ప్రతి మనిషీ ఒక్క పుస్తకమైనా రాయాలి
ABN , Publish Date - Mar 31 , 2025 | 06:29 AM
హిందీ కవి, రచయిత వినోద్ కుమార్ శుక్లా 2024 సంవత్సరానికి జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికయ్యారు. 1937లో జన్మించిన శుక్లా మొదటి కవితా సంపుటి ‘లగ్‌భగ్ జైహింద్’ 1971లో ప్రచురితమైంది...

హిందీ కవి, రచయిత వినోద్ కుమార్ శుక్లా 2024 సంవత్సరానికి జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికయ్యారు. 1937లో జన్మించిన శుక్లా మొదటి కవితా సంపుటి ‘లగ్‌భగ్ జైహింద్’ 1971లో ప్రచురితమైంది. ‘నౌకర్ కి కమీజ్’, ‘దీవార్ మే ఏక్ కిడ్‌కీ రహ్తీ థీ’, ‘ఖిలేగా తో దేఖేంగే’ మొదలైనవి ప్రసిద్ధ నవలలు. జ్ఞానపీఠ్‌కు ఎంపికైన సందర్భంగా వేర్వేరు ఇంటర్వ్యూలలో ఆయన మాటల్లోంచి కొన్నింటిని ఏరి ఇక్కడ ప్రచురిస్తున్నాం.
– వివిధ
రచనలో సవాళ్ళు
పిల్లలు ఆడుతూ పెరిగినట్టు నేను రాస్తూ పెరిగాను. పదిహేను పదహారేళ్ళ వయసు నుంచీ రాస్తూనే ఉన్నాను. ఐనా రచన మీద పట్టు రాలేదు. మొదట్లో ఎదురైన సవాళ్లే ఇప్పుడూ ఎదురవుతాయి. నా దృష్టిలో రాయటం అంటే ఎప్పుడూ రాయటానికి చేసే ప్రయత్నమే.
కవిత పుట్టుక
రాయకముందే ప్రతి కవితా వాస్తవంలో దాగి ఉంటుంది. సమయం వచ్చినప్పుడే దాని సమక్షం మనకు తెలుస్తుంది. పచ్చటి చెట్లలో కలిసిపోయే రామచిలక లాగ. అది ఎగిరిపోయినా దాని సమక్షం మన లోంచి మాయం కాదు. అది మన అనుభవంలో కలిసిపోతుంది. మన జ్ఞాపకంలో భాగమవుతుంది. ఆ జ్ఞాపకం నుంచి మరికొన్ని జ్ఞాపకాలు జన్మిస్తాయి.
ఆఖరు పంక్తి
కవిత ఏ పంక్తితో ముగిసేదీ ఆ కవితకే తెలుస్తుంది. ఒక్కోసారి నేను ఒకే కవితను జీవితమంతా తిరగ రాయగలననిపిస్తుంది.
వచనం – కవిత్వం
నేను ఎక్కువ కాలం పాటు ఏ కవితా రాయలేనప్పుడే వచనం జోలికి వెళ్తాను. అలా వచనం రాస్తూపోతే మధ్యలో కవిత్వం ఎదురవుతుంది. వచనం నాకొక తవ్వకం పనిముట్టు. ఆలోచనల లోతుల్లోకి తవ్వు కుంటూ పోయాకనే కవిత్వం దొరుకుతుంది.
కవితలు కథలుగా, కథలు కవితలుగా...
నా కవితలేమీ కథలుగా మారలేదు. కానీ ఒక్కోసారి కథ రాస్తున్నప్పుడు కొన్ని పదాలు, వాక్యాలు–– పూర్తిగా ఏర్పడో ఏర్పడకుండానో–– ఎక్కడి నుంచో ఊడిపడతాయి. అప్పుడు వెంటనే వెళ్ళి కవిత రాయబుద్ధవుతుంది. వచన రచనలో ఒక్కోసారి కవిత్వం పుట్టడం సహజమే. దాన్ని ఒక అడ్డుగా ఏమీ భావించనక్కర్లేదు. సృజనలో అదొక భాగం. మనలో కవిత పుట్టి అది అక్షరంగా మారడమనే ప్రక్రియ ఒక క్రమపద్ధతిని పాటించదు. ప్రతి కవితా తన పద్ధతిని తనే ఎంచుకుంటుంది. కవిత ముగియగానే ఆ పద్ధతీ ముగిసిపోతుంది.
