Delhi Election Results: ఇంకా కొట్టుకోండి..ఒకరినొకరు నాశనం చేసుకోండి..ఆప్, కాంగ్రెస్‌లపై కాశ్మీర్ సీఎం ఫైర్..
ABN , Publish Date - Feb 08 , 2025 | 02:08 PM
ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుపు ఫిక్స్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ మూడోసారి కూడా అడ్రస్ లేకుండా పోగా.. ఆప్ పార్టీ నాలుగోసారి ఢిల్లీ గద్దెనెక్కాలనే ఆశ ఆవిరైంది. ఈ నేపథ్యంలోనే జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆప్, కాంగ్రెస్ పార్టీల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కలసికట్టుగా ఉండనందువల్లే ఈ పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు.

ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుపు ఫిక్స్ అయిపోయింది. వరసగా నాలుగోసారి గెలవాలనే ఆశ అటుంచితే ఏకంగా ఆప్ పార్టీ అధినేత కేజ్రీవాలే ఓటమి పాలయ్యారు. దేశరాజధానిలో తన ఉనికి చాటుకోవాలని శతవిధాలా ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీకి ముచ్చటగా మూడోసారి తీవ్ర నిరాశే మిగిలింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెప్పినట్టుగానే కమలం పార్టీ ఆప్, కాంగ్రెస్ పార్టీలను ఊడ్చిపడేసింది. 27 ఏళ్ల ఢిల్లీ పీఠం ఎక్కేందుకు మార్గం సుగమం చేసుకుంది. ఢిల్లీ ఫలితాల్లో బీజేపీ గెలుపు ఖరారైన వెంటనే కేజ్రీవాల్‌ను సామాజిక కార్యకర్త అన్నాహజారే విమర్శించగా.. తాజాగా నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నాయకుడు, జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆప్, కాంగ్రెస్ పార్టీల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
మీలో మీరు కొట్టుకోండి.. సీఎం ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం..
ఇప్పటికే కేజ్రీవాల్ తీరుపై సామాజిక కార్యకర్త అన్నాహజారే తీవ్ర విమర్శలు చేయగా.. నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నాయకుడు, జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆప్, కాంగ్రెస్ పార్టీలు ఢిల్లిలో విడివిడిగా పోటీచేసినందువల్లే ఈ చేదు ఫలితం చవిచూడాల్సి వచ్చిందని విరుచుకుపడ్డారు. ఇంకా మీలో మీరే కొట్టుకుంటూ ఉండండి.. ఒకరినొకరు నాశనమయ్యే వరకూ ఇలానే చేసుకోండి.. అంటూ ఇండియా కూటమిలో ఐక్యత కొరవడటంపై ఎక్స్ వేదికగా తీవ్రంగా విమర్శించారు. ఇలా వేర్వేరుగా ఉండటం కంటే ఇండియా కూటమి నుంచి విడిపోవడం మంచిదని సూచించారు.
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీని గద్దే దించడమే లక్ష్యంగా కాంగ్రెస్, ఆప్, తృణమూల్ వంటి దేశంలోని వివిధ పార్టీలు ఇండియా కూటమి ఏర్పాటు చేశాయి. అయితే, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీట్ల పంపకం విషయంలో కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు కుదరలేదు. ఏకాభిప్రాయానికి రాలేక ఇరు పార్టీలు విడివిడిగా పోటీచేశాయి. ఒంటరిగా పోటీచేయడం వల్ల కాంగ్రెస్, ఆప్ పార్టీలు ఎన్నికల ప్రచారంలో ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నాయి. ఇది బీజేపీ పార్టీకి లాభించడంతో 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠం చేజిక్కించుకుంది.
ఇవి కూడా చదవండి..