Health Tips : ఈ అలవాటు మానుకోండి.. లేకపోతే డయాబెటిస్ ముప్పు..
ABN , Publish Date - Jan 15 , 2025 | 12:50 PM
భారతదేశంలో డయాబెటిస్ పెద్ద ముప్పుగా మారింది. ఎంతలా అంటే "డయాబెటిస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్" అని పిలిచేంతగా. ఈ అలవాట్లు మానుకోకపోతే డయాబెటిస్ నుంచి తప్పించుకోవడం కష్టం అంటున్నారు ఆరోగ్య నిపుణులు..

భారతదేశంలో డయాబెటిస్ పెద్ద ముప్పుగా మారింది. ప్రపంచ మానవాళిని పట్టి పీడిస్తున్న ఈ తీపి రుగ్మతకు ఎక్కువగా మనోళ్లే బలవుతున్నారు. ఎంతలా అంటే "డయాబెటిస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్" అని పిలిచేంతగా. ప్రపంచ మధుమేహ జనాభాలో మన దేశంలోనే 17% మంది ఉన్నారు. సుమారు 8 కోట్ల మంది భారతీయులు చక్కెర వ్యాధితో బాధపడుతున్నారు. 2045 నాటికి ఈ సంఖ్య 135 మిలియన్లకు పెరుగుతుందని అంచనా. మధుమేహం ఒకసారి వచ్చిందంటే ఇతర జబ్బులను వెంటబెట్టుకొస్తుంది. డయాబెటిస్ బాధితులే ఎక్కువగా అధిక రక్తపోటు, గుండె, మూత్రపిండాలు, నాడీవ్యవస్థ, కళ్లు ఇలా ఏదొక రకమైన తీవ్రమైన సమస్యలతో బాధపడుతున్నారు. మీరు అనుసరిస్తున్న ఈ అలవాట్లను ఇప్పటికైనా మార్చుకోకపోతే మీతో పాటు మీ భవిష్యత్ తరాలనూ ఇబ్బందుల్లోకి నెట్టిన వాళ్లవుతారు. ఎందుకంటే, వయసుతో నిమిత్తం లేకుండా అందరినీ డయాబెటిస్ ఇబ్బందిపెడుతోంది.
మధుమేహం ఎందుకు ప్రమాదకరం..
టైప్ 2 మధుమేహ వ్యాధిగ్రస్తులలో మూడింట ఒక వంతు మందికి వ్యాధి నిర్ధారణ కాదు. వ్యాధి లక్షణాలు కనిపించకపోవడమే కారణం. అలాగని పరీక్షలు చేయించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలిక హైపర్గ్లైసీమియా సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇది కళ్ళు, మూత్రపిండాలు, నరాలు, గుండె,రక్త నాళాలు వంటి అవయవాలను దెబ్బతీస్తుంది. ఇలాంటి వారిలో గుండెజబ్బులు, వ్యాస్కూలర్ డీసీజ్, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, అధిక రక్తపోటు సమస్యలు కనిపించడం సర్వసాధారణం. శరీరంలో ఇన్సులిన్ స్థాయి పెరిగే కొద్దీ నరాలు దెబ్బతినడం,మూత్రపిండ వ్యాధులు, సిర్రోసిస్, కాలేయ వైఫల్యాలు, అంధత్వం కూడా తలెత్తుతుంది.
ఈ అలవాట్లు మానుకుంటే రాదు..
మధుమేహం దీర్ఘకాలిక రుగ్మత. ఒకసారి వచ్చిందంటే అదుపు చేయడం తప్ప మన చేతుల్లో ఇంకేం ఉండదు. అందుకే నియంత్రణ కంటే నివారణే మేలు. చాలామంది పనుల్లో బిజీగా ఉండి ఒకేసారి ఎక్కువగా తినడం లేదా చాలాసేపు తినకపోవడం చేస్తుంటారు. ఇదే అలవాటుగా మారితే శరీరంలో చక్కెర స్థాయుల్లో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. అందువల్ల తక్కువ కేలరీలతోనే ఎక్కువ పోషకాలు దక్కేలా చూసుకోవాలి. కార్బోహైడ్రేట్లతో పాటు మేలైన మాంసకృత్తులు, పీచు, కొవ్వులు, ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, విటమిన్-సి, బి- కాంప్లెక్స్ విటమిన్లు మొదలైన కీలకమైన పోషకాలు తప్పనిసరిగా డైట్‌లో భాగం చేసుకోవాలి. ఫాస్ట్‌ఫుడ్, జంక్‌ఫుడ్, అధిక వేపుళ్లకు దూరంగా ఉంటే మేలు.
ముందస్తుగా గుర్తించడం ముఖ్యం..
ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో చేసుకునే మార్పులే మధుమేహానికి తొలి మెట్టు వేస్తాయి. షుగర్ లెవల్స్ నియంత్రించడంలో విఫలమైతే సమస్య మొదలవుతుంది. ఒకవేళ తొలిదశలోనే నిర్ధారణ అయితే తక్కువ తినడం, కొన్ని పదార్థాలు అసలే తినకపోవడం చేయకండి. తరచూ డాక్టర్ దగ్గరకు వెళ్లి షుగర్ టెస్ట్ చేయించుకుంటూ ఉండే సమస్య తీవ్రం కాకముందే జాగ్రత్త పడేందుకు అవకాశం లభిస్తుంది. సకాలంలో గుర్తిస్తే చక్కెర వ్యాధి నిర్వహణ సులువు అవుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం, బరువుపై నియంత్రణ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడంలో సహాయపడుతుంది. తద్వారా మందుల వాడకాన్ని నివారించవచ్చు.