మెరుపు వచనకారుడు
ABN , Publish Date - Mar 31 , 2025 | 06:24 AM
ఇందులో విశేషం ఏమీ లేదు. ఏళ్ల తరబడి సమీక్షలు, వ్యాఖ్యానాలు, వ్యాసాలూ చూస్తూనే వున్నాం. అవి ఎక్కువగా ఒక మూసలో వుంటాయి. పాత సంప్రదాయాన్ని పట్టుకు వేలాడుతుంటాయి. కొన్ని అకడెమిక్‌గా, కొన్ని పడికట్టు పదాలతో, మరికొన్ని మొక్కుబడిగా...

ఒక కవిని ఎలా పరిచయం చేయాలి? ఒక కథ మీద ఎలా కామెంట్ చేయాలి? ఒక సినిమాని ఎలా సమీక్షించాలి? సాహిత్యంలోనో, సంగీతంలోనో, వ్యాపారం లోనో ప్రసిద్ధుడయిన ఒకరి గురించి చెప్పడం ఎలా?
ఇందులో విశేషం ఏమీ లేదు. ఏళ్ల తరబడి సమీక్షలు, వ్యాఖ్యానాలు, వ్యాసాలూ చూస్తూనే వున్నాం. అవి ఎక్కువగా ఒక మూసలో వుంటాయి. పాత సంప్రదాయాన్ని పట్టుకు వేలాడుతుంటాయి. కొన్ని అకడెమిక్‌గా, కొన్ని పడికట్టు పదాలతో, మరికొన్ని మొక్కుబడిగా వుంటాయి. ఆ mould ని విజయవంతంగా బ్రేక్ చేసినవాడు తాడి ప్రకాష్.
జర్నలిస్టుగా అనుభవం, సాహిత్యాభిలాష, ఆధునికమైన చూపు – సంప్రదాయాన్ని బద్దలు చేయగల శక్తిని ప్రకాష్‌కి యిచ్చాయి. తెలుగులో బాగా రాయగలిగేవాళ్లు చాలామంది వున్నారు. సమర్థవంతంగా రాయగలిగేవాళ్లూ అనేకమంది వున్నారు. కానీ తాడి ప్రకాష్‌లా ఒక బ్రేక్ త్రూ సాధించినవాళ్లు అతికొద్దిమంది. ప్రకాష్ వాక్యాలు చాలా తేలిగ్గా రాసినట్టు పైకి కనిపించినా, ఆ నిర్మాణం సౌమ్యంగా, హుందాగా సాగుతూనే, చటుక్కున దూకుడుగా ఒక మాట అనడం వెనక ఒక కచ్చితమైన వ్యూహం వుంటుంది. పాజిటివ్‌గా రాసినా, నెగెటివ్‌గా రాసినా, కొన్నిచోట్ల కొంత ‘అతి’గా అనిపించినా, ఆయన నిజాయితీ అక్షరాల్లో మెరుస్తూనే వుంటుంది.
‘‘పొగడ పూల పరిమళమే వగరు జ్ఞాపకాల నవ్వు’’ అంటూ విమల కవిత్వం గురించిన ప్రకాష్ సమీక్ష విలువైనది. శ్రీశ్రీ అంతిమయాత్రపై ప్రకాష్ ఆర్టికల్ ఎప్పటికీ మరిచిపోలేం. ఐస్ బ్లాక్ మీద అచేతనంగా వున్న మహాకవి గురించి రాస్తూ, ‘‘హిమాలయాన్ని తలకింద దిండుగా పెట్టుకుని నిద్రపోతున్న అగ్నిపర్వతంలా వున్నాడు శ్రీశ్రీ’’ అన్నాడు ప్రకాష్. మహాకవి అంతిమ వీడ్కోలు ఆర్టికల్‌కి ప్రకాష్ పెట్టిన హెడ్డింగ్: ‘శ్రీశ్రీకి అశ్రుదీపాల అల్విదా’.
‘మాండలికంలో మొగలాయి’ నామిని అన్నా, ‘సట్లెజ్ కెరటాలు పిలిచాయా బంగోరే!’ అన్నా, ‘ఒక బెల్జియం అద్దం’ రాంభట్ల కృష్ణమూర్తి అన్నా – అది ప్రకాష్ మార్క్ రచన. కమ్యూనిస్టు భావజాలం వున్నవాడే అయినా, ‘‘కమ్యూ నిస్టు పార్టీలకు భవనాలు మాత్రమే మిగిలి, జనాలు దూరం అవుతున్న కాలం ఇది’’ అని రాస్తాడు. నండూరి రామ్మోహన్ రావు, ఎ.బి.కె. ప్రసాద్, కె.ఎన్.వై పతంజలి లాంటి గొప్పవాళ్లతో కలిసి పనిచేసిన అనుభవాలు రాసినా, తనని తాను ప్రొజెక్ట్ చేసుకోడు.
గోరటి వెంకన్న గురించి రాస్తూ, ‘‘హృదయాన్ని పాటతో నింపేవాడి గ్లాసు మాత్రం నింపగల నిమిత్తమాత్రుణ్ణి నేను’’ అంటాడు. ప్రొఫెసర్ సాయిబాబా గురించి రాస్తూ, ‘‘చదువూసంధ్యా లేని చవట సన్నాసులు రాజ్యమేలుతున్నపుడు, జ్ఞానకాంతులీనే ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ జైల్లో వుండటమే న్యాయం కదా’’ అంటాడు. జర్నలిజం, కవిత్వం, సాహిత్యం, సంగీతం, సినిమా, రాజకీయాలు, చరిత్ర.. దేని గురించి అయినా హృదయాన్ని హత్తుకునేలా చివరి వాక్యం దాకా చదివించేలా రాయగలగడం సామాన్య విషయం కాదు. సున్నితమైన, కవితాత్మకమైన ప్రకాష్ వచనం చదువుకోవడం ఒక మంచి అనుభవం. అందులోని వ్యంగ్యమూ, ఎకసెక్కమూ గిలిగింతలు పెడతాయి.
