ఈ కవి యుద్ధభూమిలో సంచరించే పిల్లాడు
ABN , Publish Date - Mar 31 , 2025 | 06:16 AM
ప్రపంచంలోని ఎన్నో చారిత్రక యుద్ధాలు మొదలు నేటి కశ్మీర్ అంతర్యుద్ధం, మణిపూర్ అల్లర్లు, కగార్ అణచివేతలని చూసినప్పుడు రాజ్యం అధికార దుర్వినియోగం, సైనిక ప్రాబల్యం వంటివి స్పష్టంగా తెలిసివస్తాయి....

ప్రపంచంలోని ఎన్నో చారిత్రక యుద్ధాలు మొదలు నేటి కశ్మీర్ అంతర్యుద్ధం, మణిపూర్ అల్లర్లు, కగార్ అణచివేతలని చూసినప్పుడు రాజ్యం అధికార దుర్వినియోగం, సైనిక ప్రాబల్యం వంటివి స్పష్టంగా తెలిసివస్తాయి. ఈ కవిత కూడా పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాష్టీకాల్ని తీవ్రంగా నిరసిస్తూ రాసినది. శైశవంలోనే ముగిసిపోతున్న జీవితాలకు గాజాలో దొరికే పిల్లల అస్థిపంజరాలే సాక్ష్యం అంటాడు కవి. వాటినన్నా కౌగిలించుకోండని అసహన పడతాడు. అందులో అధిక్షేపంతో కూడిన గొప్ప వాస్తవిక సంయమనం కనిపిస్తుంది.
యుద్ధ ప్రాంతంలో అమ్మలు పెట్టే తీయటి ముద్దుల ఆనవాళ్ళు లేవని, పిల్లల నోటి దగ్గరి రొట్టెలను బాంబులు లాక్కుంటున్నాయనీ కవి ఒక హృదయవిదారకతను మనకి సాదృశ్యం చేస్తాడు. తీవ్రమైన వేదన, భరింపరాని క్షోభల స్థిర రూపం ఎవ్వరినైనా కలచి వేస్తుంది. కానీ ఆ కలవరం వెనుక గల నిస్సహాయత, దుఃఖం, దైన్యత కవిత్వపాదాల్లోకి జొరబడినప్పుడు వాటి పదును చాలాకాలం మనని ఛిద్రం చేస్తుంది. ఆ రకంగా ఒక విసురు ఉన్న కవిత. విల్ఫ్రెడ్ ఓవెన్, డబ్ల్యూ.బి. యీట్స్ వంటి పాశ్చాత్యులతో బాటు తిలక్, శివసాగర్, వరవరరావు, ఎండ్లూరి సుధాకర్ లాంటి తెలుగు కవుల కవితల్లో కూడా అవకాశవాద యుద్ధాలలో ఉండే స్వార్థం, క్రౌర్యం, విధ్వంసాల గురించి మనం చదివి ఉన్నాం. చరణ్ కవిత్వ నిర్మాణంలో కాల్పనిక అతిరేకత లేదు. స్మృతుల తలపోత, ప్రతిఫలం కోరని మాతృ త్యాగం, ఉపమానాలుగా ఉన్నాయి.
తల్లి స్పర్శ, లాలనలతో ముడిపడి ఉన్న పిల్లల భావోద్వేగాలతోనే యుద్ధాన్ని వ్యతిరేకించడం ఈ కవితలోని అంతర్ధ్వని. తల్లీబిడ్డల వాచక వ్యక్తీకరణల వెనుక దేశం, ఆ దేశ ప్రజల అస్థిరత, అనేక విషాద శకలాలుగా ప్రతిబింబిస్తుంది. అపరాధ భావనే లేని ఇజ్రాయెల్, అమెరికా వంటి దేశాల కపట, దోపిడీ మనస్తత్వాలు బోధపడతాయి. అందుకే ఈ కవితలో అంతర్లీనంగా ఒక చారిత్రక ఎరుక ఉంది. అది రాజకీయంగా కాల పరీక్షకు నిలబడుతుంది. మెత్తదనం, అమాయకత్వం, సంవేదనలతోనే శత్రువులపై చరణ్ తిరగబడుతున్నాడు. అతని ప్రతిఘటనలో ఒక లేలేత పసిదనంతో కూడిన హేతువు కందని మానవ ప్రేమ ఉంది. దాని సహజమైన మెరుపు వలనే నా ఇది ప్రియపద్యం.
శ్రీరామ్ పుప్పాల
99634 82597