు కానేలేదు. అవి పూర్తిగా నిరాధారమైనవి. అయినప్పటికీ ఆమె ఒక నెలరోజుల పాటు జైలు వాసం చేయవలసివచ్చింది. న్యూస్‌ టీవీ తీరుతెన్నుల ఫలితంగానే ఈ శోచనీయమైన పరిణామాలు సంభవించాయి. రియాపై విమర్శలు, ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని ఇప్పుడు రుజువయింది. మరి ఐదు సంవత్సరాల క్రితం అప్పుడే ప్రారంభమైన వృత్తి జీవితం దాదాపుగా అంతమై పోయింది.


ఉన్నత విద్యాభ్యాసానికి విదేశాలకు వెళ్లదలుచుకున్న ఆమె సోదరుడి స్వప్నాలను నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో దర్యాప్తు ఛిద్రం చేసింది. రియా తండ్రి సైనిక వైద్యుడు. పాతికేళ్లకు పైగా మన భౌగోళిక సరిహద్దుల రక్షకులకు ఆయన వైద్య సేవలు అందించారు. అయినా మీడియాలోని తోడేళ్ల గుంపు ఆయన్నీ వదలలేదు. తమ ఛానెల్‌కు టీఆర్‌పీ రేట్లను పెంచడమే లక్ష్యంగా పనిచేసే న్యూస్‌ యాంకర్ల మూలంగా ఒక మధ్యతరగతి వృత్తి నిఫుణుల కుటుంబం సర్వనాశనమయింది. ఇదంతా కోవిడ్‌ విలయంలో చోటుచేసుకున్న మరో విషాదం. దేశమంతా లాక్‌డౌన్‌లో మగ్గిపోయిన కాలమది. సామాజిక దూరం నిబంధనలు పాటించేందుకు ప్రజలు ఇళ్లలోనే ఉండిపోయిన రోజులవి. అటువంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితిలో తీసుకోవలిసిన జాగ్రత్తలపై ప్రజలకు మార్గదర్శకత్వం వహించాల్పిన మీడియా ‘ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిజం’ పేరిట పూర్తిగా అవాంఛనీయమైన వార్తలతో ప్రజలను తప్పుడు రీతుల్లో ఉద్దీపింపచేయడం జరిగింది. రియా చక్రవర్తి దురవస్థ నొక్కి చెప్పుతున్నదేమిటి? స్పర్థాత్మక మీడియా జగత్తులో ఒకటి రెండు మినహాయింపులతో న్యూస్‌ నెట్‌వర్క్స్‌ అన్నీ తమ నైతిక దిక్సూచిని కోల్పోయాయనే కదూ! 1990ల నడిమి సంవత్సరాలలో ఎంతో ఆశాజనకంగా ఆరంభమైన ప్రైవేట్‌ న్యూస్‌ టీవీ విప్లవాన్ని, టెలివిజన్‌ రేటింగ్‌ పాయింట్స్‌లో ప్రథమ స్థానంలో ఉండి తీరాలనే ఆరాటంతో అనైతిక మార్గంలో ముందుకు సాగిన మీడియా సంస్థలు పూర్తిగా వ్యర్థపరిచాయి. ఆ విప్లవం నిరర్థకమైపోయింది. అర్థవంతంగా జరగవలసిన వార్తా నివేదన అనవసర సంచలనాత్మకత సంతరించుకోవడం సాధారణమైపోయింది. అసలు ఘటనలపై కాకుండా ఏవో ఘోషలు, గందరగోళాలపైకి దృష్టి మళ్లేలా చేయడంలో న్యూస్‌ టీవీ ఆరితేరిపోయింది. దుష్ట స్వభావాలు, స్త్రీ ద్వేషం వలలో రియా చిక్కుకుపోయింది. ఒక స్వతంత్ర మహిళ, తన సొంత పేరు ప్రతిష్ఠలకు బాధితురాలు అయింది. లోకులను హీరోలు, విలన్లుగా విభజించిన మీడియా జగత్తు రియాను ఒక వగలాడి, లేదా దుష్టురాలుగా పరిగణించింది. ‘సుశాంత్‌ ప్రభవిస్తున్న నటుడు. ఉజ్వల భవిష్యత్తు ఉన్నవాడు. రియాకు సహచరుడు. అమాయకుడు అయిన ఆ యువ నటుడిని ఆ ‘స్వార్థ స్వభావి’ తన సుఖ సౌఖ్యాలు, వృత్తిగత ఎదుగుదలకు తెలివిగా ఉపయోగించుకుంది’. వార్తల ముసుగులో ప్రసారితమవుతున్న టీవీ సీరియల్స్‌కు ఇంతకంటే మంచి ఇతివృత్తం మరొకటి ఉంటుందా? ఇక ఇప్పుడు అసలు ప్రశ్నకు వస్తాను: రియాను దూషించిన, ఆమె గౌరవాన్ని మంటగలిపిన వారిని తమ దుర్మార్గానికి జవాబుదారీలుగా చేయడం ఎప్పటికైనా జరుగుతుందా? రియా ఉదంతం కేవలం ఒక వ్యక్తి పరువుకు నష్టం కలిగించిన వ్యవహారం మాత్రమే కాదు. జర్నలిస్టులు అందరూ వార్తారచన ప్రక్రియలో పొరపాట్లు చేసే అవకాశమున్నది. తప్పుడు సమాచారమందించినందుకు పాత్రికేయులు తరచు లేదా అప్పుడప్పుడు క్షమాపణలు చెప్పుతుండడం కద్దు. అయితే రియా కేసు భిన్నమైది. అది అధర్మ పాత్రికేయానికి ఒక తిరుగులేని నిదర్శనం.