‘ఉదాత్తమైన అక్రమ ప్రేమ’ అనే శీర్షికతో జాతీయ, అంతర్జాతీయ సినిమాల గురించి ఒక సిరీస్ రాశాడు. భూమిక, పరోమా, ఆస్తా, సమ్మర్ ఆఫ్ 42, శోభ– బాలూ మహేంద్ర ఎఫైర్ గురించిన వ్యాసాలు చదివి తీరవలసినవి. పెళ్లయిన స్త్రీ మరొకతనితో ప్రేమలో పడడం అనేది వీటి థీమ్. ఇందులో భాగంగానే నటి ఇంగ్రిడ్ బెర్గ్‌మన్ భర్త, గ్రేట్ ఇటాలియన్ డైరెక్టర్ రోబర్టో రోసాలిని, బెంగాలీ బ్యూటీ సోనాలి ప్రేమకథ తెలుగులో మొదటిసారి రాసింది ప్రకాష్ మాత్రమే. అలాగే, చేగువేరాని పాతిపెట్టిన ప్రాంతాన్ని 30ఏళ్ల తర్వాత డిస్కవర్ చేసిన ప్రఖ్యాత అమెరికన్ జర్నలిస్టు జాన్ లీ ఆండర్సన్ గురించి మొదటిసారి మనకి తెలియజేసిన వాడూ ఈ ఉత్తమ జర్నలిస్టే.
తెలుగు సాహిత్యంలో కె.ఎన్.వై పతంజలి ప్రాధాన్యం గురించీ, తెలుగు కళకి ఆర్టిస్ట్ మోహన్ కాంట్రిబ్యూషన్ గురించీ, తెలుగు సాహిత్య విమర్శని పదునుపెట్టిన రాచమల్లు రామచంద్రారెడ్డి కృషి గురించీ ప్రకాష్ వ్యాసాలు మళ్లీమళ్లీ చదువుకునేలా వుంటాయి. సొలోమోన్ విజయ్ కుమార్ ‘మునికాంత పల్లె కథలు’ చదివి, ‘‘ఏం రాశావ్ రా నా కొడకా’’ అని ప్రకాష్ దురుసుగా అనడం సంప్రదాయ పద్ధతిని బద్దలుకొట్టడానికే. ‘నల్ల వంతెన’ కథలు రాసిన నాగేంద్ర కాశీని, ‘మైరావణ’ రాసిన యువ రచయిత ప్రసాద్ సూరినీ భుజంతట్టి ప్రోత్సహించడం ప్రకాష్ ఎంతో బాధ్యతతో చేసిన పని. ‘సాహిత్యంలో స్త్రీ సాహసం’ అంటూ ఇప్పటి రచయిత్రుల గురించిన వ్యాసం – ప్రకాష్ ఇప్పటికీ విస్తృతంగా చదువుతున్నాడనడానికి ఒక నిదర్శనం.
‘అనుభూతి గీతమై విరబూసిన వెన్నెల’ అంటూ ఖదీర్ బాబు జ్ఞాపకాలకు ప్రకాష్ రాసిన ముందు మాట దాదాపు కవిత్వమే. చేరా, మద్దుకూరి చంద్రం, వేగుంట మోహన్ ప్రసాద్ గురించి రాసినా, అరుణ్ సాగర్, కలేకూరి ప్రసాద్, పైడి తెరేష్ బాబు గురించి రాసినా ఆప్యాయత నిండిన ఆ అక్షరాల్లో ఒక ప్రత్యేక ఆకర్షణ వుంటుంది. విశ్వనాథ, పెద్దిభొట్ల, బంగోరె, కేశవరెడ్డి, గుడిహాళం రఘునాథం లాంటి మహానుభావుల గురించి ప్రకాష్ గాఢమైన అనుభూతితో, ఒక ఉద్వేగంతో రాసే మాటలు కంటతడి పెట్టిస్తాయి.
జర్నలిస్టుగా ప్రకాష్ 40 ఏళ్ల అనుభవాలూ, జ్ఞాపకాలతో మూడేళ్ల క్రితం వచ్చిన ‘ఏలూరురోడ్ ఆత్మగీతం’ పుస్తకం జనాదరణ పొందింది. ప్రకాష్ వ్యాసాలతో రెండో పుస్తకం ‘ఖైరతాబాద్ చౌరస్తా’ త్వరలోనే రాబోతోంది. సొంత గొంతు వున్న గొప్ప రచయిత కె.ఎన్.వై పతంజలి లిటరరీ అవార్డును ఇటీవల ప్రకాష్ స్వీకరించిన సందర్భంగా ‘‘ప్రకాష్ ఈ కాలపు పతంజలి’’ అన్నారొక సాహితీవేత్త. నిజమేనేమో!
కూనపరాజు కుమార్
99899 99599
ఈ వార్తలు కూడా చదవండి...
Ugadi Wishes 2025: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్..
Ugadi Awards 2025: ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే: సీఎం చంద్రబాబు..
TDP Nara Lokesh: సీనియర్లకు గౌరవం.. జూనియర్లకు ప్రమోషన్
For More AP News and Telugu News