Share News

Smoking: రోజుకు ఒక్క సిగరెట్ తాగితే ఏం కాదని అనుకుంటున్నారా? ఇది ఎంతటి ప్రమాదమో తెలిస్తే..

ABN , Publish Date - Jan 02 , 2025 | 11:20 AM

ధూమపానం అలవాటు ఉన్న పురుషుల్లో ఒక్క సిగరెట్‌తో ఆయుర్దాయంలో 17 నిమిషాల మేర కోత పడుతుంది. మహిళలు తమ జీవితంలో ఏకంగా 22 నిమిషాలు కోల్పోవాల్సి వస్తుందని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు తాజా తెలిపారు.

Smoking: రోజుకు ఒక్క సిగరెట్ తాగితే ఏం కాదని అనుకుంటున్నారా? ఇది ఎంతటి ప్రమాదమో తెలిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: ధూమపానంతో అలవాటు ఉందా? రోజులో ఒకటో రెండో సిగరెట్‌లు తాగుతాం ఏం పర్లేదని అనుకుంటున్నారా? ఈ భ్రమలు, అపోహలు తొలగించే కీలక అధ్యయనాన్ని శాస్త్రవేత్తలు తాజాగా ప్రచురించారు. ఒక్క సిగరెట్‌తో ఆయుర్దాయం ఏమేరకు తగ్గుతుందో కచ్చితమైన లెక్కలతో కళ్లకుకట్టినట్టు వివరించారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఈ అధ్యయనం (Health) పూర్తి వివరాల్లోకి వెళితే..

జర్నల్ ఆఫ్ అడిక్షన్‌లో ఈ అధ్యయనం తాలూకు వివరాలు ప్రచురితమయ్యాయి. వీటి ప్రకారం, రోజుకు 10 సిగరెట్లు తాగే వారు ఈ అలవాటును జనవరి 1న విడిచిపెట్టి ఉంటే జనవరి 8 నాటికల్లా ఆయుర్దాయంలో ఒక రోజు కోత పడకుండా అడ్డుకోగలరు. ఇక ఫిబ్రవరి 5 కల్లా ఆయుర్దాయం ఏకంగా వారం మేర పెరుగుతుంది. ఆగస్టు 5 నాటికి జీవితకాలం ఏకంగా నెల రోజుల మేర పెరుగుతుంది. ఈ ఏడాదంతా ధూమపానానికి దూరంగా ఉంటే జీవితకాలాన్ని ఏకంగా 50 రోజుల మేర పొడిగించుకోవచ్చు. ఒక్క సిగరెట్ కారణంగా మహిళల ఆయుర్దాయంలో 22 నిమిషాల మేర కోతపడితే పురుషుల జీవితకాలం 17 నిమిషాల మేర తగ్గుతుంది.

Meditation: ఈ సంవత్సరం మీ జీవితంలో గొప్ప మార్పులు కోరుకుంటున్నారా? ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి!


‘‘ధూమపానం హానికరమని అందరికీ తెలిసిందే కానీ దీని ప్రభావాలను ప్రజలు తక్కువగా అంచనా వేస్తుంటారని’’ అధ్యయనానికి నేతృత్వం వహించిన డా. సారా జాక్సన్ తెలిపారు. ‘‘ధూమపానం అలవాటు ఉన్న వారు తమ ఆయుర్దాయంలో ఏకంగా 10 ఏళ్లను కోల్పోతారు. అంటే, సన్నిహితులతో గడపాల్సిన ఎన్నో మధుర క్షణాలకు దూరమవుతారు. కీలకమైలు రాళ్లను చూడకుండానే కన్నుమూస్తారు’’ అని వ్యాఖ్యానించారు.

Ice Cubes: ఐస్ క్యూబ్స్‌ను ఇలా వాడితే చర్మ సమస్యల నుంచి ఉపశమనం!


‘‘జీవిత చరమాంకంలో కొన్ని ఏళ్లు కోల్పోతే వచ్చే నష్టమేంటని కూడా కొందరు భావిస్తుంటారు. వీళ్లకు అర్థంకాని విషయం ఏంటంటే.. ఈ అలవాటు కారణంగా యవ్వనంలోని ఆరోగ్యాన్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది. రోగాలను ముందుగానే ముంచుకొచ్చేలా చేస్తుంది. ఉదాహరణకు ధూమపానం అలవాటు ఉన్న వ్యక్తి 60 ఏళ్ల వయసులో ఉన్నా 70 ఏళ్ల వయసున్న వారిలో కనిపించే అనారోగ్యాల బారిన పడతారు’’ అని డా. సారా వివరించారు.

ఆరోగ్యం కాపాడుకోవాలంటే ధూమపానం అలవాటును పూర్తిగా కట్టిపెట్టాలని అధ్యయనకర్తలు స్పష్టం చేశారు. ధూమపానంతో స్ట్రోక్, హృద్రోగాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. ఈ అనారోగ్యాల ప్రమాదం ఏకంగా 50 శాతం మేర పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.

‘‘ధూమపానం అలవాటు మానేస్తే ఏ వయసులో ఉన్న వారైనా ఆరోగ్య ప్రయోజనాలు పొందగలుగుతారు. ధూమపానం అంటే మరణానికి దగ్గర చేసే ఎస్కలేటర్’’ అని వ్యాఖ్యానించారు.

Read Latest and Health News

Updated Date - Jan 02 , 2025 | 11:22 AM