Delhi Election Results: అభివృద్ధి, సుపరిపాలనే గెలిచింది.. ఢిల్లీ గెలుపుపై ప్రధాని మోదీ..
ABN , Publish Date - Feb 08 , 2025 | 03:31 PM
ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో 47 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం కనబరిచి కమలం పార్టీ గెలుపు ఖాయం చేసుకుంది. దశాబ్దకాలం తర్వాత ఢిల్లీ పీఠం చేజార్చుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి, సుపరిపాలనకే ఢిల్లీ ఓటర్లు పట్టం కట్టారని ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు భారతీయ జనతా పార్టీకే పట్టం కట్టారు. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటి స్పష్టమైన ఆధిక్యం కైవసం చేసుకుంది కమలం పార్టీ. ఆప్ పార్టీతో పాటు అధినేత కేజ్రీవాల్ విజయపరంపరకూ చెక్ పెట్టింది. చీపురు పార్టీ పదేళ్ల పాలనకు తెరదించి 27 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత దేశరాజధాని గద్దెపై కూర్చోనుంది. ఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ వర్మనే బీజేపీ సీఎం అభ్యర్థిగా ఖరారు చేసినట్లు అనధికారిక సమాచారం. బీజేపీ భారీ విజయాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీతో పాటు అభివృద్ధి, సుపరిపాలనకే ఢిల్లీ ఓటర్లు పట్టం కట్టారని ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
అభివృద్ధి, సుపరిపాలన గెలిచాయి..ప్రధాని మోదీ..
ఢిల్లీలో బీజేపీ భారీ మెజార్టీతో గెలుపు ఖాయం చేసుకోవడాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ స్పందించారు. 'ప్రజల శక్తి అత్యున్నతమని ఆయన రాశారు! అభివృద్ధి గెలిచింది, సుపరిపాలన గెలిచింది. బిజెపికి చారిత్రాత్మక విజయాన్ని అందించినందుకు ఢిల్లీ లోని నా సోదరసోదరీమణులందరికీ నా వందనం మరియు అభినందనలు! మీరు నాకు ఇచ్చిన అపారమైన ఆశీర్వాదాలు మరియు ప్రేమకు నేను మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞుడను. ఢిల్లీ అభివృద్ధిని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచేందుకు ఉన్న ఏ అవకాశాన్ని వదలుకోం. ఇది మా హామీ. దీనితో పాటు అభివృద్ధి చెందిన భారతదేశాన్ని సృష్టించడంలో ఢిల్లీ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని మేము భావిస్తున్నాం. ఈ తీర్పు కోసం పగలు రాత్రి పనిచేసిన నా బీజేపీ కార్యకర్తలందరినీ చూసి నేను చాలా గర్వపడుతున్నాను. ఇప్పుడు మేము మా ఢిల్లీ వాసులకు మరింత అంకితభావంతో సేవ చేసేందుకు సిద్ధంగా ఉంటాము.' అని ట్వీట్ చేశారు.