మనుషుల ఆధారంగా పాత్రల్ని కల్పించేటప్పుడు
వాళ్ళ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. రాజకీయ నేతల కార్టూన్లు వేసేవాళ్ళు వాళ్ళని అడిగి వేయరు కదా. కొన్ని అడిగి చేయలేం. మనకి మంచో చెడో జరిగినప్పుడు ఆ అనుభవం గురించి రాసుకుంటాం. మన అనుభవం మనం రాసుకుంటున్నప్పుడు అందుకు కారణమైన వాళ్ళూ అందులోకి వస్తారు. అన్నిసార్లూ అనుమతి అడగలేం.
ప్రేరణ
మొదట ఒక సంఘటన గురించో ఆలోచన గురించో రాయాలనిపించి మనల్ని మనమే ప్రేరేపించుకుంటాం. రాసేదాక ఆ సంఘటన, ఆలోచనల పూర్తి స్వభావం ఏమిటో మనకే తెలియదు. రాయటం మొదలుపెట్టిన తర్వాత ఆ రాస్తున్నదే మనలో కొత్త ఆలోచనలను పుట్టిస్తూ మనల్ని ముందుకి నడిపిస్తుంది.
పిల్లల కోసం ఎలాంటి భాషలో రాస్తారు?
పిల్లల కోసం రాస్తున్నప్పుడు వాళ్ళ వయసును దృష్టిలో ఉంచుకుంటాను. కానీ నేను వాడే భాష మాత్రం పెద్దవాళ్ల కోసం వాడేదే. ఊహాశక్తిలో పిల్లలు మన కంటే ఏమాత్రం తీసిపోరు. కాబట్టి భాషను మార్చను. వాక్య నిర్మాణం మాత్రం మారుతుంది. అంత్యప్రాస పిల్లల భాషలో భాగం. అది వాళ్ళ పసితనానికీ అమాయత్వానికీ భావోద్వేగాలకూ దగ్గరగా వెళుతుంది.
సృష్టించిన పాత్రల్లో దగ్గరగా అనిపించే పాత్ర
నాకు దగ్గరగా అనిపించే పాత్ర నేనే. నేను రాసిందంతా నా జీవితం నుంచి పుట్టిందే. నా రచనల్లో ‘నేను’ అని మాట్లాడే ప్రతి పాత్ర లోనూ నేనున్నాను. నా రచనల్లో కనపడే ప్రదేశాలన్నీ నేను తిరిగినవీ, చూసినవీ! నేను చూడని, వినని వాటిని కూడా నా ఊహాశక్తితో సొంతం చేసుకుంటాను.
పాత రచనల్లో ఏదైనా మార్చే వీలుంటే...
మార్చాలన్న యావ ఉంటుంది. అందుకే ఒకసారి పబ్లిష్ అయ్యాక ఇక వాటి వంక మళ్ళీ చూడను. చూస్తే మార్చాలనిపిస్తుంది. కానీ ఒకసారి పబ్లిష్ అయ్యాకా ఆ రచన పాఠకులది అవుతుంది. వాళ్ళు ఒక రచనను తమ సొంతం చేసుకున్నాక ఇక దాన్ని మార్చే హక్కు నాకు లేదు.
స్థానీయత
స్థానీయత లోనే విశ్వజనీనత ఉంటుంది. మన స్థానీయతను కాపాడుకోవాలి. మన బాల్యాన్నీ గడిచిన జీవితాన్నీ జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ప్రతి మనిషీ తన చరిత్రను రాసుకోవాలి. అలా రాసుకుంటే మనకి మరే చరిత్ర పుస్తకాల అవసరమూ ఉండదు. ప్రతి మనిషీ జీవితంలో కనీసం ఒక్క పుస్తకమైనా రాయాలి.
జ్ఞానపీఠ్ అవార్డుపై స్పందన
ఈ అవార్డు ఒక తియ్యని కబురు అని మాత్రం అనను. ఎందుకంటే నేను డయాబెటిక్! జీవితంలో చాలా చూశాను, విన్నాను, అనుభవించాను. కానీ చాలా తక్కువే రాయగలిగాను. రాసింది చూసుకుంటే రాయాల్సింది చాలా మిగిలే ఉందనిపిస్తూంది. మిగిలిన రచనలన్నీ త్వరగా పూర్తి చేయాలని ఉంది. కానీ పూర్తి చేయలేకపోవచ్చు. నా జీవితం వేగంగా ముగింపు వైపు దూసుకుపోతోంది. అంత వేగంగా ఎలా రాయాలో నాకు తెలీదు.
ఈ వార్తలు కూడా చదవండి...
Ugadi Wishes 2025: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్..
Ugadi Awards 2025: ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే: సీఎం చంద్రబాబు..
TDP Nara Lokesh: సీనియర్లకు గౌరవం.. జూనియర్లకు ప్రమోషన్
For More AP News and Telugu News