సుశాంత్‌ ఆత్మహత్య విషయంలో తాను చెప్పవలసిన విషయాలను వెల్లడించేందుకు అవకాశం లభించని ఒక నిస్సహాయ యువతి జీవితాన్ని గౌరవాన్ని మంటగలిపేందుకు బుద్ధిపూర్వకంగా చేసిన ప్రయత్నమది. ఆ క్లిష్ట కాలంలో ఆమె గోడు ఎవరు విన్నారు? ఆగస్టు 2020లో కన్నీటి పర్యంతమవుతూనే విరాగినిలా నిర్లిప్తంగా ఉండిపోయిన రియాను నేను ఇంటర్వ్యూ చేశాను. ఆమెతో మాట్లాడడానికి, ఆమె చెప్పేదాన్ని స్థిమితంగా, సానుభూతితో వినడానికి ప్రప్రథమంగా జరిగిన ప్రయత్నమది. ఆమెతో సంభాషించడం ద్వారా ఒక పాత్రికేయుడుగా నా విధ్యుక్త ధర్మాన్ని నిర్వర్తించాను. అయితే రియాను ఇంటర్వ్యూ చేసినందుకు సామాజిక మాధ్యమాలలో నాపై నిరసన వెల్లువెత్తింది. నన్ను పదే పదే విమర్శించారు. దూషించారు. రియాను కాపాడేందుకు నేను ప్రయత్నిస్తున్నట్టు దుయ్యబట్టారు. ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి. రియా విషయంలో నా వైఖరి పూర్తిగా కాకపోయినప్పటికీ సరైనదేనని రుజువయింది. రియా తీవ్ర వ్యాకులత నెదుర్కొన్నది. అయితే ధైర్యంగా నిలబడింది. ఆమె నిజాయితీ నిరూపితమయింది. ఆమె జీవితంలో ఆశాజ్యోతి కొడిగట్టలేదు.. అయితే రియా ఎదుర్కొన్న భయానక పరిస్థితులు ముగింపునకు వచ్చేది ఆమెను ఆ కష్టాల పాలుచేసినవారు తమ దుర్మార్గానికి భారీ మూల్యం చెల్లించేలా చేసినప్పుడే అని నిక్కచ్చిగా చెప్పుతున్నాను. న్యూస్ టీవీ విశ్వసనీయతను, మీడియాపై ప్రజల నమ్మకాన్ని పునరుద్ధరించాలంటే రియాకు ఎదురైన అనుభవాలు పునరావృతం కాకూడదు. రియా తన జీవితంలో ఐదేళ్ల విలువైన కాలాన్ని కోల్పోయింది. కోల్పోయిన గౌరవాన్ని పొందేందుకు ఆమె పరిపూర్ణంగా అర్హురాలు. రియాకు బేషరతు క్షమాపణలు ఆమె గౌరవ పునరుద్ధరణకు శుభారంభం కాగలదు.

రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌)

ఇవి కూడా చదవండి:

తృటిలో తప్పిన ప్రమాదం

Revanth Reddy: డిన్నర్‌కి పిలిచి AK47తో లేపేశాడు.. కేటీఆర్‌పై సీఎం సెటైర్లు..

Bhuma Akhila Priya: సాక్షి ఆఫీసు వద్ద భూమా అఖిలప్రియ ధర్నా

Updated Date - Mar 28 , 2025 | 02:06 AM