ఒక రాయి యొక్క మోనోలాగ్ హంపీ కవితలు
ABN , Publish Date - Mar 31 , 2025 | 06:13 AM
రణగొణ ధ్వనుల నగరం నుండి మౌనంగా తపస్సు చేసుకునే రాళ్ళ మధ్య వచ్చి పడ్డాను. చిరుగాలి ఒక్కతే వాకబు చేస్తూ పోతోంది....

రణగొణ ధ్వనుల నగరం నుండి
మౌనంగా తపస్సు చేసుకునే
రాళ్ళ మధ్య వచ్చి పడ్డాను.
చిరుగాలి ఒక్కతే
వాకబు చేస్తూ పోతోంది.
ఎండావానా దోబూచులాడుకుంటూ
వాదించుకుంటున్నాయి.
హంపీ మీద ఆకాశం
కదలని కొండలా చూస్తోంది.
ఎక్కడెక్కడో ఎగిరి, ఇప్పుడే
రాయి మీద దాహంగా
పిట్ట ఒకటి వాలింది, నాలాగే
దిగంతాల అంచుల దాకా
చేతులు చాచిన ఆకాశాన్ని
చేతులు చాచి అందుకుంటున్న
కొండరాళ్ళు.
బహుశా
ఏనాటిదో వాటి
పురాతన సంభాషణ.
భాష తెలీదనే బాధ లేదు.
హృదయం రిక్కించాను.
ఆడుకుంటూ ఆడుకుంటూ పిల్లలు
లక్కపిడతలు వదిలేసిపోయినట్టు
కొండల మీద నిలబడి బండలు.
చేతిలో ఐస్‌క్రీమ్‌లా
కళ్ళలోనుంచి ఆశ్చర్యం కారిపోతూ
నోరెళ్ళబెట్టి చూస్తున్నారు పిల్లలు.
పెద్దల కళ్ళల్లో నిండి పొంగిపోతూ
ఇంకా పెద్ద అచ్చెరువుచెరువులు.
నేను పోల్చుకోగలను -
కళ్ళల్లో బెంగచెట్టు వేర్లు దిగేసినవాళ్ళను
చూపుల పూలు ఎక్కడో రాలిపడి
మనిషిలో మనిషి ఎక్కడో తప్పిపడి
రాతి రథాన్ని చూస్తూ
వేర్లు భూమిలో పాతేసుకున్న
రాతిచెట్టులా
స్థాణువై నిలబడిన నన్నూ
ఎవరో పోల్చకుంటున్నట్టున్నారు.
తనివితీరని ఆత్మల్ని ఒలిచి
ఈ బండరాళ్ళ మీద ఆరేసి పోయేది
ఎందరో కదా
కవితలో ఇమడని పదబంధలా
సగం చెక్కి వదిలేసిన
రాతిస్తంభం మీద
సగం రాసేసిన కవితని మడతేసి
నిరామయంగా కూర్చున్నా.
ఊహల లోపలలోపలే
పూర్తిగా చెక్కిన కవితాకట్టడంలో
చెక్కీచెక్కని రాతిస్తంభాన్ని కూడా
కవితని నిలబెట్టే పదబంధంగా
కూర్చి వెళుతున్నా.
గాలి అంబారీ ఎక్కి
మదపుటేనుగులతో నడిచి
ఊహలఉలి పట్టుకొని
ఆ మహాశిల్పుల వెనుక
ఆశ్చర్యార్థకమై నిలబడుకొని
ధాన్యాగారంలో ఒక ధాన్యం మూటనై
నాట్యమండపాల్లో మార్మోగిన పాటనై
నర్తకీమణుల నడుమొంపునై
రాశులు పోసిన రత్నాల సొంపునై
స్నానాల మందిరాన
రాణిగారు పూసుకునే పరిమళ ద్రవ్యమై
రాయల వీరగాథల గేయాల శ్రావ్యమై
హంపీ వనక్షేత్రంలో
పచ్చదనపు పక్షినై
పి. శ్రీనివాస్ గౌడ్
& 99494 29449